నేడు ఫాదర్స్ డే
ఇంట్లో ఉండే అసలైన మల్టీటాస్కింగ్ మెషిన్ ఒక చేతిలో ఈఎమ్‌ఐ బిల్లులు.. మరో చేతిలో కూరగాయల బ్యాగులు... మధ్యలో పిల్లల ఫీజులు, ఆఫీస్ టెన్షన్లు... అన్నీ బ్యాలెన్స్ చేస్తూ , బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినా... ‘ఏం లేదు బాగానే ఉన్నా’ అని నవ్వే మనిషి. ఫ్యూచర్ కోసం, డ్రీమ్స్‌ను సైలెంట్‌గా మ్యూట్ చేసి, ఇంటి సమస్యలకు గూగుల్ కంటే ఫాస్ట్‌గా సొల్యూషన్స్ వెతికేస్తాడు! పిల్లల మార్కులు తక్కువ వస్తే లెక్చరర్.
కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఫైనాన్స్ మినిస్టర్. ఇంట్లో బల్బ్ ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ . రాత్రి పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్! ఇలా ఒక్క మనిషిలో ఇన్ని జాబ్స్ ఎలా ఉంటాయో అర్థం కాదు... కానీ ఆ పోస్టుకి పేరు మాత్రం ఒక్కటే ‘నాన్న’! ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితాల్లోని ఆ సైలెంట్ సూపర్ హీరోలకు, ఒక ‘హ్యాపీ ఫాదర్స్ డే’తో పాటు. ఒక పెద్ద హగ్ కూడా!
అమ్మ ప్రేమ రోజూ కనిపిస్తుంది; రోజూ వినిపిస్తుంది. నాన్న ప్రేమ కనిపించదు కానీ, జీవితాంతం మనతోనే ఉంటుంది! చిన్నప్పటి నుంచి ఎంత పెద్దవాళ్లమైనా సరే... ‘నాన్న... కాస్త డబ్బులు కావాలి!’ అనే మెసేజ్ వెళ్లిన ఐదు నిమిషాల్లో ‘ఎంత కావాలి?’ అని రిప్లయ్ ఇచ్చే ఏకైక వ్యక్తి నాన్నే! అంతేకాదు, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా, గ్యాస్ అయిపోయినా, స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినా, బైక్ పంక్చర్ అయినా... ఇంట్లోని ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే ఫస్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా నాన్నే! విచిత్రం ఏంటంటే... ఇంట్లో అందరి సమస్యలకు ‘కస్టమర్ కేర్’లా ఉండే ఆ మనిషిని మాత్రం ‘నీకు ఏం కావాలి’ అని అడిగే వాళ్లు తక్కువ! మన ఫ్యూచర్ కోసం తమ వర్తమానాన్ని ఈఎంఐల్లో పెట్టేసే వాళ్లే నాన్నలందరూ!
సీక్రెట్ భాష!
ప్రపంచంలో అత్యంత విచిత్రమైన ప్రేమ భాష నాన్నలదే! వాళ్లు ఎప్పుడూ సినిమా హీరోల్లా ‘నువ్వంటే ప్రాణం!’ అని చెప్పరు. ‘భోజనం చేశావా?’ అనడానికి బదులు... ‘ఇంకా లేవలేదా?’ అంటూ అరుస్తారు. ‘జాగ్రత్తగా వెళ్లు’ అనడానికి బదులు... ‘బైక్‌కి ఏమైనా అయితే కాళ్లు విరగ్గొడతా!’ అంటారు. ‘నిన్ను మిస్ అవుతున్నా’ అని నేరుగా చెప్పరు... ‘టైం ఎంతైందో తెలుసా? ఇంటికి రావాలనే ఆలోచన ఉందా? లేదా?’ అంటూ కోపంగా అడుగుతారు.
మనకు చిన్న దెబ్బ తగిలితే, అమ్మ కంగారు పడితే, నాన్న మాత్రం ‘చూసుకోకూడదా!’ అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం అందరికంటే ముందుగా పరిగెత్తేది కూడా ఆయనే! అలా నాన్నలు ప్రేమను మాటల్లో వ్యక్తం చేయకపోయినా... ప్రతిరోజూ తమ కంగారులో, శ్రద్ధలో, బాధ్యతలో చూపిస్తూనే ఉంటారు. చిన్నప్పుడు ఇవన్నీ చూసి ‘నాన్నకి కోపం ఎక్కువ’ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్నలు ఎప్పుడూ వారి ప్రేమను వార్నింగ్‌ల్లో, డ్యూటీల్లోనూ దాచేస్తారు!
నాన్నల పది ఫన్నీ నిజాలు!
1. లోకాస్ట్ డిటెక్టివ్‌లు!
ఇంట్లో గంటసేపు వెతికినా దొరకని వస్తువు... నాన్న వచ్చి పది సెకన్లలో కనిపెడతారు! పైగా, ‘కళ్లతో వెతికావా? లేక నోటితో వెతికావా?’ అని బోనస్ డైలాగ్ కూడా ఇస్తారు!
2. స్విచ్ అంటే ప్రాణం!
‘స్విచ్ ఆఫ్ చేయండి’ అనేది వారి జాతీయ నినాదం! ఎవరూ లేని గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే వారి బీపీ ఆకాశాన్ని తాకేస్తుంది. ఇక అందరికీ ఏసీ 24 డిగ్రీలకు కూల్‌గా అనిపిస్తే... ఆయన మాత్రం 27కి మార్చితేనే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు.
3. రిమోట్ కంట్రోల్‌పై జన్మహక్కు!
టీవీ రిమోట్ ఇంట్లో అందరిదైనా... దాన్ని పట్టుకునే హక్కు మాత్రం నాన్నలదే! చానెల్ మార్చే పవర్ కూడా వాళ్ల చేతిలోనే ఉంటుంది.
4. ధరల గూగుల్!
ఏదైనా కొత్త వస్తువు కొంటే... ‘మా కాలంలో దీని ధర ఎంత తెలుసా?’ అంటూ వెంటనే చరిత్ర పాఠం మొదలుపెడతారు. నాన్నతో పాటు కొనే, ప్రతి ఒక్క కొనుగోలు వెనుక ఒక ఎకనామిక్స్ క్లాస్ ఫ్రీ!
5. ఐదు నిమిషాల కథ!
పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటే కోపం వస్తుంది. కానీ నాన్న ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆ ఐదు నిమిషాలు అరగంటైనా సరే, ఇంకో ఐదు నిమిషాలు కొనసాగుతూనే ఉంటుంది.
6. ఇంటి సీఐడీ!
ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? వంటి విషయాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా కంటే ఎక్కువ సమాచారం నాన్నల దగ్గరే ఉంటుంది!
7. వాతావరణ శాఖ!
వర్షం పడబోతుందా? ఎండ ఎక్కువగా ఉంటుందా? ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే చాలు... నాన్న వెంటనే వాతావరణ నివేదిక ఇచ్చేస్తారు!
8. కొనరు... కొంటారు!
పిల్లలు అడిగిన వస్తువు కోసం వెంటనే పర్సు తీయడానికే చూస్తారు! అన్నీ కొనిచ్చే ఆయనే... తిరిగి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అని క్లాస్ కూడా పీకుతారు.
9. వాట్సాప్ యూనివర్సిటీ టాపర్స్!
ఉదయం లేవగానే ‘శుభోదయం’ పూలు, సూర్యోదయం, సూక్తులు పంపడం చాలామంది నాన్నల డైలీ రొటీన్ ! కుటుంబ గ్రూప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపడంలో వీళ్లకు డిగ్రీ ఇచ్చేయొచ్చు.
10. నాన్నల అల్లరి!
నాన్నలు ఎంత స్ట్రిక్ట్‌గా కనిపించినా... పిల్లలు నవ్వితే వాళ్లు కూడా లోపల చిన్న పిల్లలే! బయటకు సీరియస్‌గా కనిపించే ఆ మనిషి... ఇంట్లో మాత్రం పిల్లలతో కలిసి కార్టూన్లు చూసే బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోతాడు!
నాన్న 4.0: ఎమోషన్ సేమ్... వర్షన్ మారింది!
ఒకప్పుడు ‘నాన్న’ అంటే ఇంట్లోకి రాగానే టీవీ సౌండ్ తగ్గడం, గంభీరమైన గొంతు, ‘అమ్మను అడుగు’ అనే డైలీ డైలాగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినప్పుడు వచ్చే ఆ సీరియస్ లుక్. కానీ కట్ చేస్తే... ఇది 2026! ఇప్పుడు నాన్న రూటే వేరు. ఒకప్పుడు మనల్ని కనిపెట్టుకుని ఉండే నాన్న, ఇప్పుడు రీల్స్‌లో ట్రెండింగ్ స్టెప్పులు వేస్తూ, వాట్సాప్ స్టేటస్‌లతో వరుసగా సీక్రెట్ క్లాస్ తీసుకుంటున్నాడు. అలా ఈ ఫాదర్స్ డే సందర్భంగా, మన ఇళ్లల్లో ఉండే రకరకాల నాన్నల థింకింగ్ యాంగిల్స్‌పై, కాస్త కామెడీ.. ఇంకొంచెం ఎమోషన్ కలిపి ఓ లుక్కేద్దాం రండి!
డిజిటల్ నాన్న
ఈ నాన్నలు వాట్సాప్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా తమను తామే నియమించుకుంటారు. ఈ కేటగిరీ నాన్నలు ఉదయం 5 గంటలకే నిద్రలేవరు. కానీ, డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లతో మనల్ని లేపుతారు. పైగా వీరి స్పెషాలిటీ ఏంటంటే, మనకంటే ముందే కొత్త గాడ్జెట్స్ కొనేస్తారు. ఏఐ టూల్స్ వాడి ఫ్యామిలీ గ్రూప్‌లో వింత వింత ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేస్తుంటారు. అయితే, వీరంతా, రీల్స్ చూస్తూ ఫోన్ వాల్యూమ్ ఫుల్‌గా పెట్టేసి, పక్కన వాళ్లకి నిద్ర లేకుండా చేయడం వీరి ప్రధాన హాబీ.
ఫిట్‌నెస్ ఫ్రీక్
డైట్ దాదా అంటారు వీరిని. 2026లో నాన్నలు వయసుని రివర్స్ గేర్‌లో నడిపిస్తున్నారు. జిమ్, యోగా క్లాసులు, గ్రీన్ టీలతో తెగ బిజీ అయిపోతారు. పొట్ట తగ్గించడానికి ఇంట్లో వాళ్లందరికీ సలాడ్స్ తినిపించాలని ట్రై చేస్తుంటారు. వీళ్ల స్మార్ట్ వాచ్‌లో పదివేల స్టెప్స్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఆ రోజు ఇంట్లో యుద్ధమే. ‘మైదా తిని తిని బద్ధకం పెరిగిపోయింది నీకు, రేపటి నుంచి 4 గంటలకి రన్నింగ్ కి రా!’ అనే ఫ్రీ ఫిట్‌నెస్ కోచ్‌లు వీళ్లు.
డబ్బులు ఊరికేరావు!
ఈ నాన్నలను బడ్జెట్ బాబాయ్‌లుగా పిలవొచ్చు. ఎందుకంటే, కాలం మారినా, ఏ ఇయర్ వచ్చినా ఈ యాంగిల్ మాత్రం అస్సలు మారదు. వీరు ఇంటికి అప్రకటిత ఆర్థిక మంత్రి లాంటివారన్నమాట. మనం రూ. రెండు వేల షర్ట్ కొన్నా, బిర్యానీ తిన్నా.. వీరు లెక్కించేది మాత్రం పాత కాలపు కరెన్సీ వాల్యూతోనే. ‘మేము మీ వయసులో ఉన్నప్పుడు రూ. 50తోనే గడిపేవారం తెలుసా?’ అంటూ తిట్టేవారే. అయితే, మన లగ్జరీ ఖర్చులకి తిడుతూనే, అమ్మకి తెలియకుండా మన అకౌంట్‌లోకి ‘పాకెట్ మనీ’ జీపే చేసే గ్రేట్ హార్ట్ కూడా వీరిదే!
అప్‌డేటెడ్ డాడ్స్
నాన్నలు కూడా టెక్నాలజీతో పాటు బాగా అప్‌డేట్ అయ్యారు! ఒకప్పుడు టీవీ రిమోట్ మాత్రమే ఆపరేట్ చేసిన వీళ్లంతా, ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ, మీమ్స్ షేర్ చేస్తూ, వీడియో కాల్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పిల్లలకు హోమ్‌వర్క్ చెబుతూనే మధ్యలో రీల్ చూస్తారు. వీడియో గేమ్స్ ఆడుతూ పిల్లలతో పోటీ పడతారు. స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో టీచర్ల కంటే ఎక్కువ అప్డేట్స్ తెలుసుకొని ఉంటారు. ఆన్‌లైన్‌లో బొమ్మలు, గాడ్జెట్స్, స్కూల్ బ్యాగులు ఆర్డర్ చేస్తూ ‘క్యాష్‌బ్యాక్ వచ్చింది!’ అని చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. కానీ టెక్నాలజీ ఎంత మారినా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచన, వాళ్ల కోసం నిశ్శబ్దంగా పడే కష్టం!
జీతం వచ్చిన రోజు హీరో... నెలాఖరులో విలన్ !
జీతం వచ్చిన రోజు ‘ఏం కావాలి చెప్పు!’ అంటూ అల్లాఉద్దీన్ సినిమాలోని జీనీలా కనిపించే నాన్న... నెలాఖరుకి వచ్చేసరికి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అంటూ విలన్ లా మారిపోతాడు! అందుకే చిన్నప్పుడు నాన్నంటే చాలామందికి తెలిసింది రెండే విషయాలు. స్కూల్ ఫీజు కట్టేవాడు, మార్కులు తక్కువ వస్తే క్లాస్ తీసుకునేవాడు! అందుకే నాన్నంటే ఆ భయం ఎప్పటికీ కాస్త ఉంటూనే ఉంటుంది. కానీ పెద్దయ్యాక అసలు విషయం అర్థమవుతుంది... మనం తిన్న ప్రతి ఐస్‌క్రీమ్ వెనుక, వెళ్లిన ప్రతి స్కూల్ ట్రిప్ వెనుక, పుట్టినరోజుకి వచ్చిన ప్రతి గిఫ్ట్ వెనుక నాన్న ఓవర్‌టైమ్ కథ దాగి ఉంటుందని! మనం సంతోషంగా నవ్వేందుకు ఆయన ఎన్నో కోరికలు పక్కన పెట్టాడని! చిన్నప్పుడు విలన్ లా కనిపించిన నాన్న... పెద్దయ్యాక మన జీవితంలో అసలు సూపర్ హీరో అని అర్థమవుతుంది!
మంచి నాన్న కావాలంటే!
చాలామంది నాన్నలు ‘పిల్లల మంచికోసమే’ అని కొన్ని పనులు చేస్తుంటారు. కానీ వాళ్లు మంచిగా అనుకుని చేసే కొన్ని విషయాలు... పిల్లల మనసుకు తెలియకుండా దూరం కూడా చేస్తుంటాయి. అందుకే మంచి నాన్న కావాలంటే కేవలం ప్రేమ ఉండటం సరిపోదు... ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నామన్నదే ముఖ్యం!
ఇలా చేయొద్దు
⇒ ‘నేను చెప్పిందే ఫైనల్!’ అంటూ నిర్ణయాలు తీసుకోవడం
⇒ ‘మా కాలంలో ఇలా కాదు!’ అంటూ ప్రతి విషయంలో పోల్చడం
⇒ మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడం
⇒ ‘పక్కింటి పిల్లాడిని చూడు!’ అంటూ పోలికలు పెట్టడం
⇒ ఫోన్ లోనే బిజీగా ఉండడం
⇒ ప్రేమను మనసులోనే దాచుకోవడం
⇒ భయపెట్టి క్రమశిక్షణ నేర్పించడం
⇒ ‘అబ్బాయిలు ఏడవకూడదు!’ అని చెప్పడం
⇒ తప్పు చేసినా ఈగోతో ఉండడం
⇒ పిల్లల కోసం మాత్రమే కష్టపడుతూ, వారితో సమయం గడపకపోవడం
ఇలా చేయండి
⇒ ‘నీ అభిప్రాయం ఏంటి?’ అని పిల్లల మాట కూడా వినండి
⇒ ‘మీ జనరేషన్ ఎలా ఆలోచిస్తోంది?’ అని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి
⇒ వారు చేసిన ప్రయత్నాన్ని కూడా మెచ్చుకోండి
⇒ ‘నువ్వు నీలా బాగా చేయ గలవు’ అని ప్రోత్సహించండి
⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా పిల్లలతో గడపండి
⇒ ‘నీ మీద గర్వంగా ఉంది’, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పండి
⇒ అర్థం చేసుకునేలా, నమ్మకంతో నేర్పండి
⇒ భావాలను బయటపెట్టడం కూడా సహజమే అని నేర్పండి
⇒ అవసరమైతే ‘సారీ’ చెప్పండి
⇒ పిల్లలతో కలిసి నవ్వండి, ఆడండి, జ్ఞాపకాలు సృష్టించండి
కొత్త నాన్నల కోసం చిన్న గైడ్!
నాన్నగా మారడం అంటే కేవలం బిడ్డను ఎత్తుకోవడం కాదు... ఒక చిన్న ప్రపంచానికి హీరోగా మారడం! కొత్త నాన్నలు చాలా విషయాల్లో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ‘నేను మంచి నాన్న అవగలనా?’ అనే భయం కూడా ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ నాన్న కావాల్సిన అవసరం లేదు... పిల్లలతో కలిసి నేర్చుకుంటూ వెళ్లే నాన్న అయితే చాలు!
⇒ బిడ్డ ఏడ్చినా, నవ్వినా, అల్లరి చేసినా దగ్గరగా ఉండండి
⇒ డైపర్ మార్చడం నుంచి నిద్రపుచ్చడం వరకు బాధ్యత పంచుకోండి
⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా బిడ్డతో గడపండి
⇒ చిన్న చిన్న మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయండి
⇒ బిడ్డతో మాట్లాడండి... వాళ్లు చిన్నవాళ్లైనా మీ గొంతు గుర్తుపడతారు
⇒ అమ్మకు కూడా విశ్రాంతి ఇచ్చే పార్ట్నర్‌గా ఉండండి
⇒ తప్పులు చేసినా భయపడకుండా నేర్చుకుంటూ వెళ్లండి
⇒ ఫొటోలు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేయండి
⇒ బిడ్డ ముందు ప్రేమగా, ఓపికగా ఉండండి
⇒ ‘పర్ఫెక్ట్ నాన్న’ అవ్వాలని కాదు... ‘ప్రెజెంట్ నాన్న’ అవ్వాలని ప్రయత్నించండి
ఎందుకంటే పిల్లలకు ఖరీదైన బహుమతులు గుర్తుండకపోవచ్చు... కానీ చిన్నప్పుడు నాన్న చేతిలో నిద్రపోయిన ఆ భద్రతా భావం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది!
లోకంలో అమ్మ ప్రేమకు గుడులు ఉంటే, నాన్న ప్రేమ ఒక నిశ్శబ్ద గోపురంలా ఇంటిని కాపాడుతూ నిలబడుతుంది. ఈ ఫాదర్స్ డే రోజున ఆ సైలెంట్ సూపర్ హీరోకి ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పండి, ఆయన ఆశించే అతిపెద్ద జీతం మీ నోటి నుంచి వచ్చే ఆ ఒక్క మాటే! ‘ఐ లవ్ యూ నాన్న’.
∙కొండి దీపిక


