స్పష్టంగా చెప్పాలంటే... చిక్కులే జ్ఞాని జీవితం! ఎందుకంటే జ్ఞానికి తెలుసు– ‘పంచభూతాల’ చిక్కే జీవితమని. చిక్కులు లేని జీవితం శవంతో సమానం. సమస్యలకు భయపడని జీవితమే జ్ఞానం. ఒంటి మీద ఎన్ని గాయాల గుర్తులు ఉంటే, ఆ గుర్తులే జ్ఞానికి అందాన్నిస్తాయి. మరకలు లేని జ్ఞాని కేవలం పుస్తకం లాంటివాడు. దెబ్బలు తిన్న జ్ఞానే నిజంగా బతికినవాడు. అందుకే... అజ్ఞానికి చిక్కు ఒక సమస్య. జ్ఞానికి ఆ చిక్కే సమాధానం.
చిక్కులను తీర్చాల్సిన అవసరం లేదు. చిక్కులతోనే బతకడం నేర్చుకోవాలి. అప్పుడు చిక్కులు సమస్యలా కనిపించవు. అదొక అందమైన ముగ్గులా కనిపిస్తుంది. ‘పంచభూతాలను అదుపు చేయాలి, లేదంటే అవి మనల్ని అణచివేస్తాయి’ అని పెద్దలు చెప్పారు. కానీ, అవి మన లోపలే ఉన్నాయి. నేల అంటే మన మొండితనం. నీరు అంటే మన భావోద్వేగాలు. నిప్పు అంటే మన తెలివి. గాలి అంటే మన ఆలోచనలు. ఈ నాలుగింటినీ మోసే ఆకాశమే భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన ‘నేను నేను’.
బయట ఉన్న భూతాల కంటే లోపల భూతమే ప్రమాదకరం. ఆ భూతమే తెలివికి, భావోద్వేగానికి మధ్య జరిగే పోరాటం. మనం తెలివిని డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే చాలు అనుకుంటాం. కానీ బండి నడుపుతుంటే తెలుస్తుంది... స్టీరింగ్ పట్టుకుంది తెలివి కాదు, భావోద్వేగమూ కాదు. అక్కడ ‘నేను’ అనే ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడే అప్పుడప్పుడు తెలివి వేషం, తరచుగా భావోద్వేగం వేషం వేస్తున్నాడు. ఈ ‘నేను’ తనకోసం ఒక ఇమేజ్ తయారు చేస్తుంది.
‘నేను మంచివాడిని, నేను తెలివైనవాడిని, నేను అన్వేషణలో ఉన్నాను’ అని. ఆ ఇమేజ్ కాపాడుకోవడానికే రోజువారీ పోరాటం. కానీ భావాలు ఎప్పటికీ జ్ఞానం కావు. భావాలు జ్ఞానమై జీవితంగా మారనంత వరకు అవి ఊహాగానాలే. ఆకలికి పుస్తకం పరిష్కారం కాదు. కర్మ అంటే ఎవరో రాసిన నుదుటిరాత కాదు. మనం రోజురోజుకూ ‘నేను, నాది’ అని కూడబెట్టిన లెక్క. ఆ లెక్కను తీర్చడానికే ఈ గాయాల గుర్తులు. ఆఖరికి ఆ గాయాలు కూడా అలవాటైపోయాక ఏం మిగులుతుంది? ఏ బింబమూ లేని...‘నేను’ మాత్రమే మిగులుతుంది. జ్ఞానమే విముక్తి!
– యామిజాల జగదీశ్
ఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక


