What Is Polycystic Ovarian Disease (PCOD) Problem Know Its Symptoms And Causes - Sakshi
Sakshi News home page

What Is Pcod: నెలసరి గాడి తప్పితే పీసీఓడీ సమస్యేనా? లక్షణాలు ఎలా ఉంటాయి?

Published Sat, Aug 12 2023 4:51 PM

What Is Pcod Problem Know Its Symptoms And Causes - Sakshi

మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు.

ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్‌మెంట్‌ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు.  

తిరుపతి ఎమ్మార్‌పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో  ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం  చెన్నైలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్‌ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు.  

► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార.

► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ  మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.


పీసీఓడీ ఎందుకొస్తుందంటే... 
ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ అవసరమవుతుంది. ఈ హార్మోన్‌ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక,  అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.  

లక్షణాలు ఇలా ఉంటాయి

 • నెలసరి సక్రమంగా రాదు 
 • ఎక్కువగా బ్లీడింగ్, 
 • రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది  
 • అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం 
 • నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద 
 • అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు.  
 • శరరీంలో ఇన్సులిన్‌ నిరోధకత కూడా పెరిగిపోతుంది.  

వ్యాధులు ఇలా

 • ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌  
 • కొలెస్ట్రాల్‌ పెరుగుదల  
 • అధిక రక్తపోటు, 
 • గుండె సంబంధిత వ్యాధులు 
 • గర్భస్రావాలు, 
 • సంతాన లేమి 
 • మధుమేహం 
 • మానసిక జబ్బులు 
 • అసాధారణ గర్భాశయ రక్తస్రావం  
 • క్రమ రహిత రుతుక్రమం

పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు  హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్‌ స్కానింగ్‌ చేసి నిర్థారిస్తారు. 


ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... 
జీవనశైలిలోని మార్పులు కూడా  పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్‌ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం.  

ఫీజులు గుంజేస్తున్నారు.. 
గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్‌ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్‌ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. 

వైద్యులను సంప్రదించాలి 
మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు.  


– డాక్టర్‌ ప్రభావతిదేవి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు 

నిర్లక్ష్యం చేస్తే సమస్యలు 
పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్‌ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు.  


డాక్టర్‌ ఉషశ్రీ, గైనకాలజిస్ట్,
చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి  

 

Advertisement
 
Advertisement