
ధ్యానంపై అవగాహన కల్పించడంతో పాటు భారత ప్రభుత్వ ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు ఇవ్వడంలో భాగంగా సైక్లింగ్ ప్రయాణం చేపట్టిన తరుణ్ పర్మార్ నేడు హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హార్ట్‌ఫుల్‌నెస్ ప్రాక్టీషనర్ తరుణ్ పర్మార్ సెపె్టంబర్ 13న నోయిడా నుంచి మొదలు పెట్టిన ఈ సైక్లింగ్ 7 రాష్ట్రాలు, ప్రముఖ నగరాల్లో అవగాహన కల్పిస్తూ రోజుకు దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రయాణంలో భాగంగా నేడు హైదరాబాద్‌కు చేరుకుని రేపు నగరంలోని కన్హా శాంతి వనం – హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ వేదికగా తన సైక్లింగ్ ప్రయాణాన్ని ముగించనున్నారు. తరుణ్ పర్మార్ ఈ అవగాహన సైక్లింగ్ ప్రయాణంలో భాగంగా మొత్తం 1700 కి.మీ సైక్లింగ్ చేసి ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా తరుణ్ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. సైక్లింగ్, ధ్యానం తన జీవన గమ్యాలే తన సంతృప్తి అని పేర్కొన్నారు. ధ్యానం తన జీవితాన్ని మార్చేసిందని, మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు.