వేసవి అంటే సెలవులేనా? | Is Summer Really A Holiday What Experts Said | Sakshi
Sakshi News home page

వేసవి అంటే సెలవులేనా?

Apr 27 2025 7:45 AM | Updated on Apr 27 2025 8:19 AM

Is Summer Really A Holiday What Experts Said

వేసవి కాలం వచ్చిందంటే చాలామంది టీనేజర్లు మెల్లగా మధ్యాహ్నం లేచి, తాపీగా రీల్స్‌ చూసుకుంటూ, సాయం కాలం క్రికెట్‌ ఆడుతూ కాలం గడిపేస్తుంటారు. కాని, కాస్తంత మనసు పెడితే ఈ వేసవిని మీ మైండ్‌సెట్‌ను మార్చుకునే అద్భుత అవకాశంగా మలచుకోవచ్చు. మెరుగైన ఫోకస్, స్పష్టమైన లక్ష్యాలు, కొత్త స్కిల్స్, నిజమైన ఆత్మవిశ్వాసం గల మీ బెస్ట్‌ వెర్షన్‌గా మారవచ్చు. అందుకోసం ‘ఎస్‌.టి.ఏ.ఆర్‌’ను ఫాలో అయితే సరి.

సిట్యుయేషన్‌ వేసవి సెలవుల వాస్తవం
వేసవి అనేది తెల్లవారుఝాము వరకు నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ, మధ్యాహ్నం వరకు నిద్రపోయే టైమ్‌ మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చుకునే టర్నింగ్‌ పాయింట్‌ కూడా! వేసవి అంటే మూడు అద్భుతమైన అవకాశాలు:

  • రీచార్జ్‌: ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి రీచార్జ్‌ చేసుకునే అవకాశం

  • రిఫ్లెక్ట్‌:  మీ అభిరుచులు, ఆలోచనలు గురించి అర్థం చేసుకునే అవకాశం

  • రీ ఇన్వెంట్‌: మీరు కొత్తగా రూపుదిద్దుకునే అవకాశం

థాట్‌ నిన్ను నీవు తెలుసుకోవడం
ఈ వయస్సులో మీ మనస్సు ఐడెంటిటీ కోసం వెతుకుతుంది. ‘నేనెవరు?’, ‘ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది?’ అన్న ప్రశ్నలు రోజూ మనసులో తిరుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వేసవిని ఉపయోగించుకోండి. అందుకోసం ఐదు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి.

  • ప్యాషన్స్‌: నాకు నిజంగా ఏది ఇష్టం?  

  • ఫియర్స్‌: నన్ను వెనక్కి లాగుతున్న భయాలు ఏవి?

  • స్ట్రెంగ్త్స్‌: నా మానసిక బలాలేంటి?

  • హ్యాబిట్స్‌: నేను రోజూ చేసే పనులు నన్ను ముందుకు నడిపిస్తున్నాయా? నాశనం చేస్తున్నాయా?

  • విజన్‌: వచ్చే రెండు మూడేళ్లలో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?

యాక్షన్‌ ఐదు వారాల చాలెంజ్‌
ఈ వేసవిలో వారానికో చాలెంజ్‌ చొప్పున ఐదు వారాలు ఐదు చాలెంజŒ లు స్వీకరించండి. ఇవేవీ స్కూల్‌లో, కాలేజీలో కనిపించేవి కావు, బోధించేవీ కావు. కానీ మీ జీవితాన్ని సంతోషమయం చేస్తాయి.  

మొదటివారం డిజిటల్‌ డీటాక్స్‌. అంటే స్క్రీన్‌ టైమ్‌ను రోజుకు మూడు గంటలకే పరిమితం చేయడం. నిద్రకు గంట ముందు, నిద్రలేచాక గంటపాటు స్మార్ట్‌ఫోన్‌ ముట్టుకోకుండా ఉండటం. రోజూ 15 నిమిషాలు డీప్‌ బ్రీతింగ్‌ లేదా ధ్యానం ప్రాక్టీస్‌ చేయడం. దీనివల్ల మీ మెదడులో డోపమైన్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. క్లారిటీ, మోటివేషన్‌ పెరుగుతుంది. 

రెండో వారం మీకు నచ్చిన సబ్జెక్ట్‌ లేదా హాబీని ఎంచుకుని, రోజుకో రెండు గంటలపాటు దానిపై పనిచేయండి. ఇలా డీప్‌ వర్క్‌ చేయడం వల్ల మీ ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 

మూడోవారం రాత్రి నిద్రకు ముందు పదినిమిషాలు డైరీ రాయండి. ఈరోజు హైలైట్స్‌ ఏమిటి? నన్ను ఏది ఇన్‌స్పైర్‌ చేసింది? రేపు ఏం మెరుగుపరచుకోవాలి? ఇలా రాయడం వల్ల మీ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ని పెంచుతుంది.

నాలుగోవారం ఐదు బేసిక్‌ లైఫ్‌ స్కిల్స్‌ నేర్చుకునేందుకు ఉపయోగించండి. 
మనీ మేనేజ్మెంట్‌
కనీసం రెండు మూడు వంటలు నేర్చుకోవడం
ఒక లోకల్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయడం
ప్రాథమిక చికిత్స నేర్చుకోవడం
మీకు నచ్చిన సబ్జెక్ట్‌పై మూడు నిమిషాలు మాట్లాడటం
ఐదోవారం కనెక్షన్‌ వీక్‌. 

ఒక రోజంతా కంప్లయింట్‌ చేయకుండా గడపండి. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీ అవ్వాతాతలతో కూర్చుని మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. అలాగే దగ్గరలో ఉన్న పిల్లలకు మీకు తెలిసింది నేర్పించండి. ఇలా చేయడం మీ బంధాలను బలపరచడమే కాకుండా, మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది.

రిజల్ట్‌ కొత్త నువ్వు
ఈ వ్యాసంలో చెప్పినవన్నీ పాటిస్తే ఈ వేసవి ముగిసేసరికి నీ గురించి నీకు స్పష్టత వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మెదడులో డోపమైన్‌ వ్యసనం తగ్గి, ఫోకస్‌ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. నిన్ను నువ్వే మెచ్చుకునేలా మారిపోతావు. ఆల్‌ ది బెస్ట్‌!

సైకాలజిస్ట్‌ విశేష్‌ 
www.psyvisesh.com

(చదవండి: సివిల్స్‌లో సక్సెస్‌ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ‌ ఆ ఇద్దరూ..!)
 

Advertisement
 
Advertisement
Advertisement