breaking news
Ministry of Agriculture
-
Sagubadi: 6 నెలల్లోనే ‘నేచురల్’ ధ్రువీకరణ!
ప్రకృతి వ్యవసాయ ఆహారోత్పత్తులపై వినియోగదారులకు నమ్మకం కలిగించటం ద్వారా ఆ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’ (ఎన్ఎఫ్సీఎస్)ను ఏర్పాటు చేస్తోంది. ‘ఆర్గానిక్’ ధ్రువీకరణ కోసం ఇప్పుడున్న ‘ఎన్పీఓపీ’, ‘పీజీఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ వ్యవస్థలకు అదనంగా.. దేశీ మార్కెట్ల కోసం ‘నేచురల్’ ధ్రువీకరణ వ్యవస్థ ప్రారంభమవుతోంది. సేంద్రియ ధ్రువీకరణ కోసం ఎన్పీఓపీ లేదా పీజీఎస్ సర్టిఫికేషన్ పొందడానికి అవసరమయ్యే పరివర్తన కాలం 3 ఏళ్లు. అయితే, ప్రకృతి వ్యవసాయదారులకు రిజిస్టర్ చేసుకున్న 6 నెలల్లోనే ‘నేచురల్’ సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. వెబ్‌పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒంటరి రైతు లేదా కనీసం ఐదుగురు రైతులు కలిసి బృందంగా నమోదు చేసుకోవచ్చు..మన దేశంలో ‘సేంద్రియ ఆహారోత్పత్తుల’ ధ్రువీకరణకు ఇప్పటికే రెండు (ఎన్పీఓపీ, పీజీఎస్ ఇండియా) ధ్రువీకరణ వ్యవస్థలు పనిచేస్తుండగా.. ఈ పరిధిలోకి రాని ‘ప్రకృతి వ్యవసాయోత్పత్తుల’ ధ్రువీకరణ కోసం మూడో ధ్రువీకరణ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆహార భద్రత మరియు ప్రమాణాలు (సేంద్రీయ ఆహారాలు) నిబంధనలు, 2017 ప్రకారం చట్టబద్ధంగా గుర్తింపు కలిగిన రెండు రకాలు ఉన్నాయి.. దేశ విదేశాల్లో తమ ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మాలనుకునే రైతుల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) మొదటిది. దీన్ని ‘థర్డ్ పార్టీ సర్టిఫికేషన్’ అని కూడా అంటారు. ఇది అధిక ఖర్చుతో కూడి ఉంటుంది. రెండోది: తక్కువ ఖర్చుతో ధ్రువీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2011లో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్)–ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటైంది. కొత్తది మూడోది: ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(ఎన్ఎఫ్సీఎస్) పేరిట కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇది దేశీ మార్కెట్లలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల అమ్మకానికి రైతులకు ఉపయోగపడుతుంది. గత కొన్ని నెలలుగా సంబంధిత వర్గాల వారిని సంప్రదించి, సలహాలు సూచనలు తీసుకొని మార్గదర్శకాలను రూపొందించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారే పరివర్తన కాలం కేవలం 6 నెలలే కావటం విశేషం. ‘నేచురల్’ «ధ్రువీకరణలో ముఖ్యాంశాలు:1. ‘నేచురల్ ఫార్మింగ్’ ధ్రువీకరణ పొందాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఈ పద్ధతుల్లో పంటలు పండించటం.. వ్యవసాయోత్పత్తులను పొలంలో గాని లేదా మరోచోటకు తీసుకెళ్లి గాని వ్యక్తిగత రైతులు/ రైతుల బృందాలు ప్రాథమిక స్థాయిలో శుద్ధి చేయటం.. విలువను జోడించటం.. ఈ మూడింటికీ ‘నేచురల్’ ధ్రువీకరణ ఇస్తారు. 2. నేచురల్ ఉత్పత్తులను ప్యాకెట్లలో నింపి, సీల్ చేసి.. ట్రేసబిలిటీ వివరాలతో కూడిన సమాచారాన్ని, లోగోను కవర్‌పై ముద్రించి అమ్మాలి. దీని లోగో పీజీఎస్ ఇండియా లోగోకు దగ్గరిగానే ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ అని ఉంటుంది. తాజా పాలు, పెరుగు, మజ్జిగ వంటివి లూజుగా కూడా అమ్ముకోవచ్చు. 3. ప్రకృతి వ్యవసాయం పశువులతో (ప్రధానంగా స్థానిక పశుజాతులతో) అనుసంధానమై ఉంటుంది. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం లేదా ఏదైనా ఇతర సాంప్రదాయ లేదా వినూత్న రసాయన రహిత ఉత్పాదకాలను మాత్రమే ఉపయోగించాలి. 4. ఒకటి కన్నా ఎక్కువ పంటలు కలిపి పండించటం, వర్షాకాలం ముందే పొడి మట్టిలోనే మట్టి పొరతో లేపనం చేసిన విత్తనాలను విత్తటం, పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన, సాంప్రదాయ రకాల విత్తనాలు (జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతి లేదు) వాడటం, పక్క పొలానికి ప్రకృతి సేద్య పొలానికి మధ్య కొన్ని ఎత్తయిన చెట్లను పెంచటం ద్వారా రసాయన పురుగుమందుల తుంపర్లు ఈ పొలంలోని పంటలపై పడకుండా అడ్డుకోవటానికి బఫర్ జోన్లలో చెట్లు పెంచటం.. మొదలైనవి.5. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేల నిర్మాణాన్ని, పోషకాల స్థాయిని మెరుగుపరుస్తాయి. మట్టిలో సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరుస్తాయి. తేమ నిలుపుదల, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తాయి. స్థానిక రైతుల విజ్ఞానానికి, స్థానికంగా అమల్లో ఉన్న నిర్దిష్ట సాంకేతికతల్లోని స్థానిక వ్యవసాయ–పర్యావరణ సూత్రాలను ప్రకృతి వ్యవసాయం తనలో ఇముడ్చుకుంది. 6. ఖరీఫ్, రబీ పంటల మధ్య విరామ కాలంలో కూడా పొలాన్ని ఖాళీగా ఉంచకూడదు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో 12–25 రకాల స్థానిక విత్తనాలతో నవధాన్య పంటలు సాగు చెయ్యటం ముఖ్య విషయం. 7. పొలంలో పంటలకు ముందు పలు జాతుల పచ్చి ఎరువు పంటలను పెంచటం, సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకున్న ఎరువులు వాడటం ముఖ్యం. 8. ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ వ్యవస్థను ఎన్ఎఫ్సిఎస్ సర్టిఫికేషన్ కమ్ ట్రేసబిలిటీ పోర్టల్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) నిర్వహిస్తుంది. ఎన్సీఓఎన్ఎఫ్ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్‌లో ఉండగా, ప్రాంతీయ కార్యాలయం నాగపూర్‌లో ఉంది. దీని పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 9. ‘నేచురల్’ ధ్రువీకరణ ఇచ్చే క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రమాణాల అమలు, పారదర్శకత, ఏ ఉత్పత్తిని ఏ రైతు పండించారు? ఎవరు శుద్ధి చేసి ప్యాకెట్లు తయారు చేశారు? అనే విషయాలను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఎన్సీఓఎన్ఎఫ్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ధ్రువీకరణ సేవల కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్ తనిఖీలను రీజినల్ కౌన్సెళ్ల (ఆర్సీల) ద్వారా నిర్వహిస్తుంది. 11. పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 76 రీజినల్ కౌన్సెల్స్ (ఆర్సీలు) పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక బృందాలు, కేవీకేలు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయ సంస్థలు ఆర్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ద్వారానే నేచురల్ సర్టిఫికేషన్ సంబంధిత పోర్టల్, యాప్‌లు రైతులు, బృందాలకు అందుబాటులోకి వస్తాయి. డాక్యుమెంటేషన్, ఆన్లైన్, ఆఫ్‌లైన్ తనిఖీలు కూడా వీటి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 12. నేచురల్ సర్టిఫికేషన్ క్షేత్ర స్థాయిలో తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీ/ గ్రామస్థాయిలో కనీసం 5గురితో ‘లోకల్ గ్రూప్’లను ఏర్పాటు చెయ్యాలి. వారిలో ఒకర్ని నాయకుడిగా నియమించాలి. 13, వ్యవసాయం చేస్తున్న పొలం మొత్తంలో కొంత భాగంలో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే.. ఉత్పాదకాలు, పంట దిగుబడులు కలసిపోకుండా గోదాములను రసాయనిక వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర పరికరాలను శుభ్రం చేసి వాడాలి. 14. నేచురల్ సర్టిఫికేషన్ కోసం పోర్టల్/మొబైల్ ద్వారా తమ పేరు నమోదు చేసుకునేటప్పుడు రైతు స్వీయధ్రువీకరణ సమర్పించాలి. రసాయనాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వాడబోనని ప్రమాణం చెయ్యాలి. పశువులు వున్నాయా? అవి స్థానిక జాతులవా కాదా? జీవామృతం వంటి తానే పొలంలో తయారు చేసుకుంటున్నారా లేదా? దేశీ విత్తనాలే వాడుతున్నారా? ఎంతకాలం నుంచి అనుసరిస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారు? వంటి విషయాలు పేర్కొనాలి. ద్రావణాలు, కషాయాలు 90% సొంతంగా తయారు చేసుకునే రైతుకు వెరీ గుడ్ రేటింగ్ ఇస్తారు. కౌలు రైతులు కౌలు ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.సేంద్రియ vs ప్రకృతి సేద్యంసేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రెండూ రసాయనేతర వ్యవసాయ పద్ధతులే. ఈ రెండిటి మధ్య సారూప్యాలు ఉన్నప్పటికీ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.సారూప్యాలు: ఎక్కువ రకాల పంటలు సాగు చేయటం, పొలంలో పంట వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపే పనులు చెయ్యటం, ప్రకృతి సహజమైన పోషక చక్రాన్ని పునరుజ్జీవింపజేయటం, పంటల మార్పిడి, బహుళ పంటల సాగు, సమర్థవంతంగా వనరుల పునర్వినియోగం.వ్యత్యాసాలు: సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బయటి వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సేంద్రియ, జీవసంబంధమైన ఎరువులు, ద్రావణాలు, ఖనిజాలు ఉత్పాదకాలను వాడతారు. వర్మీకంపోస్టు, దిబ్బ ఎరువు, జీవన ఎరువులు, పురుగుమందులు వంటివి వాడతారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు స్థానిక జాతుల పశువుల (ముఖ్యంగా దేశీ ఆవుల) పేడ, మూత్రంతో స్వయంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు, ద్రావణాలు వాడతారు. మరీ అవసరమైతే గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్(బీఆర్సీ) నుంచి వీటిని కొనుగోలు చేస్తారు. ఏడాది పొడవునా భూమిని వత్తుగా విత్తిన పంటలతో లేదా పంట వ్యర్థాల ఆచ్ఛాదనతో కప్పి ఉంచుతారు. ఖరీఫ్, రబీ, వేసవి పంటలు పూర్తయ్యాక కూడా భూమిని ఎండబెట్టకుండా నవధాన్య పంటలు విధిగా సాగు చేస్తూ నేలకు నిరంతరం సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్) కల్పిస్తారు. తద్వారా భూమిలోని పోషక చక్రాన్ని పునరుద్ధరిస్తారు. ‘నేచురల్’ యాప్, పోర్టల్‌లు ఖరీఫ్ ఆఖరి నాటికి సిద్ధం– ‘సాక్షి సాగుబడి’తో ఎన్సీఓఎన్ఎఫ్ డైరెక్టర్ డా. గగనేశ్ శర్మప్రకృతి వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ధ్రువీకరణ కోసం ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సీఓఎన్ఎఫ్) డైరెక్టర్ డా. గగనేశ్ శర్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయదారులు పేర్లు నమోదు చేసుకున్న 6 నెలల్లో సర్టిఫికేషన్ ఇస్తామని, సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణ ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం చివరి నాటికి ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. డా. గగనేశ్ శర్మ ‘సాక్షి సాగుబడి’తో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ కేంద్రంగా ఎన్సీఓఎన్ఎఫ్ దేశంలోని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాలు దీని నాగపూర్ ప్రాంతీయ కేంద్రం పరిధిలోకి వస్తాయి. సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణడా. గగనేశ్ శర్మ ఇంకా ఏమన్నారంటే: ‘వినియోగదారులకు సౌలభ్యకరంగా ఉండేవిధంగా నేచురల్ ఫార్మింగ్ పోర్టల్, మొబైల్ యాప్‌లను రూపొందిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట కాలం ముగిసే నాటికి ఇవి అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయదారులు సులువుగా నేరుగా ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయమని రాష్ట్రప్రభుత్వాలను ఇప్పటికే కోరాం. ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లో రైతుల పేర్ల నమోదు జరుగుతోంది. ఇప్పటికి 1,15,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ ‘పీజీఎస్ ఇండియా’కు ఉన్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. అయితే, దీని ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఒక ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తమ పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 6 నెలల్లో నేచురల్ ధ్రువీకరణ ఇస్తాం. అయితే, 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ 6 నెలల పరిమితిని సడలిస్తాం. వారు ఎన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు? పశువులు ఏమి ఉన్నాయి? ఎరువులు కషాయాలు వారే తయారు చేసుకుంటున్నారా? పంటల జీవవైవిధ్యాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారు? వంటి విషయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వారికి గ్రేడింగ్ ఇస్తాం. అన్నీ సంతృప్తికరంగా ఉంటే వెంటనే ధ్రువీకరణ ఇస్తాం..’ నేచురల్ ఉత్పత్తులను ఎన్‌సీఓఎల్ కొంటుంది‘దేశంలో 80% మంది రైతులు చిన్న కమతాలలో ప్రకృతి వ్యవసాయం చేసే వారే. వీరు పండించే పంటలో వారే చాలా వరకు వారి కుటుంబమే తింటారు. 20–30% పంటను అమ్ముతారు. ఈ మిగులు ఉత్పత్తులను కేంద్ర సహకార శాఖ ఏర్పాటు చేసిన జాతీయ సహకార సేంద్రియ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్) కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, దేశ ప్రజలకు విక్రయిస్తుంది. అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించిన పద్ధతిలో ఇది జరుగుతుంది. మేం ఇచ్చే పీజీఎస్ నేచురల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ సర్టిఫికేషన్ మాత్రమే. ప్రకృతి రైతుల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యాచ్‌ల వారీగా ఎన్‌సీఓఎల్ పరీక్షలు చేస్తుంది’ అని వివరించారు డా. గగనేశ్ శర్మ. -
వాతావరణ మార్పులతో.. దిగుబడులుఆవరి
దేశంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడులపై పడుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అధ్యయనంలో తేలింది. నేల క్షీణత, వర్షపాతం, పంట దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం అంచనా కోసం అధ్యయనాలు నిర్వహించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖరీఫ్ వర్షపాతం 2050 నాటికి 4.9 శాతం నుంచి 10.1 శాతం వరకు పెరుగుతుందని.. అలాగే, 2080 నాటికి 5.5 శాతం నుంచి 18.9 శాతం పెరుగుతుందని పేర్కొంది. రబీలో కూడా 2050 నాటికి వర్షపాతం 12 నుంచి 17 శాతానికి.. 2080 నాటికి 13 నుంచి 26 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపింది. ఇలా వాతావరణ మార్పుల దృష్ట్యా లవణీయత ప్రభావిత ప్రాంతం 2030 నాటికి 6.7 మిలియన్ హెక్టార్ల నుండి 11 మిలియన్ హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేసినట్లు ఆ అధ్యయనం పేర్కొంది. – సాక్షి, అమరావతిసమగ్ర పోషక నిర్వహణకు సాయం..రాష్ట్రాలు నేల ఆరోగ్యం, దాని ఉత్పాదకతను మెరుగుపరచడానికి సూక్ష్మపోషకాలతో సహా రసాయన ఎరువులను, జీవ ఎరువులను అవసరమైన మేరకే ఉపయోగించడం ద్వారా సమగ్ర పోషక నిర్వహణను ప్రోత్సహించడంలో సహాయపడుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్ ప్రకారం.. వ్యవసాయంలో ప్రభావం, అత్యంత ప్రభావం పడే జిల్లాలను ఐసీఏఆర్ అంచనా వేసినట్లు తెలిపింది. 109 జిల్లాలను చాలా ఎక్కువ ప్రభావంగాను, 201 జిల్లాలను అత్యంత ప్రభావంగాను వర్గీకరించినట్లు తెలిపింది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా 151 జిల్లాల్లో అనుకూల ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసాధారణ వాతావరణ పరిస్థితిని పరిష్కరించడానికి 651 జిల్లాలకు జిల్లా వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.దిగుబడులపై ప్రభావం..ఇక వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోకపోతే వర్షాధార వరి దిగుబడి 2050లో 20 శాతం.. 2080లో 10 శాతం నుంచి 47 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. నీటిపారుదల వరి దిగుబడి 2050లో 3.5 శాతం, 2080లో ఐదు శాతం మేర తగ్గుతుందని కూడా వివరించింది. అలాగే.. » గోధుమ దిగుబడి కూడా 2050లో 19.3 శాతం, 2080లో ఏకంగా 40 శాతం మేర తగ్గుతుంది. » ఖరీఫ్‌లో మొక్కజొన్న దిగుబడి 2050లో 10 శాతం నుంచి 19 శాతం వరకు.. 2080లో 20 శాతం వరకు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్ర వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ వాతావరణ స్థితి స్థాపక వ్యవసాయ సాంకేతికతలను ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. వాతావరణ స్థితిస్థాపక రకాలను ప్రోత్సహించడం, పంట వైవిద్యీకరణను అమలుచేయనున్నట్లు తెలిపింది. దేశంలోని పర్యావరణ వ్యవస్థలలో వాతావరణ మార్పు ప్రభావానికి అనుగుణంగా 76 ప్రోటోటైప్ ఇంటిగ్రేటెడ్ ఫారి్మంగ్ సిస్టమ్ నమూనాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మారుతున్న వాతావరణానికి వ్యవసాయాన్ని మరింత స్థితిస్థాపకంగా మార్చడానికి వ్యూహాలను అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు.. అలాగే, వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఉత్పాదకతను పెంచడానికి వాతావరణ వైవిధ్యంతో సంబంధమున్న నష్టాలను తగ్గించడానికి సమగ్ర వ్యవసాయ వ్యవస్థపై దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. -
రైతులకు తనఖా లేకుండా రూ.2 లక్షల రుణం
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
సాగుకు రూ.1.27లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–2024)తో పోల్చుకుంటే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. రూ.1,27,469.88 కోట్లలో వ్యవసాయ విభాగానికి రూ.1,17,528 కోట్లు కేటాయించగా, వ్యవసాయ పరిశోధన, విద్య (డేర్) విభాగానికి రూ.9,941 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాల ప్రకారం.. వ్యవసాయ విభాగానికి రూ.1,16,788.96 కోట్లు, డేర్‌కు రూ.9,876.60 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ పథకానికివ్యవసాయ విభాగం పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.60 వేల కోట్లే కేటాయించారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు మూడు వాయిదాలుగా సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున అందజేస్తోంది. ప్రజా పంపిణీకి రూ.8 వేల కోట్ల తగ్గింపు.. వినియోగదారుల వ్యవహారాలు,ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేటాయింపులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ శాఖకు రూ.2.13 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇందులో వినియోగదారుల వ్యవహారా లకు 302.62 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్ రూ.309.26 కోట్లు కావడం గమనార్హం. ఇక ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,924.64 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కొంత కోత విధించి రూ.2,13,019 కోట్ల బడ్జెట్ మాత్రమే కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఈ విభాగం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది. రసాయనాలు ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రసాయనాలు, ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ఎరువుల విభాగానికి కేటాయింపులు రూ.1,88,947.29 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించారు. ఇక రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.572.63 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి కేవలం రూ.139.05 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఫార్మాస్యూటికల్స్ విభాగానికి మాత్రం కేటాయింపులు పెరగడం గమనార్హం. దీనికి కేటాయింపులు రూ.2,697.95 కోట్ల నుంచి రూ.4,089.95 కోట్లకు పెరిగాయి. అలాగే హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని సహకార శాఖకు కూడా రూ.747.84 కోట్ల నుంచి రూ.1,183.39 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. నీళ్లకు నిధులు పెరిగాయ్ ♦ జలశక్తి శాఖకు రూ. 98,418 కోట్లు కేటాయింపు ♦ గతేడాదికన్నా రూ. 2 వేల కోట్లు అధికం ♦ పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుకు రూ. 11,391 కోట్లు ♦ గతంకన్నా రూ. 3 వేల కోట్లు పెరుగుదల సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్ర జలశక్తి శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది జలశక్తి శాఖకు మొత్తంగా కేటాయించిన నిధుల కంటే దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులను పెంచింది. గతేడాది జలశక్తి శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ. 98,418 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద నిధుల మొత్తాన్ని రూ. 8,781 కోట్ల నుంచి రూ. 11,391 కోట్లకు పెంచింది. దీనికిందే ఉన్న సమగ్ర సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకానికి గతేడాదికి సమానంగా రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఏఐబీపీ పథకంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు ఈ నిధులు కేటాయించే అవకా శం ఉంది. దీంతోపాటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరగా పీఎంకేఎస్‌వై పథకం కింద ప్రాజె క్టుకు ఆర్థిక సాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఈ నిధు ల్లోనే ఆ మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఆయకట్టు అభివృధ్ధి పథకం (కాడా) కింద రూ. 1,400 కోట్లు కేటాయించగా దీని కింద సైతం తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులున్నాయి. నదుల అనుసంధానానికి పెరిగిన కేటాయింపులు... నదుల అనుసంధాన కార్యక్రమానికి కేంద్రం నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ. 1,500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ. 4 వేల కోట్లకు పెంచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వడం, నాలుగు రోజుల కిందటే మధ్యప్రదేశ్, రాజస్తాన్ మధ్య పర్బతి–కాలిసింద్–చంబల్ నదులను తూర్పు రాజస్తాన్ కాలువతో కలిపే అనుసంధాన ప్రక్రియపై ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. అయితే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది తుంగభద్ర జలాలపై ఆధారపడి కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర సాయం కింద రూ. 5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ ఏడాది దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఏపీలోని పోలవరం ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంశాల ప్రస్తావన లేదు. ‘లఖ్పతి దీదీ’ కిందకు 3 కోట్ల మంది మహిళలు న్యూఢిల్లీ: స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం తీసుకుని పొదుపు బాటలో పయనిస్తూ తమ దక్షతతో వ్యాపారం చేస్తూ లఖ్పతి దీదీ (లక్షాధి కారి)లుగా అవతరిస్తున్న మహిళల సంఖ్యను మరింత పెంచడంపై దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ 83 లక్షల స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ)ల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధి సాధిస్తూ, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కష్టించి వ్యాపారాన్ని నిలబెట్టుకుని తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలు ఏటా కనీసం రూ. 1 లక్ష ఆర్జిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఇలా పొదుపు సంఘాల మహిళలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తూ సాధికారత, స్వావలంభన సాధిస్తూ అందరికీ స్ఫూర్తిప్రదాతలయ్యారు. ఇలాంటి లక్షాధికారి(లఖ్పతి దీదీ)ల సంఖ్యను రెండు నుంచి మూడు కోట్లకు పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని నిర్మల లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ఆశ, అంగన్వాడీలకు ‘ఆయుష్మాన్ భారత్’ న్యూఢిల్లీ: ఆశా, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు హెల్త్‌కేర్ కవరేజీని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. వారిని ఆయుష్మాన్ భారత్ బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తు న్నట్లు 2024–25 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కింద అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా న్యూట్రిషన్ డెలివరీ వేగవంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఆస్పత్రుల మౌలిక వసతు లను వినియోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనిని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామ న్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కేటాయింపులను రూ. 6,800 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామన్నా రు. సమగ్ర ఆచరణ కోసం వివిధ మాతా శిశు హెల్త్‌కేర్ స్కీంలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. మిషన్ ఇంద్రధనుష్ మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా కొత్తగా రూపొందించిన యు–విన్ పోర్టల్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నామని తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబ్‌లు యథాతథం.. సాక్షి,అమరావతి: మధ్యతరగతి, వేతనజీవుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు కుమ్మరించారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో కాసింత ఉపశమన మాటలు వస్తాయనుకున్న వారికి గతంలో చేసిన గొప్పలను ఏకరువు పెట్టి సరిపెట్టారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రత్యక్ష పన్ను ల వసూళ్లూ 3 రెట్లకుపైగా పెరగ్గా పన్ను రిట ర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2013– 14 ఆర్థిక సంవత్సరానికి దేశంలో పన్ను చెల్లించాల్సినవసరం లేని ఆదాయ పరిమితి రూ.2.2 లక్షలు ఉంటే ఇప్పుడు 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఒక్క రూపాయి పన్ను చెల్లించా ల్సిన పని లేదన్నారు. కొత్త పన్నుల విధానం ఎన్నుకున్న వారికే ఇది వర్తింపు 7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదన్న ఆర్థిక మంత్రి మాటలపై మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, పాత పన్ను ల విధానంలో ఉన్న వారికి ఈ రిబేటు పరిమితి రూ.5 లక్షలే ఉందన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. నాలుగేళ్ల కిందట కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారు. పాత విధానంతో పోలి స్తే తక్కువ పన్ను రేట్లతో అన్ని వయసుల వారికి ఒకే విధమైన శ్లాబ్ రేట్ల ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఎంచుకుంటే సెక్షన్ 80సీ, గృహ రుణాలు, స్టాండర్డ్ డిడక్షన్, ఆరోగ్య బీమా వంటి పలు సెక్షన్ల కింద లభించే ప్రయోజనాలను పొందడానికి వీలుండదు. మొత్తం ఆదాయం మీద పన్ను చెల్లించా ల్సి వస్తుంది. కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించన వరం లేకుండా సెక్షన్ 87ఏ కింద రిబేటు ప్రకటించింది. దీనికింద రూ.25,000 ప్రయో జనం లభిస్తుంది. అదే పాత పన్నుల విధానం ఎంచుకుంటే సెక్షణ్ 87ఏ రిబేటు పరిమితిని రూ.5 లక్షల ఆదాయం వరకు పరిమితం చేశారు. పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి కేవలం రూ.12,500 మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మార్చాలన్న ఉద్దే శ్యంతో నిర్మాల ఈ నిర్ణయం తీసుకున్నారు. రిటైల్ వ్యాపారుల ఊహాజనిత ఆదాయం పరిమి తిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, వృత్తినిపుణుల ఊహాజనిత ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పన్ను రిట ర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 2013– 14లో 93 రోజులుగా ఉన్న రిఫండు సమయాన్ని ఇప్పుడు పదిరోజులకు తగ్గించినట్లుగా తెలిపారు. గ్రామీణాభివృద్ధికి..రూ.1.77 లక్షల కోట్లు 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.77 లక్షల కోట్లు ప్రకటించారు. గతేడాది రూ.1.57 లక్షల కోట్ల కంటే 12 శాతం ఎక్కువగా కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్లో చేసిన రూ.60,000 కోట్ల కంటే ఇది 43 శాతం ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– గ్రామీణ్ పథకానికి రూ.54,500 కోట్లు కేటాయించారు. ‘లఖ్ పతి దీదీ’ల లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి 3 కోట్లకు పెంచినట్లు సీతారామన్ ప్రకటించారు. జాతీయ జీవనోపాధి మిషన్–అజీవికకు రూ.15,047 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,129.17 కోట్ల కంటే ఇదిదాదాపు 6% ఎక్కువ. కాగా, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించారు. పర్యావరణ శాఖకు..రూ.3,265 కోట్లు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్లో పర్యావ రణ శాఖకు రూ.3,265 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ మొత్తం రూ.3,231 కోట్లు ఉండగా, ఈ సారి కొద్దిగా పెరి గింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర జూ అథారిటీ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ,ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సంస్థలకు గతేడాది బడ్జెట్లో 158.60 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.192 కోట్లు కేటాయించారు. కాగా, స్వయంప్రతిపత్తి సంస్థలైన జీబీ పంత్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వి రాన్మెంట్, భారత అటవీ పరిశోధన, అభి వృద్ధి మండలి, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం గతేడాది బడ్జెట్లో రూ.573.73 కోట్లు కేటాయించగా, తాజా మధ్యంతర బడ్జె ట్లో రూ.391 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అడ వుల్లో జంతు ఆవాసాల సమీకృత అభివృద్ధికి రూ.450 కోట్లను కేటాయించింది. అలాగే అడవుల పరిరక్షణ, పచ్చ దనం పెంపునకు సంబంధించి జాతీయ గ్రీన్ ఇండియా మిషన్‌కు గత బడ్జెట్లో రూ.160 కోట్లు ఉన్న కేటాయింపులను ఈ సారి రూ.220 కోట్లకు పెంచింది. సామాజిక న్యాయం, సాధికారతకు..రూ.14,225 కోట్లు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 మధ్యంతర బడ్జె ట్లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ.14,225.47 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,000 కోట్లు కేటాయించగా.. వికలాంగుల సాధికారత శాఖకు రూ.1,225.27 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ.11,078.33 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 28.4% పెరిగింది. వికలాంగుల సాధికారత విభా గం కింద జాతీయ వికలాంగుల సంక్షేమానికి రూ.615 కోట్లు కేటా యించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ కింద షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకానికి రూ.9,559.98 కోట్లు కేటాయించగా, బలహీ న వర్గాల అభివృద్ధి కార్యక్రమానికి రూ.2,150 కోట్లు కేటా యించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, వెనుక బడి న తరగతుల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారుల జాతీ య కమిషన్‌కు మొత్తం రూ.7,175 కోట్లు కేటాయించారు. గిరిజన మంత్రిత్వ శాఖకు..రూ.13వేల కోట్లు 2024–25 మధ్యంతర బడ్జెట్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఇది గత కేటాయింపుల కంటే భారీ అనగా 70 శాతం ఎక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖకు రూ.7,605 కోట్లు కేటాయించారు. 2024– 25లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎమ్ ఆర్ఎస్) నిర్మాణానికి కేంద్రం రూ.6,399 కోట్లు కేటాయించింది. ఇది 2023–24లో కేటాయించిన రూ.2,471.81 కోట్ల కంటే 150 శాతం ఎక్కువ. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకు కేటాయింపులు రూ.300 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి–ఆదాయ కల్పన వంటి రంగాల్లోని అంతరాలను తగ్గించడానికి గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులను అందిస్తారు. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని రూ.50 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెంచారు. కాగా, జాతీయ ఫెలోషిప్, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య, స్కాలర్షిప్ కోసం బడ్జెట్ కేటాయింపులు 2023–24లో రూ.230 కోట్ల నుంచి 2024–25లో రూ.165 కోట్లకు తగ్గించారు. రాష్ట్రాలకు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా సంస్కరణల బాటపట్టే రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని కేంద్రం తెలిపింది. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యసాధన కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు ఎన్నో అభివృద్ధి ఆధారిత సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా మోదీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. అంతరిక్షానికి అదనంగారూ. 2,000 కోట్లు అంతరిక్షంలో భారత కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా కలిగిన అంతరిక్ష విభాగానికి కేంద్ర బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విభాగానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,042.75 కోట్లు కేటాయించారు. 2023–24 సవరించిన అంచనాల ప్రకారం ఈ విభాగానికి రూ.11,070.07 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2035 కల్లా భారత్ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, 2040 కల్లా భారతీయ వోమగామి చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా స్పేస్ టెక్నాలజీకి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ.8,180 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,087 కోట్లుగా ప్రతిపాదించారు. మహిళా శిశు అభివృద్ధికి రూ.26 వేల కోట్లు మధ్యంతర బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.26 వేల కోట్ల కేటాయింపులు దక్కాయి. 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 2.52 శాతం అధికం. అత్యధికంగా సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0లకు రూ.21,200 కోట్లు కేటాయించారు. మిషన్ శక్తికి రూ.3,145.97 కోట్లు ప్రతిపాదించారు. మహిళలకు భద్రత, రక్షణ అలాగే వారు తమ హక్కులు పొందడం, పలు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం లక్ష్యంగా మిషన్ శక్తి (సంబల్)కి కేంద్రం శ్రీకారం చుట్టింది. కాగా మిషన్ వాత్సల్య (బాలల రక్షణ సేవలు, బాలల సంక్షేమ సేవలు)కు రూ.1,472 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం..2023–24లో మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.25,448.68 కోట్లు కేటాయించారు. అటానమస్ సంస్థలకు రూ.168 కోట్ల నుంచి రూ.153 కోట్లకు బడ్జెట్ తగ్గింది. ఈ సంస్థల్లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. ఇది కార్పొరేట్ల బడ్జెట్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కార్పొరే ట్లకు లాభాలు కట్టబెట్టే, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ బడ్జెట్ దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించేది కాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపు రాయితీలకు కోత పెడుతోందన్నారు. -
రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం
సాక్షి, అమరావతి: దేశ ంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం కొనసాగుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో పీకేవీవై కింద అత్యధికంగా 2.06 లక్షల హెక్టార్లలో 2.65 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని తాజాగా వెల్లడించింది. పీకేవీవై కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.317.21 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత పీకేవీవై కింద అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతు.. ఈ పథకం కింద రైతులకు ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతును అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ విధానం ద్వారా మార్కెటింగ్ కోసం అవసరమైన శిక్షణ ఇచ్చి రైతుల్లో సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రాసెసింగ్‌తో పాటు పంట కోత అనంతరం ఉత్పత్తుల నిర్వహణ, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వివరించింది. క్లస్టర్ విధానంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. పీకేవీవై కింద సేంద్రీయ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.50 వేలు అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో ఆర్గానిక్ ఇన్‌ఫుట్‌ల కోసం రూ.31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వివరించింది. అలాగే మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువ జోడింపునకు రూ.8,800, సర్టిఫికేషన్‌కు రూ.2,700, అవసరమైన శిక్షణ, సామర్థ్యం పెంచేందుకు రూ.7,500 సాయం అందించనున్నట్లు తెలిపింది. సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి పలు చర్యలను చేపట్టామని పేర్కొంది. యూరియా అధిక వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
ఆర్కేవీవై కింద రాష్ట్రానికి అదనంగా రూ.223 కోట్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద తాజాగా రూ.223 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆర్కేవీవై కింద ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు ఇవి అదనం. రైతుల ఆదాయం పెంచేందుకు అవసరమైన సాగు ఉత్పాదకతలను పెంపొందించే లక్ష్యంతో 60:40 నిష్పత్తిలో కేంద్రం ఆర్కేవీఐ కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద 2020–2021 ఆర్థిక సంవత్సరానికి రూ.298 కోట్లను మంజూరు చేసింది. అందులో తన వాటా కింద కేంద్రం రూ.164 కోట్లు విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జతచేసి ఆర్బీకేల్లో అదనపు సౌకర్యాలకోసం ఖర్చుచేసింది. ఈ నేపథ్యంలో రైతులకోసం ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు తీసుకొస్తున్నామని, కస్టమ్ హైరింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం ఆర్కేవీవై కింద అదనంగా మరో రూ.242 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రూ.223 కోట్లు అదనంగా ఖర్చు చేసేందుకు ఆదేశాలిచ్చింది. అందులో తన వాటాగా రూ.134 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ల్లో పరికరాలు కొనుగోలు చేయనున్నారు. -
‘పీఎం కిసాన్’కు ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులకు తోడ్పాటు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి నెలలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఐచ్ఛికమేనని (ఆప్షనల్) పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది. పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్ యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. -
లఘు చిత్రాలతో రైతుల్లో చైతన్యం
రాంబిల్లి: సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ లఘు చిత్రాలను చిత్రీకరిస్తోంది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా సాగుపై రైతులు దృష్టిని కేంద్రీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మ విభాగానికి చెందిన బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ పర్యవేక్షణలో అయిదుగురు వీఆర్పీ(వీడియో రీసోర్స్ పర్సన్)లతో బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ బృందాలకు హరిపురంలోని కేవీకేలో 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మూడో రోజు గురువారం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. డిజిటల్ గ్రీన్ అనే సంస్థ ఈ శిక్షణ ఇస్తోంది. లఘు చిత్రాల చిత్రీకరణ, సుస్థిర, సేంద్రియ వ్యవసాయం చేస్తూ విజయాలు సాధించిన రైతుల గాథలను ఈ చిత్రాల్లో పొందుపరుస్తారు. ఆయా రైతుల అభిప్రాయాలను చిత్రీకరిస్తారు. 5 మంది వీఆర్పీలు ఈ లఘు చిత్రాల్లో నటిస్తున్నారు. రైతుల యాసలో మాట్లాడుతూ, రైతులకు ఆసక్తిని క లిగించేలా ఈ లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటే వాటికి హాజరయ్యే రైతులు తక్కువగా ఉంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఇటువంటి శిక్షణలకు రైతులు హాజయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ తరహా ప్రయోగం మేలని భావించిందని శ్రీకాకుళం జిల్లా బీటీఎం అరుణమణి తెలిపారు. ఈ లఘు చిత్రాలను ప్రతి గ్రామంలో రైతులు పని ముగించుకొని తీరిగ్గా ఉన్నప్పుడు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ప్రదర్శించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. -
ఆదర్శానికి మంగళం
జిల్లాలో 1,911 మంది ఆదర్శ రైతులు తొలగింపు ఎంపీఈవోల నియూమకానికి నిర్ణయం తొలగించినవారికే ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ పోరుకు సిద్ధమవుతున్న బాధితులు ఆదర్శరైతుల వ్యవస్థ అనవసరమైందని, దాన్ని తొలగిస్తామని తొలి కేబినెట్ భేటీలో ప్రకటించిన చంద్రబాబు... తాను అన్నట్లుగానే ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేటా జీవో ఎంఎస్ 43 జారీ చేశారు. ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 1,911 మంది ఆదర్శ రైతులు గౌరవం కోల్పోనున్నారు. సాక్షి, చిత్తూరు :వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శరైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2007, 2008లో రెండు విడతలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50వేల మందిని నియమించారు. ఇందులో నవ్యాంధ్రకు సంబంధించి 29,439మంది ఉన్నారు. రాయలసీమలో 7,120 మంది ఆదర్శ రైతులను నియమించారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియమితులైన వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయం మరింత బలోపేతమయింది. గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఏ తెగులుకు ఏ మందు వాడితే బాగుం టుంది ? తదితర సూచలను ఆదర్శరైతులు చేసేవారు. అయితే ఆదర్శరైతుల వ్యవస్థ కాలక్రమేణా గాడితప్పింది. కొందరు వ్యవసాయరంగంలో రైతులకు సూచనలు ఇవ్వడం కంటే రాజకీయనేతలుగా చెలామణి అయ్యారు. దీంతో వీరికి చెక్‌పెట్టేందుకు 2012 జూన్‌లో వ్యవసాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను గత ఏడాది ప్రకటిం చారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు సక్రమంగానే పనిచేస్తున్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉంది. అయితే ఆదర్శరైతులంతా కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలనే అపోహతో, టీడీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థనే రద్దు చేసింది. ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని, అందుకే తొలగించామని సెలవిచ్చింది. ఎంపీఈవో పేరుతో కొత్త వ్యవస్థ : ఆదర్శరైతుల వ్యవస్థ స్థానంలో ఎంపీఈవో(మల్టీ పర్పస్ ఎగ్జిక్యూటిక్ ఆఫీసర్) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలగించిన ఆదర్శ రైతులను కాకుండా, కొత్తవారిని ఎంపీఈవోలుగా నియమించనున్నారు. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారిని ఆ స్థానంలో తీసుకోనున్నారు. దీనిపై ఆదర్శరైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలని, పూర్తిగా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదని చెబుతున్నారు. ఆదర్శరైతుల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థ అయినా తొలి ప్రాధాన్యం ఉద్యోగాలు కోల్పోయినవారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు వెయ్యి రూపాయల జీతానికే ఇన్నేళ్లుగా పనిచేశాం. మమ్మల్ని నియమించింది రాజకీయపార్టీ కాదు...రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను ఇలా తొలగిస్తూ పోవడం సరైంది కాదు. టీడీపీ కార్యకర్తలను కొత్తగా నియమించుకోవడం కోసమే ఇలా చేశారు. కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థలోనైనా మొదటి ప్రాధాన్యం మాకే ఇవ్వాలి. దీనిపై సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరంతర ఆందోళన చేస్తాం. - నలగం శేఖర్, ఆదర్శరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.