ఊరి ఉప్పు | Free medical care in the village using medicine samples | Sakshi
Sakshi News home page

ఊరి ఉప్పు

Oct 26 2026 12:24 AM | Updated on Oct 26 2026 12:24 AM

Free medical care in the village using medicine samples

కథానీతి

అది తిరుపతి విమానాశ్రయం. ఆకాశం మేఘావృతమై సన్నగా వాన చినుకులు రాలుతున్నాయి. విమానాశ్రయం లోపల ఉన్న పుస్తకాల అంగడి వద్దకు సూటు బూటు వేసుకున్న ఒక గౌరవప్రదమైన వ్యక్తి వచ్చి నిలబడ్డాడు.

ఆయన ప్రతినెల మొదటి ఆదివారం క్రమం తప్పకుండా విమానంలో దిగడం, ఈ అంగడి వద్దకు వచ్చి ఏదో ఒక పుస్తకం కొనుక్కోవడం పరిపాటి. ఈ అలవాటు వల్ల పుస్తకాల యజమానికి, ఆయనతో కాస్త ముఖ పరిచయం ఏర్పడింది.

ఎప్పటిలాగే ఆరోజు  ఉదయం ఆయన పుస్తకాలను తిరగేస్తుండగా, యజమాని చిన్నగా అడిగాడు, ‘సార్‌! ప్రతినెలా మొదటి ఆదివారం ఉదయమే వచ్చి, రాత్రికి వెళ్ళిపోతారు. అసలు మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడికి వెళ్తారు?‘

ఆయన చిరునవ్వుతో, ‘నేను హైదరాబాద్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ప్రతి నెల మొదటి ఆదివారం నా సొంత ఖర్చులతో విమానంలో వస్తాను. ఇక్కడి నుంచి పాతిక మైళ్ళ దూరంలో మా ఊరు ఉంది. నా కన్నతల్లి లాంటి సొంత ఊరి పేదలకు ఉచిత వైద్య సేవలందించి రాత్రికి తిరిగి వెళ్తుంటాను‘ అని చెప్పారు.
ఆ మాటలకు పుస్తకాల యజమాని ఆశ్చర్యపోయాడు! 

‘ఆ ఆదివారం కూడా హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్‌ చేస్తే వేల రూపాయలు సంపాదించవచ్చు. అలాంటిది, సొంత డబ్బులతో విమానం ఖర్చులు పెట్టుకుని మరీ వచ్చి ఇక్కడ ఉచితంగా వైద్యసేవ చేయడం మీకు నష్టం కదా?’.

‘‘ఊరి ఉప్పు తిన్నవాడిని. ఊరి ఋణం తీర్చుకోవాలి కదా! అంతేకాదు, పుట్టిపెరిగి తిరుగాడిన ఈ నేల మీద నడిస్తే నాకు  ప్రాణవాయువు దొరికినంత సంబరమవుతుంది. నెలలో ఒక్కరోజు ఇక్కడికి వచ్చిపోతే బ్యాటరీకి రీఛార్జ్‌ చేసినట్లవుతుంది. నెలలోని మిగతా రోజుల్లో ఉత్సాహంగా పనిచేసేంత శక్తి కూడా లభిస్తుంది.’’ అని బదులిచ్చాడు డాక్టర్‌.

ఎప్పుడు వచ్చినా పెద్ద పెట్టెతో వచ్చే డాక్టర్‌ తో ‘‘ఆ పెట్టెలో ఏముంటుంది సార్‌?’’ అని అడిగాడు. ‘‘ఎం.డి., జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడైన  నన్ను ఎంతోమంది మెడికల్‌ రెప్రజెంటేటివ్‌ లు కలిసి మందుల శాంపిళ్ళు ఇస్తూ ఉంటారు. వాటిని మా ఊర్లో  అవసరమైన వాళ్ళకు ఉచితంగా ఇస్తూ ఉంటాను’’ అని బదులిచ్చాడు.

‘ఈ రోజుల్లో వైద్యం పూర్తిగా వ్యాపారమై పోయింది’ అనే భావనలో ఉన్న ఆ యజమానికి, ’వైద్యుల్లోనూ దేవుళ్ళు ఉంటారు’ అని అర్థమైంది. పుస్తకం కొనుక్కొని నడిచి వెళ్తున్న ఆ డాక్టర్‌ని చూస్తూ మనసులోనే నమస్కరించుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఎదురుగా ఉన్న శేషాచలం కొండలు కూడా ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించాయి.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement