ఫస్ట్‌ తెలుగు సోషల్‌ ఫిల్మ్‌ @ 90 ఏళ్లు | Sakshi Funday Special Story, Prema Vijayam Completes 90 Years, The Untold Story Of Telugu Cinema's First Social Film | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ తెలుగు సోషల్‌ ఫిల్మ్‌ @ 90 ఏళ్లు

Jul 19 2026 12:41 AM | Updated on Jul 19 2026 2:39 PM

Sakshi Funday Special Story: Prema Vijayam film 90 Years was completed in 2026

ఇప్పటికి సరిగ్గా తొంభై ఏళ్ళ క్రితం తొలి తెలుగు సోషల్‌ ఫిల్మ్‌ – ‘ప్రేమ విజయం’ వచ్చింది (రిలీజ్‌ 1936 జూలై 20). ఇవాళ మనం చూస్తున్న అన్ని సోషల్‌ సినిమాలకూ అదే పునాది. చరిత్రలో అంతటి ప్రాధాన్యం ఉన్నా, ఇవాళ్టికీ అరకొర సమాచారమే తప్ప పూర్తి వివరాలు ఎవరికీ తెలియని చిత్రం అది. మైలురాయి లాంటి ఆ సినిమా చరిత్రను తవ్వి తీసిన వివరాలతో తొలిసారి అక్షరబద్ధం చేస్తున్న ఈ పరిశోధనాత్మక తెర వెనుక అసలు కథ ‘సాక్షి’కి ప్రత్యేకం.

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు పౌరాణికం, జానపదం... ఇలా రకరకాల జానర్లుండేవి. ఇవాళ అత్యధిక భాగం సాంఘికమే. తొంభై ఏళ్ళ క్రితం తెలుగు తెరపై సాంఘిక చిత్రాలు తీయడం ఓ విడ్డూరం. పౌరాణిక, జానపద కథలదే రాజ్యమైన తెరపై, సామాజిక వాతావరణాన్ని చూపెట్టి నెగ్గుకు రాగలమా అన్న బాక్సాఫీస్‌ భయం. ఆ పరిస్థితుల్లో తెలుగులో వచ్చిన ఫస్ట్‌ సోషల్‌ ఫిల్మ్‌ ‘ప్రేమ విజయము’.

అది... పేరులోనే లవ్‌ స్టోరీ పెట్టుకున్న తొలి తెలుగు సినిమా. కాలేజీ చదువులు, ప్రేమలు, వితంతు వివాహాలు, వివాహేతర వ్యామోహాలు, సంఘంలోని దురాచారాలు... ఇలా ఎన్నెన్నో అంశాలను తొలిసారిగా తెలుగు తెరపై చర్చించిన సినిమా. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బాక్సుల్లో నుంచి బయటపడ్డ సినిమా. చూద్దామంటే సినిమానే కాదు, పాటలు, ఫొటోలు సైతం కనిపించని అరుదైన సినిమా. ఇంకా చెప్పాలంటే, చిత్ర నిర్మాణమే ఓ పెద్ద సినిమా స్టోరీని తలపించే సినిమా.  

చారిత్రక ప్రాధాన్యమున్న రాజమండ్రి ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలుగునాట సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ముఖ్యకేంద్రమైంది. నాటకం సామాన్య వినోదంగా మారిన ఆ రోజుల్లో నాటక సంస్థలకూ కేంద్రస్థానమైంది. తెలుగు గడ్డపై తొలి సినిమా స్టూడియో వెలసిందీ రాజమండ్రిలోనే. అలాగే, తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయము’ చిత్ర నిర్మాణంతోనూ ఆ ప్రాంతానిదే అనుబంధం.

సాహసించి... తొలి అడుగు!
అది 1935–36 నాటి సంగతి. పాపులర్‌ స్టేజ్‌ నాటకాలు, పౌరాణిక గాథలు... అన్నీ అప్పటికే వెండితెర మీదకొచ్చాయి. అయితే, రాజమండ్రి వాస్తవ్యులైన రంగస్థల దిగ్గజం కృత్తివెంటి నాగేశ్వరరావు మాత్రం ధైర్యం చేసి, తొలి సినీ ప్రయత్నంలోనే సాంఘిక గాథ తీసుకున్నారు. అప్పట్లో అందరూ దాన్ని ఓ ప్రయోగంగా చూశారు. అందుకే, ఓ పక్క తెలుగులో తొలి సోషల్‌ టాకీ తయారవుతున్నా... వారంతా ‘కనకతార’ లాంటి ఇతర పాపులర్‌ స్టేజ్‌ డ్రామాలు, ‘మోహినీ రుక్మాంగద’ లాంటిపురాణగాథల మీదే దృష్టి పెట్టారు.    

‘ప్రేమ విజయము’కు నిర్మాత కృత్తివెంటి నాగేశ్వరరావు అని చరిత్రలో చాలామంది తెలిసీ తెలియక రాస్తుంటారు కానీ, నిజానికి ఆయన దర్శకుడు. పెట్టుబడి పెట్టిన నిర్మాతలతో పాటు తానూ నిలబడి, సినిమా మొత్తాన్నీ నిర్వహించిన సారథి. అయితే, ఆయనకు నాటకానుభవమే తప్ప సినీ సాంకేతిక పరిజ్ఞాన అనుభవం లేదు. అందుకని, బొంబాయిలో పని చేసి, రికార్డింగ్, లేబరేటరీ పనుల్లో అనుభవమున్న ద్వారకానాథ్‌ను టెక్నికల్‌ డైరెక్టర్‌గా తీసుకున్నారు. 

కాపీరైట్‌ గొడవల్లో నాటకీయ కథ 
కృత్తివెంటి వారి నాటక సమాజానుభవానికీ, ఈ ‘ప్రేమ విజయము’ చిత్రకథకూ దగ్గరి సంబంధం ఉంది. వారి డ్రామా సంస్థ ఆడిన ‘కాలేజి గరల్‌’ నాటకమే ఈ సినిమాకు మూలం. ఆ సంస్థ 1934లో మద్రాసులో ఆ నాటక ప్రదర్శనలు ఇచ్చాక ఆ కథనే సినిమా తీయాల్సిందిగా మిత్రులు ప్రోత్సహించారు. ఆ నాటకం కథన, కల్పన వగైరా అంతా కృత్తివెంటిదే. రచయిత కాళ్ళకూరి హనుమంతరావుతో చెప్పి రాయించారు. నాటకం వేసిన ప్రతి పట్టణంలో రంగస్థలానికి అనుకూలంగా మార్చుకుంటూ ప్రదర్శించారు. ప్రదర్శనల సమయంలోనే పేచీలు పెట్టిన కాళ్ళకూరి ఆ నాటకాన్ని తన పేరు మీద పుస్తకంగా వేసుకున్నారు. 

అది తాము సినిమా తీయడానికి అడ్డంకి అవుతుందని కృత్తివెంటి భావించారు. వెంటనే తాము నాటకాన్ని ప్రదర్శిస్తున్న పద్ధతిలోనే కవి వేదుల సత్యనారాయణశాస్త్రితో సరికొత్తగా నాటకం రాయించారు. దానికి ‘ఎక్స్‌ కాలేజి గరల్‌’ (లేదా ‘న్యూ కాలేజి గరల్‌’) అని పేరు పెట్టారు. అదే ఈ సోషల్‌ ఫిల్ముకు మూలాధారమైంది. ఇలా ఉండగా, ‘కాలేజి గరల్‌’ నాటకంపై కృత్తివెంటి మీద కాళ్ళకూరి కోర్టులో తెచ్చిన చార్జీని కొట్టేశారు.  

దీని కన్నా ముందే మరో సోషల్‌!?
అసలు ఈ ‘ప్రేమ విజయము’ కన్నా ముందే తెలుగులో వేరే సోషల్‌ టాకీ తీసే ప్రయత్నాలు జరిగాయి. ఆ సినిమా పేరు ‘విజయ’. ఆ తొలి ప్రయత్నాలు చేసింది కూడా ఈ ‘ప్రేమ విజయము’ నిర్మాతలే! వారు చెన్నపట్నంలోని ‘ది మద్రాస్‌ పీపుల్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’ యజమానులు. మరికొందరితో కలసి వాళ్ళు విజయ సౌండ్‌ ఫిలిమ్స్‌ లిమిటెడ్, ఇండియన్‌ ఆర్ట్‌ సినీటోన్‌ అనే కంపెనీలు పెట్టారు. పౌరాణిక చిత్రం ‘సేతుబంధనం’, సాంఘిక చిత్రం ‘విజయ’... రెండూ తీయాలనుకున్నారు. దర్శకుడు ఐ. రాజారావు నాయుడు. షూటింగ్‌ కూడా మొదలైంది. 

తీరా దర్శకుడితో విభేదాలతో, ‘విజయ’ అటకెక్కింది. నిర్మాతలకు అప్పుడు గతంలో తాము చూసిన పాపులర్‌ డ్రామా ‘కాలేజి గరల్‌’ గుర్తొచ్చింది. ఆ నాటక ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావును రప్పించారు. తన ‘న్యూ కాలేజి గరల్‌’ నాటకాన్ని ‘నియో కాలేజి గరల్‌’ పేరిట ఫిల్మ్‌ తీసేందుకు కృత్తివెంటి ఒప్పుకొన్నారు. కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారు. 

అప్పట్లోనే అన్ని రకాల జోక్యాలూ! 
నెలరోజుల్లోనే అందరినీ బుక్‌ చేసి, సినేరియో (స్క్రీన్‌ప్లేకు అప్పటి పేరు), వగైరా సిద్ధం చేశారు కృత్తివెంటి. తీరా సినీ నిర్మాణ సంస్థ పక్షాన అన్ని విషయాల నిర్వహణా చూసే జనరల్‌ మేనేజర్‌గా నియమితులైన అడ్వకేట్‌ గారికి సినేరియో నచ్చలేదు. అందులో ఎన్నికలు, కట్నం లేని పెళ్ళి లాంటి ఘట్టాలు చేర్పించి, కలగాపులగం చేసి, కొత్త సినేరియో తయారు చేయించారు. చివరకు కట్నాల కథ తీసేసి, ఎన్నికల అంశం మాత్రం ఉంచేలా రాజీ కుదిరింది. కానీ, కథనంతా మార్చేసి మళ్ళీ కొత్తగా రాయాల్సి వచ్చింది. ‘కాలేజి గరల్‌’ టైటిల్‌ను ‘ప్రేమ విజయము’ అని మార్చాల్సొచ్చింది.  

ప్రింట్‌ లేని ఆ చిత్రకథేమిటంటే...
సినిమా ప్రింట్, పాటల పుస్తకం మాట దేవుడెరుగు, కనీసం ఫొటోలు దొరకడమే గగనమైన ‘ప్రేమ విజయము’ చిత్రకథ స్థూలంగా ఇదీ: వెంకట్రావు మంచి చిత్రకారుడు. చిత్రకళాశాలలో అతని సహాధ్యాయిని రుక్మిణి బాల వితంతువు. వెంకట్రావుకు స్నేహితులు కృష్ణారావు, రామారావు. అప్పటికే పెళ్ళయిపోయిన కృష్ణారావు పాతకాలపు చాదస్తాలు నిండిన తన భార్య పట్ల విముఖుడై రుక్మిణి పట్ల ఆకర్షితుడవుతాడు. ఒకపక్క కృష్ణారావు స్వగ్రామంలో జిల్లా బోర్డుకు ఎన్నికలు. ఎన్నికల్లో గెలవాలని అప్పు కోసం తన పడుచు కూతురు లక్ష్మిని ఓ ముసలి రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌కి ఇచ్చి అయిదోపెళ్ళి జరిపించేస్తాడు రావుబహద్దూర్‌ గోపాలరావు. ఆ అమ్మాయికేమో చిన్నప్పటి నుంచి మేనబావ రామారావు అంటే ఇష్టం. 

ఇక్కడ ఇంకోపక్కేమో... భర్త కృష్ణారావు తనను ప్రేమించడం లేదని భార్య దిగులుతో కృశిస్తూ ఉంటుంది. బాలవితంతువు రుక్మిణేమో అప్పటికే పెళ్ళయిన కృష్ణారావునే వివాహమాడాలని తపిస్తుంటుంది. వేరొకపక్క చిత్రకారుడైన వెంకట్రావేమో, రుక్మిణిని పెళ్ళి చేసుకోవాలని తహతహలాడుతుంటాడు. చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా.

ఆ నటీనటులు ఎవరంటే...
ఇండియన్‌ ఆర్ట్‌ సినీటోన్‌ పతాకంపై తయారైన ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రంలో హీరో ప్రభల కృష్ణమూర్తి. ‘‘హీరోయినేమో తర్వాతి రోజుల్లో నటి – నిర్మాత సి. కృష్ణవేణి నిర్మించిన ‘దాంపత్యం’లో హీరోగా నటించిన విజయకుమార్‌ తల్లి. ఆమె పేరు రాజ్యలక్ష్మి అని గుర్తు’’ అని విమర్శకులు వి.ఏ.కె. రంగారావు మాట. అయితే, కృష్ణవేణి కుమార్తె – నిర్మాత అనూరాధాదేవి మాత్రం, ఆమె పేరు సుగుణమ్మనీ, ఆమెకు సినిమాలతో సంబంధమే లేదనీ అన్నారు. ఏమైనా, లభిస్తున్న ఆధారాల మేరకు ఈ చిత్రంలో మిస్‌ (గుంటూరు) భానుమతి కీలక పాత్రధారిణి. పి.యస్‌. శర్మ, పి. రామారావు, మిస్‌ నూకరాజు, మిస్‌ రాజ్యం, బి. రాజ్యలక్ష్మమ్మ భాగవతార్, ఎం. రామచంద్రమూర్తి, కె. రంగారావు తదితరులు నటించారు. తర్వాత గయ్యాళి పాత్రలతో పేరొందిన నటి (జవ్వాది) గంగారత్నం హాస్యపాత్ర ధరించారు. 

‘గౌతమీ కోకిల’ సాహిత్యం! 
కాకినాడ మాస్టారి సంగీతం!
‘ప్రేమ విజయము’ సంగీతం, పాటలకూ ఓ చరిత్ర ఉంది. ప్రసిద్ధ భావకవి ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి సాహిత్యం అందించారు. కాకినాడకు చెందిన సంగీత విద్వాన్‌ మునుగంటి వేంకటరావు పంతులు సంగీతం సమకూర్చారు. అలా సాహిత్య, సంగీత రంగాల్లో దిగ్దంతులైన ఇద్దరు పనిచేయడం ఆ సినిమా ప్రత్యేకత. ఈమని శంకరశాస్త్రి, ఓలేటి వెంకటేశ్వర్లు, వింజమూరి సిస్టర్స్‌ (అనసూయ – సీత)... మునుగంటి వారి శిష్యులే. ‘గానకళ’ మాసపత్రికను నడిపిన సంగీత విమర్శకులు మునుగంటి శ్రీరామమూర్తి వారి కుమారుడే! 

‘ప్రేమ విజయము’ కోసం మునుగంటి కట్టిన బాణీలు, ఆ పాటలు స్వర్గీయ వింజమూరి అనసూయ ఈ వ్యాసకర్తకు గతంలో వివరిస్తూ, ‘‘మా గురువు గారు ఆ సినిమాలో ఓ వేషం కూడా వేశారు. ఓ పాట పాడారు. ఎక్కువగా శివరంజని రాగంలో వరసలు కట్టారు’’ అని చెప్పారు. ‘పాడు స్వార్థములు అనుమానాలు...’, ‘ఏటికీ ఈ మగవారలు...’, అలాగే ‘చీకటుల పాలేనా...’ అనే పాటలను ఆమె గుర్తుచేసుకున్నారు.  

అతి పొదుపుగా... అదీ నెల రోజుల్లో... 
‘ప్రేమ విజయము’ చిత్రీకరణ కూడా నానా అవస్థలతో నడిచింది. అప్పటికే విజయ సినీటోన్‌ పక్షాన మొదలైన ‘సేతుబంధనం’లో ఖర్చు తప్పితే, పురోగతి లేదు. దాంతో, నిర్మాతలు ఆ చిత్ర డైరెక్టర్‌ రాజారావు నాయుడు ట్రూప్‌ను స్టూడియో నుంచి బయటకు పంపేసి, విజయ సినీటోన్‌కు చరమగీతం పాడేశారు. అప్పటికే బొంబాయి నుంచి కెమెరా, రికార్డింగ్‌ ట్రక్కులు వగైరా తెచ్చి చాలా రోజులైంది. వాటి కాంట్రాక్ట్‌ కాలం నెలరోజులే మిగిలింది. ఆ వ్యవధి లోపలే ‘ప్రేమ విజయము’ షూటింగ్‌ అయిపోవాలన్నారు ఫిల్మ్‌ కంపెనీ తాలూకు ట్రస్టీలు. అంతా హడావిడే. అతి పొదుపుగా షూటింగ్‌ ఏర్పాటు జరిగాయి. ఎలాగోలా నెల రోజుల్లో షూటింగ్‌ అంతా ముగించారు. 

తొలి సోషల్‌... ఓ పెద్ద ఫ్లాప్‌!
1936 జూలై 20న ‘ప్రేమ విజయము’ రిలీజైంది. ‘‘పుక్కిటి పురాణాల ఫిలిమ్స్‌తో విసిగిపోయిన ఆంధ్రులకు ఒక కొత్త కానుక... ఒక కళోపహారం’’ అంటూ అప్పట్లో ఈ సినిమాకు పబ్లిసిటీ చేశారు. అలా మన తొలి సోషల్‌ టాకీయే ‘స్త్రీ స్వాతంత్య్ర సంకల్పం’, ‘బాల్యవివాహాలతో అనర్థాల’ను వెండితెరపై చూపడం పెద్ద విశేషమే! సినిమా ముందుగా గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడల్లోనే రిలీజైంది. కథ, సాంకేతికతల రీత్యా సినిమా వట్టి అతుకులబొంతగా మిగిలింది. పెద్దగా ప్రజాదరణ పొందలేదు. 

తెరపై తెలుగు సమాజం, వాతావరణం!
తెలుగులో వచ్చిన తొలి సోషల్‌ టాకీ ఆశించిన విజయం సాధించకున్నా, తర్వాత వరుసగా సోషల్‌ టాకీలు వచ్చేందుకు బీజం వేయగలిగింది. ఆ సినిమా వచ్చిన 20 నెలలకు, తెలుగులో రెండో సోషల్‌ టాకీ హెచ్‌.ఎం. రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938 మార్చి 12) వచ్చింది. ఆ వెంటనే గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ (1938), ‘రైతుబిడ్డ’ (1939), వై.వి. రావు ‘మళ్ళీ పెళ్ళి’ (1939 డిసెంబర్‌ 17) లాంటివి వరుసగా వచ్చి, తెలుగు సినిమాను సమకాలీన సాంఘిక మార్గం పట్టించాయి. అలా తెరపై మన జీవితాన్నీ, కట్టూ, బొట్టునూ చూపించాల్సి వచ్చింది. 

తొంభై ఏళ్ళ కాలంలో సంఘ ప్రబోధం, సెంటిమెంట్‌ దగ్గర మొదలై స్మగ్లింగ్‌ కథల దాకా తెలుగు సోషల్‌ సినిమా ఎన్నో కోవల్లో, ఎంతో దూరం ప్రయాణించింది. హీరో మంచివాడన్న మాటకు కాలం చెల్లి, యాంటీ హీరోయే అసలు హీరో అనే టాక్సిక్‌ వాతావరణానికి వచ్చేశాం. తెలుగు సినిమాల్లో తెలుగు సమాజం ఎంత అంటే నీళ్ళు నమలాల్సిన పరిస్థితీ వచ్చింది. మనదైన జీవితమే లేని సినిమాలే మన సినిమాగా చలామణీ అవుతున్న దౌర్భాగ్యమూ దాపురించింది. బాక్సాఫీస్‌ లెక్కల్లో మాత్రం పాన్‌ ఇండియా కోటలు దాటామని తృప్తి పడాల్సిన పరిస్థితి. సంఖ్య, విస్తృతి, వసూళ్ళపరంగా అనూహ్య ప్రగతి సాధించాం సరే, సరుకులో నాణ్యత మాటేమిటన్నది మాత్రం బేతాళ ప్రశ్నే!

ఎవరీ కృత్తివెంటి నాగేశ్వరరావు? 
నాటకకళే జీవితంగా బతికిన నటుడు, తొలితరం నాటక సమాజ నిర్వాహకుడు, ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావు. ఆయన పుట్టింది బందరులో అయినా, పెరిగింది రాజమండ్రిలో! అక్కడే పార్శీ నాటకాలు చూసి, ప్రేరణ పొంది, ప్రసిద్ధ ‘హిందూ నాటక సమాజం’లో తొలుత స్త్రీ పాత్రలు ధరించారు. ఉర్దూ నాటకాలు కూడా ఆడారు. 1908లో సత్యవోలు గున్నేశ్వరరావు గారి నాటక కంపెనీలో చేరి, దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోయారు. కృత్తివెంటి సొంత నాటక సమాజం పెట్టారు. దాదాపు 12 ఏళ్ళు 150 మంది నటుల్ని పోషించారు. 

నాటకకళ కోసం ఆస్తినే కాదు, జీవితాన్ని కూడా ఖర్చుపెట్టిన కృత్తివెంటి ‘ప్రేమ విజయము’ తర్వాత మళ్ళీ సినిమాలు తీయలేదు. వారి ఏకైక కుమారుడు కె. హరనాథ్‌ మాత్రం సినిమాల్లోకే వచ్చారు. వాహినీ స్టూడియో శబ్దగ్రహణ శాఖలో వల్లభజోస్యుల శివరామ్‌ మార్గదర్శకత్వంలో ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్‌తో కలసి సుదీర్ఘకాలం రికార్డిస్ట్‌గా పనిచేశారు.

గుడిలో షూటింగ్‌... ఆలయ సంప్రోక్షణ!
‘ప్రేమ విజయము’లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మద్రాసులోని ట్రిప్లికేన్‌లో ప్రసిద్ధ శ్రీపార్థసారథి స్వామి గుడిలో జరిగింది. ‘పవిత్రమైన ఆలయంలో సినిమా షూటింగ్‌ చేయనిస్తారా’ అంటూ అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఆలయ భక్తులందరూ స్థానిక మండపంలో బహిరంగ సమావేశమై, షూటింగ్‌ వ్యవహారాన్ని నిరసించారు. జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆలయ ‘సంప్రోక్షణ’ జరపాలని నిర్ణయించారు. ఆ వివాదం నాటి సాంఘిక పరిస్థితులకు అద్దంపడుతుంది.

పారితోషికంలోనూ పేచీలే! 
సినిమాల్లో రెమ్యూనరేషన్‌ వివాదాలు ‘ప్రేమ విజయము’ నాటికే ఉన్నాయి. ఆ సినిమా పూర్తయ్యాక నిర్మాతలు రైల్వే చార్జీలు మినహా అంతా ఇచ్చి, ఆర్టిస్టుల్ని పంపేశారు. రచయితకు ఇవ్వాల్సిన మిగతా సొమ్ము, నటీనటుల రైలుఖర్చులు కొన్ని నెలల పాటు తిప్పించి గానీ ముట్టజెప్పలేదు. కృత్తివెంటి కోర్టుకెక్కారు. అయితే, అన్నివిధాలా నష్టపోయి, దెబ్బతిన్న ఆయన చివరకు తనకు ఇవ్వాల్సిన పర్సంటేజ్‌ మాట దేవుడెరుగు, కనీసం పెట్టిన ఖర్చయినా వస్తే చాలనుకొని రాజీకి వచ్చారు. తెలుగు సినీరంగంలో రెమ్యూనరేషన్‌ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం బహుశా అదే తొలిసారి.

3 భాషల్లోనూ... నాటకాలే! 
సైలెంట్‌ సినిమాల రోజుల్లోనే దక్షిణాదిన సోషల్‌ కథలు వచ్చినా, మూకీలు పోయి మాటలు, పాటలున్న టాకీలు మొదలయ్యాక తెలుగులో సోషల్‌ సినిమా రావడానికి అయిదేళ్ళు పట్టేసింది. తెరపై పూర్తి నిడివి టాకీ చిత్రాల విషయంలో తమిళం సహా ఇతర దక్షిణాది భాషల కన్నా మనమే ముందున్నా, తెరపై సాంఘిక చిత్రం మాత్రం తమిళం తర్వాత కానీ మనకు రాలేదు. తమిళంలో తొలి సోషల్‌ టాకీ ‘మేనక’ (1935 ఏప్రిల్‌ 6). ఇక, తెలుగు తర్వాత నెల రోజుల చిల్లరకే కన్నడంలో తొలి సోషల్‌ టాకీ ‘సంసార నౌక’ (1936 ఆగస్టు 27) వచ్చింది. అటు తమిళం, ఇటు తెలుగు, ఆ తర్వాత కన్నడం... మూడింటిలోనూ ఫస్ట్‌ సోషల్‌ టాకీలు రంగస్థలం నుంచి వెండితెరకెక్కిన నాటకాలే కావడం గమనార్హం.

∙రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement