
మహోన్నతంగా నిలుస్తున్న అవయవదానం
ఒకరి త్యాగం.. పలువురికి పునర్జన్మఅవయవదానంతోనే అది సాధ్యం
జిల్లాలో పెరుగుతున్న దాతలు ముందుకొస్తున్న కుటుంబాలు
నేడు అవయవదాన దినోత్సవం
ఒడిశా, హిరమండలం: జిల్లాలో అవయవదానంపై చైతన్యం పెరుగుతోంది. కుటుంబసభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కొంతమంది ప్రమాదాలబారిన పడినప్పుడు బ్రెయిన్ డెడ్‌కు గురవుతున్నారు. అటువంటి వారి అవయవాలను కుటుంబసభ్యుల సమ్మతితో దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఒక మనిషి అవయవదానంతో 8 మంది ప్రాణాలను నిలపవచ్చు. కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కవటాలు, పేగులు, క్లోమం, కారి్నయా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంతభాగం దానం చేయవచ్చు.
బ్రెయిన్ డెడ్ అయితే..
రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది తీవ్రగాయాలపాలవుతుంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు మెదడు దెబ్బతిని బ్రెయన్ డెడ్ అవుతుంటుంది. తిరిగి కోలు కోలేని స్థితికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. వీటన్నింటినీ నడిపించే కీలకమైన అవయవం మెదడు మాత్రం పనిచేయదు. దానినే బ్రెయిన్ డెడ్ అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్య తలెత్తినప్పుడు కూడా బ్రెయిన్‌డెడ్ కావొచ్చు.
నిర్థారణ కీలకం..
ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యారని నిర్దారించేందుకు కట్టుదిట్టమైన విధానాలు ఉన్నాయి. ఆస్పత్రి వైద్యులు మాత్రమే దీనిని నిర్ధారించరు. ఇతర ఆస్పత్రుల వైద్యులు, జీవన్‌దాన్ సంస్థ తరఫున వచ్చే నిపుణులు వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడకు 6 గంటల తరువాత మరో బృందం పరిశీలించి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తారు. శ్వాసతీసుకునే పరిస్థితి ఉండకపోవడం, ఒకవేళ కృత్రిమ శ్వాస తీసిన 5 నిమిషాల్లో చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కనుపాపల్లో వెలుతురు పడినా స్పందించకపోయేవారిని, కాళ్లు, చేతులు, తల ఎంతమాత్రం కదపలేకపోయేవారిని, మెదడుకు ఏమాత్రం రక్తప్రసరణ జరగడం లేదని నిర్ధారించుకున్న తరువాత బ్రెయిన్ డెడ్ అని తేల్చుతారు.

ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్‌కు తీసుకురాగా బ్రెయిన్‌డెడ్‌గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్‌చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్‌కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్‌డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్‌చానెల్ ద్వారా అవయవాలను తరలించారు.
పునర్జన్మ
అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్,వైద్యాధికారి, హిరమండలం పీహెచ్‌సీ
ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
కఠిన నిబంధనలు..
బాధితుల నుంచి అవయవాలను సేకరించే వైద్యులు తప్పకుండా జీవన్‌దాన్‌లో నమోదై ఉండాలి. తమ పేర్లు తప్పకుండా రిజి్రస్టేషన్లు చేయాలి. మన జిల్లాకు సంబంధించి జెమ్స్ ఆస్పత్రి వైద్యులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారికి, అవయవాలు అవసరమైన వారికి ఈ వైద్యులు బంధువులు కాకూడదు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యుల అంగీకారం కీలకం. ఎవరికైనా అవయవాలు అవసరమైతే జీవన్‌దాన్‌లో నమోదుచేసుకోవాలి. అవయవదాత ఉన్నారని సమాచారం అందితే ప్రాధాన్యతాక్రమంలో, ముందు వరుసన బట్టి అవయవాలను తెచ్చి అమర్చుతారు. గుండెను బయటకు తీశాక 4 గంటల్లో అమర్చితే ఫలితాలు 90 శాతం మెరుగ్గా ఉంటాయి. ఆరు గంటలు లోపు అయితే 50 శాతం ఫలితమే ఉంటుంది. 6 గంటలు దాటితే అమర్చినా ఫలితం ఉండదు. ఊపిరితిత్తులు 8 గంటల్లోపు, కాలేయం 18 గంటల్లోపు, కిడ్నీ 24 గంటల్లోపు అమర్చాలి.