
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.
దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది.
అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్‌ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్‌ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్‌తో హెన్ టే డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యింది.
గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్‌టే ఫోన్ కాల్‌లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్‌కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది.
30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్‌గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్‌కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది.
అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది.