
ఇంటి పనులూ బయటి పనులూ
చింతలూ చిక్కులూ చికాకులూ రోజూ వుండేవే
వాటికి కాస్త విరామమిస్తూ విహారానికని
అపుడపుడు ఊరు దాటి బయటికి వెళ్లొస్తాం
దూరమైనా ఈ పరి ఈ కాశ్మీరానికి వచ్చాం ముచ్చటపడి –
ఏమంద మేమంద మేమందం అంటూ పచ్చగా
మురిసిపోతూ మేం ఉల్లాసపడుతున్న వేళ
అదాటున కాల్పులు! కళ్లెదుటే
మా ఇంటి మనిషి క్షణాల్లో శవమయ్యాడు
భూతల స్వర్గపు పచ్చదనం ఉన్నట్టుండి
ధడేల్మని ఎరుపెక్కుతుందని తెలిస్తే
అసలు ఇటు నిండు కుటుంబంగా వచ్చే వాళ్ళమా!
నిండు మనిషిని పోగొట్టుకునే వాళ్ళమా!
ఇపుడు మాకు ఏ అందాల సంబరాలొద్దు
మా మనిషి మాక్కావాలి, తెచ్చిస్తారా ఊపిరితో –
ఈ సరిహద్దు వివాదాలూ లోయలో కల్లోలాలూ
తుపాకుల కవాతులూ పేలుళ్ళూ దాడులూ
ఇక్కడి చరిత్రా మాకేం తెలుసు! మామూలు మనుషులం
తుపాకులు, ఎదురు తుపాకులతోనే తలపడతాయని తలచాం
కానీ... యాత్రికుల కన్నులను సైతం తుపాకుల్లా చూస్తాయని
గుర్తించి మరీ గురి చూస్తాయని అనుకోలేదు!
ఉన్నట్టుండి ఈ కొత్త చోటున మేం ఎవరికి ఇంతలోనే
ఇంత బద్ధ శత్రువులమెట్లయ్యామో తెలియట్లేదు
ముగ్గురం వచ్చి ఇపుడిద్దరమే ఇంటికెళ్తున్నాం
మూడో మనిషేడని ఇల్లు కలవరపడుతూ అడుగుతుంది
దాన్ని ఎట్లా ఓదార్చాలి? మా మనిషి లేడు నిట్రాడు లేదు
మరింత బరువైపోయిన మా బతుకు! ఇపుడు ఎట్లా నిలబడేది
క్షణ క్షణం భయం భయంగా వుంది మా బయటా మా లోపలా –
కారణమెవరని ఇపుడు మేం ఎవ్వరినడగాలి?
– దర్భశయనం శ్రీనివాసాచార్య
ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?