
సుభాష్ పాలేకర్ కృషి (ఎస్‌పీకే) పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణ ఐదు దొంతర్ల ఉద్యాన పంటల సాగు చేపడితే వరి సాగులో రైతులు పొందే ఆదాయంతో పోల్చితే పది రెట్లు అధికాదాయం పొందవచ్చని సేవ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, ఎస్‌పీకే తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త విజయ్‌రామ్ తెలిపారు. భూతాపం పెరిగిపోతున్న దశలో వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు ఎస్‌పీకే సేద్యం దోహద పడుతుందన్నారు. నిమగ్నమై పనిచేసే రైతులు ఐదు అంచెల ఉద్యాన పంటల సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 3 లక్షల వరకు నికరాదాయం పొందే విధంగా కొత్తగా వ్యవసాయం చేపట్టాలనుకునే వారికి శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు.
సెప్టెంబర్ 2న పాలేకర్ ప్రసంగం
హైదరాబాద్ దోమల్‌గూడ శ్రీరామచంద్ర మిషన్‌లో సెప్టెంబర్ 2 (మంగళవారం)న ఉదయం 9 గంటలకు జరిగే తెలుగు రాష్ట్రాల ఎస్‌పీకే ముఖ్యుల సమావేశంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎస్‌పీకే రూపశిల్పి డా. సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తారని విజయ్‌రామ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పూర్వ జిల్లాల ప్రకారం ఎస్‌పీకే వ్యవసాయ పద్ధతిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అంకితభావంతో పనిచేసే వారిని జిల్లా సమన్వయకర్తలుగా నియమించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల రైతులు, యువ రైతులు, విశ్రాంత ఉద్యోగులు అందరికీ ఆహ్వానం పలుకు తున్నారు. జిల్లాకు కనీసం నలుగురు ప్రతినిధులు సెప్టెంబర్ 2 సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు.
డిసెంబర్‌లో క్షేత్ర సందర్శన
కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో తాను పెంచిన ఐదు దొంతర్ల నమూనా క్షేత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 25 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 మధ్య కాలంలో నిర్దేశిత తేదీల్లో సందర్శించవచ్చని విజయ్‌రామ్ తెలిపారు. తెలుగు రాష్రా్టల్లోని పాత జిల్లాలకు చెందిన వారికి ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు చెందిన వంద మంది రైతులు సందర్శించవచ్చన్నారు.
ఇతర వివరాలకు: ఫోన్: 6309111427