ధనత్రయోదశి.. ఇలా చేస్తే ఆరోగ్య మహాభాగ్యం కలుగుతుంది

Simple And Healthy Food Habits To Maintain Wellness - Sakshi

ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్‌ తేరస్‌ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు.

అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... 

సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్‌ వరకు.. బీపీ నుంచి హార్ట్‌ ఎటాక్‌ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. 

సమయానికి తగు...
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి
రోజూ ఉదయాన్నే టిఫిన్‌ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. 

లంచ్‌గా ఇవి...
మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.
రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్‌ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది.


మానసిక దృఢత్వం
మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. 

కంటినిండా నిద్ర
కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top