యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం | Encouragement for young creators in Entertainment Industry | Sakshi
Sakshi News home page

యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం

Apr 26 2025 3:35 AM | Updated on Apr 26 2025 3:35 AM

Encouragement for young creators in Entertainment Industry

వాణిజ్య సుంకాలు, స్టాక్‌ మార్కెట్‌ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్‌ పవర్‌ హౌస్‌’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్‌కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్‌ ఇన్‌ ఇండియా, క్రియేట్‌ ఫర్‌ ద వరల్డ్‌’ విజన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్‌) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్‌ ఇ) రంగం ముందుకు సాగుతోంది.

చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్‌ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్‌–2’ సినిమా ఆస్కార్‌ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్‌ఎక్స్‌ను అందించిన విజువల్‌ ఎఫెక్ట్స్, యానిమేషన్‌ స్టూడియోగా నమిత్‌ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్‌ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్‌ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్‌కు 7వ ఆస్కార్‌ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్‌ మేకింగ్‌ నుంచి డిజిటల్‌ నిర్మాణానికి మళ్ళుతూ  ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించడంలో భారత్‌ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్‌లో భాగమైన వేవ్స్‌ ఎక్స్‌లెరేటర్‌ (వేవెక్స్‌) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్‌ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్‌ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.

కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్‌ గేమ్‌ స్టూడియోస్, కీబౌండ్, వాయన్‌ క్లౌడ్‌ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్‌ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్‌వింగ్‌ స్టూడియోస్, వైగర్‌ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్‌ అందిస్తుంది. 

పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్‌షిప్‌ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది.  కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్‌తో ‘బయోకాన్‌’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.

క్రియేటివ్‌ హబ్‌  
కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఫొటోగ్రఫీ (మ్యాప్‌), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.

కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్‌... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్‌ నుంచి ఇమ్మర్సివ్‌ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్‌ ఇన్‌ ఇండియా, క్రియేట్‌ ఫర్‌ ద వరల్డ్‌’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.

సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకం
సాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్‌ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్‌/వీఆర్, గేమింగ్, మెటావర్స్‌ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్‌ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్‌ బజార్‌లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్‌ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.  

సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్‌ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్‌ ద్వారా అమేజ్‌ స్టూడియోస్, ఆఫ్‌లైన్‌ హ్యూమన్‌ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని  పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్‌స్కేప్‌ ఎక్స్‌ఆర్, విజన్‌ ఇంపాక్ట్‌ వంటి ఎడ్‌–టెక్‌ వెంచర్లు ఇమ్మర్సివ్‌ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.

భవిష్యత్‌ దృక్కోణం
మీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్‌ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్‌ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్‌ ల్యాబ్‌ కావొచ్చు, డిజిటల్‌ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.

వేవ్స్‌–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్‌ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్‌ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్‌లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.

-వ్యాసకర్త బయోకాన్‌ గ్రూప్‌ చైర్‌ పర్సన్‌
-కిరణ్‌ మజుందార్‌ షా

Advertisement
 
Advertisement
Advertisement