కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణజింకల వల్ల పంటలు నష్టపోయే రైతులకు ఉపశమనం
వరి పంటకు నీటి ముంపు రక్షణ బీమా పునరుద్ధరణ
2026 ఖరీఫ్ నుంచి అమల్లోకి తేనున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే జంతువుల వల్ల నష్టం జరుగుతోందో నోటిఫై చేసి, బీమాను అమలు చెయ్యాల్సి ఉంటుంది
పంటలకు అడవి జంతువుల వల్ల, వరి పంటకు నీటి ముంపు వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి 2026 ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణజింకల వంటి అడవి జంతువుల వల్ల కూరగాయలు, పండ్లు, వరి, పత్తి వంటి పంటలకు కూడా చాలా ప్రాంతాల్లో తీరని నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీటి ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎటువంటి అధికారిక శాస్త్రీయ సర్వేలు ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఆధారపడదగిన గణాంకాలేవీ అందుబాటులో లేవు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు వచ్చే ఖరీఫ్ నుంచి బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని ‘స్థానిక ప్రమాదం’గా గుర్తించి పీఎంఎఫ్‌బీవై కింద ఐదో యాడ్–ఆన్ కవర్‌గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియోట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్‌లోకి 72 గంటల్లోపు నష్టాలను రెతులు అప్‌లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది.
అటవీ జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతోందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థనల మేరకు కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆకస్మికంగా స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణపరంగా సాధ్యమయ్యే విధివిధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంట కాలం నుంచి అమల్లోకి వస్తాయి.
దేశవ్యాప్త దీర్ఘకాలిక సమస్య
మన దేశం అంతటా రైతులు ఏనుగులు, అడవి పందులు, నీల్‌గాయ్, జింకలు, కోతులు వంటి వన్యప్రాణుల దాడుల కారణంగా చాలా సంవత్సరాలుగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అడవులు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలు, కొండల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య సర్వసాధారణం. ఇప్పటివరకు, ఇటువంటి నష్టాలు పంట బీమా పరిధిలోకి రాకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోయారు. అదేవిధంగా, వరద పీడిత, తీరప్రాంత రాష్ట్రాల్లోని వరి రైతులు భారీ వర్షాలు, వరదల వల్ల పదేపదే నష్టపోతున్నారు. మునిగిపోయిన పంటలను అంచనా వేయడంలో ఇబ్బంది కారణంగా 2018లో వరి ముంపునకు బీమా సదుపాయం తొలగించారు. అయితే, ప్రతి ఏటా వరదలకు గురయ్యే జిల్లాల్లోని రైతులకు బీమా రక్షణ అందకుండా పోయింది.
ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నిర్ణయించారు. ఈ ముఖ్యమైన నిర్ణయంతో స్థానికంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ఇప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద సాంకేతికత ఆధారిత క్లెయిమ్ ద్వారా సకాలంలో పరిహారం పొందబోతున్నారు.
మానవ–వన్యప్రాణుల సంఘర్షణ ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని రైతులకు బీమా సదుపాయం గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ముంపు నుంచి వరి పంటకు స్థానిక విపత్తుగా బీమా రక్షణను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల తరచూ వరదల పాలయ్యే తీరప్రాంత, తదితర రాష్ట్రాలలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మన దేశ పంటల బీమా వ్యవస్థను ఈ కొత్త సవరణలు మరింత బలోపేతం చేస్తాయి.
రెండు రాష్ట్రాల్లో శాస్త్రీయ సర్వే చెయ్యాలి
విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచన
పంటలకు అడవి జంతువుల వల్ల బీమా సదుపాయాన్ని సరిగ్గా అమలు చెయ్యాలన్నా గణాంకాలు అవసరం. ఏయే జంతువుల వల్ల ఎంత మేరకు నష్టం జరుగుతోందో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర సర్వే ద్వారా గణాంకాలు సేకరించిన తర్వాత స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచిస్తున్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం అధిపతిగా, ప్రధాన శాస్త్రవేత్తగా దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఉద్యోగ విరమణ చేశారు.
‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
వచ్చే ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. రైతులకు ఉపశమనం కలుగుతుందంటారా?
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యే సమస్య కాదు. జటిలమైనది. ఏమి చెయ్యాలన్నా ముందు అధికారికంగా గణాంకాలు సేకరించాలి. పైపై అంచనాల ఆధారంగా కాకుండా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి?
వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల నిపుణులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రామాణిక పద్ధతుల్లో సర్వే జరపాలి. ఏయే అడవి జంతువుల వల్ల ఏయే పంటలకు ఏయే దశల్లో
ఎంత మేరకు పంట నష్టం జరుగుతున్నది? అనే గణాంకాలను ప్రాజెక్ట్ మోడ్‌లో పక్కాగా సేకరించాలి. ఏయే ప్రాంతాల్లో సమస్య ఏ(ఎక్కువ, మధ్యస్థం, తక్కువ) స్థాయిలో ఉందో గుర్తించాలి. తదనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో అడవి జంతువుల వల్ల పంటలకు నష్టం ఎంత మేరకు జరుగుతోందని మీరనుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య ఉంది. కోతులను వన్యప్రాణుల జాబితా
నుంచి తొలగించారు. కాబట్టి, వీటికి కుటుంబ నియంత్రణ చేయించవచ్చు. కోతులన్నిటినీ పట్టుకొని ఆపరేషన్ చెయ్యలేం కాబట్టి, ఆహారంలో మందు కలిపి పెట్టి మేటింగ్ కంట్రోల్ చెయ్యాలి. 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉంటుంది. వీటితో పాటు గద్వాల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కృష్ణజింకల సమస్య ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా ఏనుగుల సమస్య కూడా ఉంది. పంటలకే కాదు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు కూడా కోతుల సమస్య ఉంది. ఒక పార్టీ ఎన్నికల వాగ్దానం చెయ్యాల్సి వచ్చిందంటే ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శాస్త్రీయ సర్వే ఎంత త్వరగా, సమగ్రంగా చేస్తే.. సమస్య పరిష్కారం దిశగా అంత వేగంగా అడుగులు పడతాయి.
ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి సర్వే జరిగిందా?
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసింది. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను తగ్గించగలిగారు.
అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోవటంలో సాంకేతిక సాధనాలు ఎంతవరకు ఉపయోగకరం?
ఎన్ని సాంకేతిక ఉపకరణాలను రూపొందించినా కొంత మేరకు ప్రభావం చూపుతాయి. కానీ, పూర్తిగా సమస్యను పరిష్కరించలేవు.


