
అతను అదనపు భూమినో
అర్ధ సామ్రాజ్యాన్నో అడగడం లేదు
పొలం తరఫున పంట కోసం
ఎరువును అడుగుతున్నాడు
అరువుకు కాదు ఖరీదుకే!
ఇంట్లోనో పొలం దగ్గరో ఉండి
అతను హుకుం జారీ చేయడం లేదు
క్యూలో నిల్చుని మట్టి చేతులు మోడ్చి
మరీ అడుగుతున్నాడు
పోలింగ్ బూత్ క్యూలనైతే మీరు
ప్రేమతో పట్టించుకుంటారు కదా!
పొలం వచ్చి క్యూలో నిల్చుంటే
అసలు పట్టనట్లుంటే ఎట్లా?
ఇది అన్న మూలమన్న సంగతి
మరిస్తే ఎట్లా?
తెలుసుకోండి:
అతను ఎరువు కోసం
క్యూలో నిల్చున్నాడంటే
దేశం అన్నం కోసం
క్యూలో నిల్చున్నట్లే!
– దర్భశయనం శ్రీనివాసాచార్య
94404 19039