World Marketing Day: ఆన్‌లైన్‌ షాపింగ్‌ మంచిదేనా..? | World Marketing Day: These days many people prefer online shopping | Sakshi
Sakshi News home page

ప్రపంచ మార్కెటింగ్‌ దినోత్సవం: అన్నీ.. ఇంటికే! గడపదాటని జనం..

May 27 2025 9:50 AM | Updated on May 27 2025 10:48 AM

World Marketing Day: These days many people prefer online shopping

స్కూటీపై కూర్చున్న ఇతను పవన్‌. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్‌నగర్‌కు చెందిన పవన్‌ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్‌ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు. షాపింగ్‌.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.  ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ డెలివరీబాయ్స్‌కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్‌ మెషిన్‌లా మారిన నేటి కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌.. పరిణామాలపై మంగళవారం ప్రపంచ మార్కెటింగ్‌ దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..

 

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన రమేశ్‌ గతంలో కూరగాయల మార్కెట్‌కు నడిచి వెళ్లి కూరగాయలు, ఇతర వస్తువులు కొని తెచ్చేవాడు. కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులను పలకరిస్తూ బేరం చేసి మరీ కొనేవాడు. కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రైవేటు హోం డెలివరీ ఏజెన్సీలు రావడంతో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నాడు. ఎక్కువ సేపు కదలకుండా ఉండడంతో శారీరక శ్రమ కరువైంది. ఇప్పుడు రమేశ్‌కు సయాటిక సమస్య వచ్చింది.

జగిత్యాలకు చెందిన నవీన్, అనిత దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఉరుకులు.. పరుగుల జీవితం. ఇలాంటి పని ఒత్తిడిలో షాపింగ్‌కు వెళ్లి వస్తువులు కొనే సమయం, తీరికలేక ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంట్లోకి, పిల్లలకు ఏ సామగ్రి అవసరమున్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమ తగ్గింది. ఈ మధ్య నవీన్‌ తీవ్రంగా అలసిపోవడంతో డాక్టర్‌ వద్దకు వెళ్తే షుగర్‌ వచ్చిందని నిర్ధారించారు.

ఒక చేతిలో కిరాణ సామగ్రి, మరో చేతిలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఇతను అంబ దాస్‌. సిరిసిల్లకు చెందిన అంబదాస్‌ డిగ్రీ వరకు చదివి ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఎవరు కిరాణ సామగ్రి, ఇతర వస్తువులు ఆర్డర్‌ చేసినా ఇంటి వరకు వెళ్లి డోర్‌ డెలివరీ చేశాడు. ఇలా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. 

మంచినూనె.. వాటర్‌ విులన్‌..       టీషర్ట్‌.. చెప్పులు.. మందులు.. బిర్యానీ..     ఇలా ఏది కొనాలన్నా సెల్‌ఫోన్‌ ఉంటే చాలు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తే నిమిషాల్లో డెలివరీ చేస్తారు. ఆన్‌లైన్‌ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇరుగు పొరుగు.. కుటుంబ సభ్యులతో బజారుకు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. దుకాణాలకు వెళ్లడం ద్వారా వ్యాపారులు, వినియోగదారుల మధ్య అనుబంధం పెరిగేది. నేడు ఆ పరిస్థితులు లేవు. 

చాలామంది అడుగు తీసి బయట వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడ్డ నేటి జనం ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే మధుమేహం..     రక్తపోటు.. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. 

విస్తరిస్తున్న వ్యాపారం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మేజర్‌ గ్రామాల్లోనూ ఆన్‌లైన్‌ వ్యాపారం విస్తరిస్తున్నాయి. మల్టీనేషనల్‌ కంపెనీలు, కార్పొరేట్‌ కంపెనీలు వ్యాపారాన్ని గల్లీ వరకు విస్తరించేశాయి. డోర్‌ డెలివరీ విధానంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. 

సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు అన్నీ ఇంటికే అందిస్తామని వ్యాపారం ప్రారంభించి విస్తరిస్తున్నారు. ఇలా వ్యాపారాభివృది్ధతోపాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆన్‌లైన్‌ సేవల్లో మూడు వేల మంది డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. 

కనీస శ్రమ లేక ఆరోగ్య సమస్యలు
మనిషి సగటున నిత్యం 6వేల అడుగులు వేయాలని వైద్యులు చెబుతున్నారు. కనీస శారీరక శ్రమ లేక అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నిత్యం నడకతో జీవితాన్ని ప్రారంభించే వారు ఒక్క శాతం ఉంటే.. అసలు శారీరక శ్రమ లేకుండానే జీవించే వారు 99 శాతం మంది ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 

మనకు తెలియకుండానే జబ్బులతో జీవిస్తూ.. ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో వైద్యవ్యాపారం ఇప్పటికే చాలా వరకు విస్తరించింది. దీనికి కనీస శ్రమ లేక పోవడంతో ప్రధాన కారణం.

కొత్తగా ప్రారంభించాం
సిరిసిల్లలో కొత్తగా ‘వీఆర్‌ విత్‌ యూ’ పేరుతో ఆన్‌లైన్‌ డెలివరీ సర్వీసులను ప్రారంభించాం. బిజీ లైఫ్‌లో ఉన్న వారికి ఏది కావాలన్నా 15 నిమిషాల్లో ఇంటికి చేర్చుతున్నాం.         
– గాజుల రాకేశ్, సుభాష్‌నగర్, సిరిసిల్ల

రోజూ 35 డెలివరీలు 
నేను ఈ మధ్యే డెలివరీ బాయ్‌గా చేరాను. ఇప్పుడు రోజూ 35 డెలివరీలు ఇస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలతోపాటు శివారు గ్రామాల వరకు వెళ్తుంటాను. ఆన్‌లైన్‌ ఆర్డర్లు చాలా పెరిగాయి. నాలాగే అనేక మంది ఉపాధి పొందుతున్నారు. 
– సంగెం తరుణ్, డెలివరీ బాయ్, సిరిసిల్ల 

టైం లేకే ఆర్డర్లు
మార్కెట్‌కు వెళ్లి     తెచ్చుకునే టైం లేదు. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌ ఆర్డర్లే ఎక్కువ. సెల్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగం పెరిగింది. ఆన్‌లైన్‌ వ్యాపారం పెరిగింది. సమయం ఆదా అవుతుంది. బయటకు వెళ్లి వచ్చే టైంలో ఇంకో పని చేసుకోవచ్చు. ఆర్డర్‌ 15 నిమిషాల్లో ఇంటికే చేరుతుంది. ఇలాంటి సౌకర్యం ఉండగా షాపింగ్‌కు బయటకు ఎవరూ వెళ్తారు.   
– మామిడాల శ్యాం, సిరిసిల్ల

శారీరక శ్రమ ఉండాలి 
నిత్యం శారీరక శ్రమ ఉంటేనే ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి వ్యాయామం లేకుండా చాలామంది గడిపేస్తున్నారు. షుగర్‌ పెరగడానికి శారీరకశ్రమ లేకపోవడమే కారణం. మారిన జీవన శైలి కూడా కారణం. నిత్యం కొంత దూరమైన వాకింగ్‌ చేస్తే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు. 
– డాక్టర్‌ వంగ మురళీకృష్ణ, ఎండీ ఫిజీషియన్, సిరిసిల్ల  

(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!)

Advertisement
 
Advertisement
Advertisement