
కొన్ని పండుగలు ప్రాణాలకే ప్రమాదం అన్నట్లుగా హడలెత్తిస్తాయి. కానీ సంప్రదాయం పేరుతో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. వాటికి అధికారిక మద్దతు కూడా లభిస్తుంటుంది. అలాంటి విచిత్రమైన పండుగే ‘కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్ ఫెస్టివల్’.
ఈ వేడుక ఇంగ్లాండ్‌లోని గ్లాస్టర్‌షైర్‌లోని బ్రాక్‌వర్త్ సమీపంలోని కూపర్స్ హిల్‌పై ప్రతి ఏడాది మే చివరి సోమవారం రోజున జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది మే 26న జరుగుతుంది. ఇది ముందు చెప్పుకున్నట్లు కాస్త ప్రమాదకరమైన సంప్రదాయం. ఈ ఉత్సవంలో జరిగే పోటీలో పాల్గొనేవారు దాదాపు 200 గజాల ఎత్తుగల నిటారైన కొండపై నుంచి దొర్లుతున్న డబుల్ గ్లాస్టర్ చీజ్ వీల్ (గుండ్రంగా చక్రంలా ఉంటుంది) వెనుక పరుగుపెట్టాల్సి ఉంటుంది.
ఆ చక్రాన్ని కింద వరకూ వెళ్లి ఎవరు అందుకుంటారో వారే విజేత. అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా తెలియదు, కానీ ఇది 1826లో మొదటిసారిగా లిఖితపూర్వకంగా ప్రస్తావించారు. అయితే, ఇది కనీసం 600 సంవత్సరాల నాటి సంప్రదాయమని నమ్ముతారు.
ప్రస్తుతం, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 18 ఏళ్లు నిండితే చాలు ఈ పోటీలో పాల్గొనొచ్చు. కొండ చాలా నిటారుగా ఉండటం వల్ల, చాలామంది బ్యాలెన్స్ కోల్పోయి దొర్లుకుంటూ పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ, విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొండ దిగువన స్థానిక రగ్బీ జట్టు సభ్యులు గాయపడిన వారికి సహాయం చేయడానికి వేచి ఉంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది వస్తుంటారు.
(చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..! )