
నేడు గురు పూర్ణిమ
మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసేవారు గురువులు. అందుకే గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తాం. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతోపవిత్రమైనది. ఈ రోజు అష్టాదశ పురాణాలను మనకు అందించిన వ్యాసభగవానుని జన్మదినం కారణంగా గురుస్థానంలో ఆ వ్యాసభగవానుని స్మరించుకునే పర్వదినం.
గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి. అందువలన లోకంలో అందరూ శ్రీ వ్యాసమహర్షిని పూజించి, గౌరవించాలి. ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం మన భారతీయ సంస్కృతిలో భాగమైంది. మానవ చరిత్రలోనే అపూర్వమైన ఆధ్యాత్మిక పర్వదినంగా నిలచింది వ్యాస జన్మతిథి. ముందుగా ఈ తిథికి సంబంధించిన ఒక చక్కని కథను తెలుసుకుందాం.
ఒక శిష్యుడు తన గురువుగారిని వెదుకుతూ చివరికి ఆయనను కలుసుకుంటాడు. కొంత కాలం తరువాత శిష్యుడు సెలవు తీసుకుంటూ తిరిగి ఎప్పుడు దర్శనమిస్తారు అని గురువుగారిని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ‘‘శిష్యా! నీవు నన్ను దర్శించాలని కుతూహలంగా ఉన్నావు గనుక విను. ఎవరైతే పురాణగాథలను, వేద గాథలను వ్యాఖ్యానం చేస్తూ వాటి రహస్యాలను ఉపదేశిస్తుంటారో వారే నా నిజ స్వరూపం అని తెలుసుకుని, వారిని సాక్షాత్తు వ్యాస మూర్తిగా భావించి పూజింపవలసినది.
నేను ఎల్లప్పుడూ ఇటువంటి పౌరాణికులందరిలోనూ ఉంటాను’’ అని అంటారు. అందువల్ల పౌరాణికులు, కథకులు, బోధకులు అందరూ గురువులే. పురాణాలలో నిగూఢంగా ఉన్న విషయాలను తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. అందుచేత మనం వ్యాస పూర్ణిమ నాడు పౌరాణికులను, మన గురువులను పూజించి తగిన విధంగా సత్కరించాలి. హిందూమతంలో భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆలంబనగా గురువును భావిస్తారు. తమ జీవితాలకు సరైన మార్గ నిర్దేశనం చేయటానికి కావలసిన సాధన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం.
గురువులుగా ప్రసిద్ధిగాంచిన ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, శ్రీషిరిడీ సాయినాథుడు మొదలైనవారిని ఈరోజు కొలుస్తారు. ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకరులే ప్రారంభించారని కూడా చెబుతారు. అఙ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారు గురువు. మనం జన్మించిన తరువాత మన కన్నతల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారు గురువు. సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతుడై జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగివున్న ఙ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశనం కలిగించేవారు గురువు.
మనమందరం గురువుకు తగిన గౌరవమర్యాదలు కలిగిస్తూ, వారి అడుగుజాడలలో పయనిద్దాం. విశ్వమానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం.
– డా. దేవులపల్లి పద్మజ