ఆర్ట్ అండ్ కల్చర్
హేమాంగిని దత్ మజుందార్ పుస్తకాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఆసక్తిగా చదివేలా చేస్తాయి. ఆమె తాజా పుస్తకం స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్... బెంగాలీ అయిన హేమాంగిని మజుందార్ కోల్‌కతాతో పాటు ముంబై, న్యూయార్క్, ఆస్టిన్, బహ్రెయిన్‌లలో నివసించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటుంది. బెంగాలీ వంటకాలతో పాటు ఎన్నో వంటకాలపై ఆమెకు అవగాహన ఉంది.
‘నాకు ఒక ప్రదేశంలో ఆహారం సౌకర్యవంతంగా ఉంటే, ఆ ప్రదేశంలో నేను నిజంగా స్థిరపడ్డానని అనుకుంటాను. బెంగాలీ సంచారిగా ఆహారం అనేది నా మూలాలను, ఇంటిని గుర్తు తెస్తుంది. నేను ఏదైనా నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఇంట్లో కొంత భాగాన్ని వదిలి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది మజుందార్. ఆహారం అనేది ఆమె రచనాప్రక్రియలో భాగం అయింది. ఆహారపదార్థాలతో భావోద్వేగ బంధం ఆమెను పుస్తక రచనకు పురికొల్పింది.
హేమాంగిని పుస్తకం చదివిన వాళ్లు... ‘పుస్తకం చదివినట్లుగా లేదు. విందు ఆరగించినట్లుగా ఉంది’ అంటారు చమత్కారంగా. వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ కాలాన్ని తన రచనల్లోకి తీసుకురావడం అంటే మజుందార్‌కు ఇష్టం. ‘ది స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్’ అలాంటి రచనే. చారిత్రాత్మక పట్టణం నేపథ్యంగా సాగే నవల. చందానగర్ అనేది ఒకప్పుడు కోల్‌కతా వెలుపల ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. వోలీ ఛటర్జీ అనే మహిళ చందానగర్‌లో తన పూర్వీకులకు చెందిన ఎస్టేట్‌లో నివసించడానికి వెళుతుంది. అక్కడ ఒక అర్ధరాత్రి ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి.
వోలి తనకు ఉన్న ప్రత్యేక శక్తులతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ‘మహిళలు ఎదుర్కొంటున్న అదృశ్య యుద్ధాలు’ అంశంపై ‘ది స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్’ రాసింది హేమాంగిని మజుందార్.


