సత్యం కోసం మహా త్యాగం.. | Highlights Of The Muharram Festival Written By Usman Khan Geust Column Story | Sakshi
Sakshi News home page

సత్యం కోసం మహా త్యాగం..

Jun 26 2026 9:43 AM | Updated on Jun 26 2026 9:43 AM

Highlights Of The Muharram Festival Written By Usman Khan Geust Column Story

ముహర్రం

కర్బలా యుద్ధం

న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం

‘ముహర్రం’ ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటి నెల. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈ నెలలో అత్యంత ప్రాముఖ్యమైనది పదవ రోజైన ‘ఆషురా’. ఆరోజు ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. శతాబ్దాల క్రితం, కర్బలా మైదానంలో ప్రవక్త(స) వారి మనుమడైన హజ్రత్‌ ఇమామ్‌ హుసైన్‌ (రజి) ఆయన 72 మంది అనుచరులు అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు.

యజీద్‌ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా, ఇస్లామీయ మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఇమామ్‌ హుసైన్‌ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆకలి దప్పులతో అలమటించినాసరే, ధర్మం వైపే నిలబడి వీరమరణం పొందిన ఆయన ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. అందుకే ముహర్రం అంటే పండుగ కాదు, అది సత్యం కోసం జరిగిన మహా త్యాగానికి ప్రతిరూపం.

ఈ కర్బలా యుద్ధం కేవలం రెండు శక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు; అది న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. తన కళ్లెదుటే పురిటిపాపల నుండి వృద్ధుల వరకు దాహంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నా, ఇమామ్‌ హుసైన్‌ అధర్మానికి తలవంచలేదు. ఆయన చూపిన ఈ ధీరత్వం శతాబ్దాలు దాటినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది.

అందుకే ఈ రోజున ముస్లింలే కాకుండా, మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటారు. సత్యం కోసం ప్రాణాలనైనా అర్పించవచ్చు కానీ, అన్యాయంతో చేతులు కలపకూడదు. అనే గొప్ప జీవన సందేశాన్ని ముహర్రం మానవాళికి అందిస్తోంది. – ఎం.డి. ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement