breaking news
Bhagavan Ramana Maharshi
-
జ్ఞానమే విముక్తి – చిక్కులే సమాధానం
స్పష్టంగా చెప్పాలంటే... చిక్కులే జ్ఞాని జీవితం! ఎందుకంటే జ్ఞానికి తెలుసు– ‘పంచభూతాల’ చిక్కే జీవితమని. చిక్కులు లేని జీవితం శవంతో సమానం. సమస్యలకు భయపడని జీవితమే జ్ఞానం. ఒంటి మీద ఎన్ని గాయాల గుర్తులు ఉంటే, ఆ గుర్తులే జ్ఞానికి అందాన్నిస్తాయి. మరకలు లేని జ్ఞాని కేవలం పుస్తకం లాంటివాడు. దెబ్బలు తిన్న జ్ఞానే నిజంగా బతికినవాడు. అందుకే... అజ్ఞానికి చిక్కు ఒక సమస్య. జ్ఞానికి ఆ చిక్కే సమాధానం.చిక్కులను తీర్చాల్సిన అవసరం లేదు. చిక్కులతోనే బతకడం నేర్చుకోవాలి. అప్పుడు చిక్కులు సమస్యలా కనిపించవు. అదొక అందమైన ముగ్గులా కనిపిస్తుంది. ‘పంచభూతాలను అదుపు చేయాలి, లేదంటే అవి మనల్ని అణచివేస్తాయి’ అని పెద్దలు చెప్పారు. కానీ, అవి మన లోపలే ఉన్నాయి. నేల అంటే మన మొండితనం. నీరు అంటే మన భావోద్వేగాలు. నిప్పు అంటే మన తెలివి. గాలి అంటే మన ఆలోచనలు. ఈ నాలుగింటినీ మోసే ఆకాశమే భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన ‘నేను నేను’.బయట ఉన్న భూతాల కంటే లోపల భూతమే ప్రమాదకరం. ఆ భూతమే తెలివికి, భావోద్వేగానికి మధ్య జరిగే పోరాటం. మనం తెలివిని డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే చాలు అనుకుంటాం. కానీ బండి నడుపుతుంటే తెలుస్తుంది... స్టీరింగ్ పట్టుకుంది తెలివి కాదు, భావోద్వేగమూ కాదు. అక్కడ ‘నేను’ అనే ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడే అప్పుడప్పుడు తెలివి వేషం, తరచుగా భావోద్వేగం వేషం వేస్తున్నాడు. ఈ ‘నేను’ తనకోసం ఒక ఇమేజ్ తయారు చేస్తుంది.‘నేను మంచివాడిని, నేను తెలివైనవాడిని, నేను అన్వేషణలో ఉన్నాను’ అని. ఆ ఇమేజ్ కాపాడుకోవడానికే రోజువారీ పోరాటం. కానీ భావాలు ఎప్పటికీ జ్ఞానం కావు. భావాలు జ్ఞానమై జీవితంగా మారనంత వరకు అవి ఊహాగానాలే. ఆకలికి పుస్తకం పరిష్కారం కాదు. కర్మ అంటే ఎవరో రాసిన నుదుటిరాత కాదు. మనం రోజురోజుకూ ‘నేను, నాది’ అని కూడబెట్టిన లెక్క. ఆ లెక్కను తీర్చడానికే ఈ గాయాల గుర్తులు. ఆఖరికి ఆ గాయాలు కూడా అలవాటైపోయాక ఏం మిగులుతుంది? ఏ బింబమూ లేని...‘నేను’ మాత్రమే మిగులుతుంది. జ్ఞానమే విముక్తి!– యామిజాల జగదీశ్ఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక -
స్మరణీయం.. రమణీయం
రమణానందం భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మార్గశిర బహుళ విదియ పునర్వసు నక్షత్రంలో అంటే 1879 డిసెంబరు 29 అర్ధరాత్రి తమిళనాడు రాష్ర్టంలోని మధురై సమీపాన గల తిరుచ్చుళిలో అలఘమ్మ, సుందరయ్యర్ పుణ్యదంపతులకు పుట్టిన వెంకట రామన్ మౌనస్వామిగా, శ్రీ రమణ మహర్షిగా ప్రసిద్ధులయ్యారు. లోకంలో దుఃఖం, కష్టం ఎందుకని ఒక భక్తుడు అడిగిన దానికి సమాధానంగా కష్టాలు రాకపోతే సుఖం కావాలనే కోరిక పుట్టదు. సుఖం కావాలన్న కోరిక లేకపోతే ఆత్మాన్వేషణ విజయవంతం కాదు అని చెప్పారు. అయితే కష్టాలు, దుఃఖం ఉండటం మంచిదంటారా అని మరొకరు అడిగారు. అప్పుడాయన అసలు దుఃఖమనేది నేను దేహాన్ని అనే మిధ్యాభావన వల్లే కలుగుతోంది. దానిని వదిలించుకోవడమే జ్ఞానం అని సమాధానమిచ్చారు. నాపై అనుగ్రహం చూపండని ఒక భక్తుడు వేడుకున్నాడు. ఆత్మయే అనుగ్రహ స్వరూపం. ఆత్మ ఎల్లప్పుడూ తన అనుగ్రహం చూపుతూనే ఉంటుంది. దానిని మనం గ్రహించుకోవాలి. ఆత్మప్రేరణ వల్లే నీవడిగావు, నేను చెప్పావు’ అని చెప్పారు. అరుణాచలంలో అడుగిడినప్పటినుండి 1950 ఏప్రిల్ 14న సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారా అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించిన భగవాన్ రమణ మహర్షి నిత్యస్మరణీయులు, ఆయన బోధలు చిరస్మరణీయాలు. రమణీయాలు. - బ్రహ్మానంద రెడ్డి


