రిస్క్‌ ఎంతున్న రెస్క్యూకి రెడీ..! | Singareni Collieries Company Limited launched all women rescue teams | Sakshi
Sakshi News home page

రిస్క్‌ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!

Jun 19 2025 11:14 AM | Updated on Jun 19 2025 12:23 PM

Singareni Collieries Company Limited launched all women rescue teams

‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్‌ క్లాస్‌ ఆల్‌–విమెన్‌ రెస్క్యూ అండ్‌ రికవరీ టీమ్‌లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్‌–విమెన్‌ రెస్క్యూ టీమ్‌లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...

రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్‌టర్నల్‌ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్‌ గ్య్రాడ్యుయేట్‌ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్‌కు 14 మంది చొప్పున రెండు బ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్‌లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్‌ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్‌లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 

ఫస్ట్‌ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్‌ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్‌లో చేరాను’ అంటోంది ఎన్‌.రక్షిత. ‘కోల్‌ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!
– కాల్వ చంద్రశేఖర్‌రెడ్డి, సాక్షి, గోదావరిఖని

టఫ్‌ జాబ్‌ అంటే ఇష్టం...
ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్‌ జాబ్‌ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో  రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్‌లో ఎంతగానో ఉపకరిస్తుంది. 
– ఎం.లిఖిత, భూపాల్‌పల్లి

ఆత్మస్థైర్యం పెంచేలా...
మహిళ మైనింగ్‌ గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్‌ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.
– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 

(చదవండి: నీట్‌లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!)

Advertisement
 
Advertisement
Advertisement