
గురువులు, ఆచార్యుల అనుగ్రహం లేకుంటే ఏదీ అర్థం కాదు, ఏదీ సాధించ లేము. అందుకే గురువును సాక్షాత్తూ త్రిమూర్తులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో పోల్చారు పెద్దలు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వగురువులకూ గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాస మహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ దేశ సంప్రదాయం. గురువు అనుగ్రహం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అంటే భగవంతుణ్ణి దర్శించాలంటే ముందుగా గురువు అనుగ్రహాన్ని పొందాలి. ఇనప ముక్కను బంగారంగా మార్చే పరశువేది గురువు. అలాగని గురువును పరశువేదితోనే పూర్తిగా పోల్చడానికి వీలు కాదు. అంతకు మించినవాడు. అన్నింటికీ అతీతుడు.
మనిషి అయినవాడు బాధ్యతల నుంచి పారిపోకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావులేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసభగవానుడు, శంకర భగవత్పాదుల వంటి గురువులు వైరాగ్యం అంటే బాధ్యతలను వదిలిపెట్టడం కాదని, వ్యామోహపడకుండా బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్ని ఈ సమాజానికి అందించారు. ఇక అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి, సంపూర్ణంగా గురు కృపను పొందినవారే.
గురువును ఎప్పుడూ వినయ విధేయతలతో ప్రసన్నం చేసుకోవాలే కానీ, అహంకారంతో తూలనాడి వారి ఆగ్రహానికి గురికాకూడదు. దేవేంద్రుడంతటివాడు గురువైన బృహస్పతి తన కొలువులోకి రావడాన్ని చూసి కూడా లేవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆయన ఆగ్రహానికి గురై సింహాసనంతో సహా సర్వసంపదలనూ పోగొట్టుకున్నాడు. చివరకు తప్పు తెలుసుకుని ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహంతోనే తిరిగి పూర్వ వైభవాన్ని పొందాడు. అందుకే గురువు గురువే.
– డి.వి.ఆర్.
జులై 10, గురువారం గురు పూర్ణిమ