
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు. అంటే శిశువులు, పశువులే కాదు.. పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అదీ సంగీతానికి ఉన్న మహత్త్యం అని చెబుతుంటారు. గానంతో మేఘం వర్షిస్తుంది.. అగ్ని ప్రజ్వలిస్తుంది అంటారు. అందులో నిజమెంతుందో తెలియదు గానీ, అప్పుడెప్పుడో ఆ తల్లి నేర్చుకున్న సంగీత ఓనమాలను ఆమె పిల్లలు పట్టేశారు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా ఆటవిడుపుగా నేర్చుకున్న ఆ సంగీతాన్ని ఇద్దరు చిన్నారులు అవపోసన పట్టేశారు. ఇప్పుడు తల్లితో పాటు ఆ గారాలపట్టీలు ఇద్దరూ అరుదైన రికార్డును సొంతం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు.
18 దేశాలకు చెందిన కీబోర్డు కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రం కేపీహెచ్‌బీకాలనీ ఐదో ఫేజ్‌కు చెందిన తల్లి మేడిది లలితకుమారి తన ఇద్దరు కుమార్తెలు ఎనిమిదేళ్ల లీషా ప్రజ్ఞ, ఐదేళ్ల మేడిది అభిజ్ఞతో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు.
నెడిది జానకిరామరాజు, లలితకుమారి దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొమరగిరి పట్నంలో లలితకుమారి తన ఏడో ఏటా పియానో వాయించడం నేర్చుకున్నారు. అప్పట్లో కేవలం రెండు పాటలు మాత్రమే నేర్చుకోగా పెళ్లి అనంతరం కీ బోర్డు కొనుక్కుని స్వతాహ నేర్చుకోవడం మొదలుపెట్టారు.
ఆన్‌లైన్ తరగతులకు హాజరై కీబోర్డుపై మరింత పట్టు సాధించారు. ఆమె ఆసక్తిని గమనించి భర్త జానకిరామరాజు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. లలిత కుమారి సాధన చేస్తుంటే తన ఇద్దరు కుమార్తెలు లిషా ప్రజ్ఞ, అభిజ్ఞలు సైతం అనుసరించడం మొదలుపెట్టారు. ఇద్దరూ కూడా తల్లి ఇంట్లో పియానో కీబోర్డుపై ప్రాక్టీస్ చేయడం చూసి వారికి కూడా ఆసక్తి కలిగింది. ఇంకేం.. వారు సైతం బుల్లి పియానో కీబోర్డు కొనిపించుకుని తల్లితో పాటు ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు.
తైక్వాండో, స్విమ్మింగ్‌లో సైతం ప్రతిభ
అక్కా చెల్లెళ్లు లిషాప్రజ్ఞ, అభిజ్ఞలు తైక్వాండోలో సైతం రాణిస్తున్నారు. తైక్వాండో నేర్చుకుంటున్న అకాడమీలో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో బంగారు పతకాలను సాధించి నేటితరం చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్‌లో సైతం రాణిస్తుండటం గమనార్హం. లిషా ప్రజ్ఞ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతుండగా, అభిజ్ఞ మాంటిస్సోరి స్కూల్‌లో కిండర్ గార్టెన్‌లో చదువుతోంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు
తల్లీ కూతుళ్లు గత ఏడాది డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సృష్టించడానికి హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్ట్రాగామ్ వేదికగా వీడియోలను అప్‌లోడ్ చేశారు. దీనికి లండన్‌లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత రిచర్డ్ స్టన్నింగ్ విజేతలను ప్రకటించగా, అందులో తల్లి, తన ఇద్దరు కూతుళ్లు ఉండటం విశేషం.
డిసెంబర్ 9న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా రిచర్ట్ స్టన్నింగ్ వారిని అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అంగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. అతి పిన్న వయస్సులోనే ఈ రికార్డు నెలకొల్పినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను అభినందించారు.