
ఇప్పుడున్న ఎన్‌పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లకు అదనంగా.. దేశీ మార్కెట్ల కోసం ‘నేచురల్’ ధ్రువీకరణ వ్యవస్థ సిద్ధం
రిజిస్టర్ చేసుకున్న 6 నెలల్లోనే ప్రకృతి వ్యవసాయదారులకు సర్టిఫికేషన్ సదుపాయం
ప్రకృతి వ్యవసాయ ఆహారోత్పత్తులపై వినియోగదారులకు నమ్మకం కలిగించటం ద్వారా ఆ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’ (ఎన్‌ఎఫ్‌సీఎస్)ను ఏర్పాటు చేస్తోంది. ‘ఆర్గానిక్’ ధ్రువీకరణ కోసం ఇప్పుడున్న ‘ఎన్‌పీఓపీ’, ‘పీజీఎస్ ఇండియా’ సర్టిఫికేషన్ వ్యవస్థలకు అదనంగా.. దేశీ మార్కెట్ల కోసం ‘నేచురల్’ ధ్రువీకరణ వ్యవస్థ ప్రారంభమవుతోంది. సేంద్రియ ధ్రువీకరణ కోసం ఎన్‌పీఓపీ లేదా పీజీఎస్ సర్టిఫికేషన్ పొందడానికి అవసరమయ్యే పరివర్తన కాలం 3 ఏళ్లు. అయితే, ప్రకృతి వ్యవసాయదారులకు రిజిస్టర్ చేసుకున్న 6 నెలల్లోనే ‘నేచురల్’ సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. వెబ్‌పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒంటరి రైతు లేదా కనీసం ఐదుగురు రైతులు కలిసి బృందంగా నమోదు చేసుకోవచ్చు..
మన దేశంలో ‘సేంద్రియ ఆహారోత్పత్తుల’ ధ్రువీకరణకు ఇప్పటికే రెండు (ఎన్‌పీఓపీ, పీజీఎస్ ఇండియా) ధ్రువీకరణ వ్యవస్థలు పనిచేస్తుండగా.. ఈ పరిధిలోకి రాని ‘ప్రకృతి వ్యవసాయోత్పత్తుల’ ధ్రువీకరణ కోసం మూడో ధ్రువీకరణ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
ఆహార భద్రత మరియు ప్రమాణాలు (సేంద్రీయ ఆహారాలు) నిబంధనలు, 2017 ప్రకారం చట్టబద్ధంగా గుర్తింపు కలిగిన రెండు రకాలు ఉన్నాయి.. దేశ విదేశాల్లో తమ ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మాలనుకునే రైతుల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీఓపీ) మొదటిది. దీన్ని ‘థర్డ్ పార్టీ సర్టిఫికేషన్’ అని కూడా అంటారు. ఇది అధిక ఖర్చుతో కూడి ఉంటుంది.
రెండోది: తక్కువ ఖర్చుతో ధ్రువీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి 2011లో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్)–ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటైంది.
కొత్తది మూడోది: ‘నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(ఎన్‌ఎఫ్‌సీఎస్) పేరిట కేంద్ర వ్యవసాయ– రైతుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇది దేశీ మార్కెట్లలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల అమ్మకానికి రైతులకు ఉపయోగపడుతుంది. గత కొన్ని నెలలుగా సంబంధిత వర్గాల వారిని సంప్రదించి, సలహాలు సూచనలు తీసుకొని మార్గదర్శకాలను రూపొందించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారే పరివర్తన కాలం కేవలం 6 నెలలే కావటం విశేషం.
‘నేచురల్’ «ధ్రువీకరణలో ముఖ్యాంశాలు:
1. ‘నేచురల్ ఫార్మింగ్’ ధ్రువీకరణ పొందాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఈ పద్ధతుల్లో పంటలు పండించటం.. వ్యవసాయోత్పత్తులను పొలంలో గాని లేదా మరోచోటకు తీసుకెళ్లి గాని వ్యక్తిగత రైతులు/ రైతుల బృందాలు ప్రాథమిక స్థాయిలో శుద్ధి చేయటం.. విలువను జోడించటం.. ఈ మూడింటికీ ‘నేచురల్’ ధ్రువీకరణ ఇస్తారు.
2. నేచురల్ ఉత్పత్తులను ప్యాకెట్లలో నింపి, సీల్ చేసి.. ట్రేసబిలిటీ వివరాలతో కూడిన సమాచారాన్ని, లోగోను కవర్‌పై ముద్రించి అమ్మాలి. దీని లోగో పీజీఎస్ ఇండియా లోగోకు దగ్గరిగానే ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ అని ఉంటుంది. తాజా పాలు, పెరుగు, మజ్జిగ వంటివి లూజుగా కూడా అమ్ముకోవచ్చు.
3. ప్రకృతి వ్యవసాయం పశువులతో (ప్రధానంగా స్థానిక పశుజాతులతో) అనుసంధానమై ఉంటుంది. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం లేదా ఏదైనా ఇతర సాంప్రదాయ లేదా వినూత్న రసాయన రహిత ఉత్పాదకాలను మాత్రమే ఉపయోగించాలి.
4. ఒకటి కన్నా ఎక్కువ పంటలు కలిపి పండించటం, వర్షాకాలం ముందే పొడి మట్టిలోనే మట్టి పొరతో లేపనం చేసిన విత్తనాలను విత్తటం, పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన, సాంప్రదాయ రకాల విత్తనాలు (జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతి లేదు) వాడటం, పక్క పొలానికి ప్రకృతి సేద్య పొలానికి మధ్య కొన్ని ఎత్తయిన చెట్లను పెంచటం ద్వారా రసాయన పురుగుమందుల తుంపర్లు ఈ పొలంలోని పంటలపై పడకుండా అడ్డుకోవటానికి బఫర్ జోన్లలో చెట్లు పెంచటం.. మొదలైనవి.
5. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేల నిర్మాణాన్ని, పోషకాల స్థాయిని మెరుగుపరుస్తాయి. మట్టిలో సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరుస్తాయి. తేమ నిలుపుదల, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తాయి. స్థానిక రైతుల విజ్ఞానానికి, స్థానికంగా అమల్లో ఉన్న నిర్దిష్ట సాంకేతికతల్లోని స్థానిక వ్యవసాయ–పర్యావరణ సూత్రాలను ప్రకృతి వ్యవసాయం తనలో ఇముడ్చుకుంది.
6. ఖరీఫ్, రబీ పంటల మధ్య విరామ కాలంలో కూడా పొలాన్ని ఖాళీగా ఉంచకూడదు. ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో 12–25 రకాల స్థానిక విత్తనాలతో నవధాన్య పంటలు సాగు చెయ్యటం ముఖ్య విషయం.
7. పొలంలో పంటలకు ముందు పలు జాతుల పచ్చి ఎరువు పంటలను పెంచటం, సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకున్న ఎరువులు వాడటం ముఖ్యం.
8. ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ వ్యవస్థను ఎన్‌ఎఫ్‌సిఎస్ సర్టిఫికేషన్ కమ్ ట్రేసబిలిటీ పోర్టల్ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌సీఓఎన్‌ఎఫ్) నిర్వహిస్తుంది. ఎన్‌సీఓఎన్‌ఎఫ్ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్‌లో ఉండగా, ప్రాంతీయ కార్యాలయం నాగపూర్‌లో ఉంది. దీని పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
9. ‘నేచురల్’ ధ్రువీకరణ ఇచ్చే క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రమాణాల అమలు, పారదర్శకత, ఏ ఉత్పత్తిని ఏ రైతు పండించారు? ఎవరు శుద్ధి చేసి ప్యాకెట్లు తయారు చేశారు? అనే విషయాలను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఎన్‌సీఓఎన్‌ఎఫ్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ధ్రువీకరణ సేవల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తనిఖీలను రీజినల్ కౌన్సెళ్ల (ఆర్‌సీల) ద్వారా నిర్వహిస్తుంది.
11. పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 76 రీజినల్ కౌన్సెల్స్ (ఆర్‌సీలు) పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక బృందాలు, కేవీకేలు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయ సంస్థలు ఆర్‌సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ద్వారానే నేచురల్ సర్టిఫికేషన్ సంబంధిత పోర్టల్, యాప్‌లు రైతులు, బృందాలకు అందుబాటులోకి వస్తాయి. డాక్యుమెంటేషన్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తనిఖీలు కూడా వీటి ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
12. నేచురల్ సర్టిఫికేషన్ క్షేత్ర స్థాయిలో తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీ/ గ్రామస్థాయిలో కనీసం 5గురితో ‘లోకల్ గ్రూప్’లను ఏర్పాటు చెయ్యాలి. వారిలో ఒకర్ని నాయకుడిగా నియమించాలి.
13, వ్యవసాయం చేస్తున్న పొలం మొత్తంలో కొంత భాగంలో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే.. ఉత్పాదకాలు, పంట దిగుబడులు కలసిపోకుండా గోదాములను రసాయనిక వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. యంత్ర పరికరాలను శుభ్రం చేసి వాడాలి.
14. నేచురల్ సర్టిఫికేషన్ కోసం పోర్టల్/మొబైల్ ద్వారా తమ పేరు నమోదు చేసుకునేటప్పుడు రైతు స్వీయధ్రువీకరణ సమర్పించాలి. రసాయనాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వాడబోనని ప్రమాణం చెయ్యాలి. పశువులు వున్నాయా? అవి స్థానిక జాతులవా కాదా? జీవామృతం వంటి తానే పొలంలో తయారు చేసుకుంటున్నారా లేదా? దేశీ విత్తనాలే వాడుతున్నారా? ఎంతకాలం నుంచి అనుసరిస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారు? వంటి విషయాలు పేర్కొనాలి. ద్రావణాలు, కషాయాలు 90% సొంతంగా తయారు చేసుకునే రైతుకు వెరీ గుడ్ రేటింగ్ ఇస్తారు. కౌలు రైతులు కౌలు ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.
సేంద్రియ vs ప్రకృతి సేద్యం
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రెండూ రసాయనేతర వ్యవసాయ పద్ధతులే. ఈ రెండిటి మధ్య సారూప్యాలు ఉన్నప్పటికీ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.
సారూప్యాలు: ఎక్కువ రకాల పంటలు సాగు చేయటం, పొలంలో పంట వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపే పనులు చెయ్యటం, ప్రకృతి సహజమైన పోషక చక్రాన్ని పునరుజ్జీవింపజేయటం, పంటల మార్పిడి, బహుళ పంటల సాగు, సమర్థవంతంగా వనరుల పునర్వినియోగం.
వ్యత్యాసాలు: సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బయటి వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సేంద్రియ, జీవసంబంధమైన ఎరువులు, ద్రావణాలు, ఖనిజాలు ఉత్పాదకాలను వాడతారు. వర్మీకంపోస్టు, దిబ్బ ఎరువు, జీవన ఎరువులు, పురుగుమందులు వంటివి వాడతారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాధ్యమైనంత వరకు పొలంలోనే తయారు చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు స్థానిక జాతుల పశువుల (ముఖ్యంగా దేశీ ఆవుల) పేడ, మూత్రంతో స్వయంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు, ద్రావణాలు వాడతారు. మరీ అవసరమైతే గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్(బీఆర్సీ) నుంచి వీటిని కొనుగోలు చేస్తారు. ఏడాది పొడవునా భూమిని వత్తుగా విత్తిన పంటలతో లేదా పంట వ్యర్థాల ఆచ్ఛాదనతో కప్పి ఉంచుతారు. ఖరీఫ్, రబీ, వేసవి పంటలు పూర్తయ్యాక కూడా భూమిని ఎండబెట్టకుండా నవధాన్య పంటలు విధిగా సాగు చేస్తూ నేలకు నిరంతరం సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్) కల్పిస్తారు. తద్వారా భూమిలోని పోషక చక్రాన్ని పునరుద్ధరిస్తారు.
‘నేచురల్’ యాప్, పోర్టల్‌లు ఖరీఫ్ ఆఖరి నాటికి సిద్ధం
– ‘సాక్షి సాగుబడి’తో ఎన్‌సీఓఎన్‌ఎఫ్ డైరెక్టర్ డా. గగనేశ్ శర్మ
ప్రకృతి వ్యవసాయోత్పత్తుల నాణ్యతా ధ్రువీకరణ కోసం ‘పీజీఎస్–ఇండియా నేచురల్’ పేరిట ప్రత్యేక సర్టిఫికేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌సీఓఎన్‌ఎఫ్) డైరెక్టర్ డా. గగనేశ్ శర్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయదారులు పేర్లు నమోదు చేసుకున్న 6 నెలల్లో సర్టిఫికేషన్ ఇస్తామని, సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణ ఇస్తామన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం చివరి నాటికి ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. డా. గగనేశ్ శర్మ ‘సాక్షి సాగుబడి’తో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ కేంద్రంగా ఎన్‌సీఓఎన్‌ఎఫ్ దేశంలోని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాలు దీని నాగపూర్ ప్రాంతీయ కేంద్రం పరిధిలోకి వస్తాయి.
సీనియర్ రైతులకు వెంటనే ధ్రువీకరణ
డా. గగనేశ్ శర్మ ఇంకా ఏమన్నారంటే: ‘వినియోగదారులకు సౌలభ్యకరంగా ఉండేవిధంగా నేచురల్ ఫార్మింగ్ పోర్టల్, మొబైల్ యాప్‌లను రూపొందిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట కాలం ముగిసే నాటికి ఇవి అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయదారులు సులువుగా నేరుగా ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయమని రాష్ట్రప్రభుత్వాలను ఇప్పటికే కోరాం. ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లో రైతుల పేర్ల నమోదు జరుగుతోంది.
ఇప్పటికి 1,15,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ ‘పీజీఎస్ ఇండియా’కు ఉన్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి. అయితే, దీని ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఒక ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తమ పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 6 నెలల్లో నేచురల్ ధ్రువీకరణ ఇస్తాం. అయితే, 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ 6 నెలల పరిమితిని సడలిస్తాం. వారు ఎన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు? పశువులు ఏమి ఉన్నాయి? ఎరువులు కషాయాలు వారే తయారు చేసుకుంటున్నారా? పంటల జీవవైవిధ్యాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారు? వంటి విషయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వారికి గ్రేడింగ్ ఇస్తాం. అన్నీ సంతృప్తికరంగా ఉంటే వెంటనే ధ్రువీకరణ ఇస్తాం..’
నేచురల్ ఉత్పత్తులను ఎన్‌సీఓఎల్ కొంటుంది
‘దేశంలో 80% మంది రైతులు చిన్న కమతాలలో ప్రకృతి వ్యవసాయం చేసే వారే. వీరు పండించే పంటలో వారే చాలా వరకు వారి కుటుంబమే తింటారు. 20–30% పంటను అమ్ముతారు. ఈ మిగులు ఉత్పత్తులను కేంద్ర సహకార శాఖ ఏర్పాటు చేసిన జాతీయ సహకార సేంద్రియ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్) కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, దేశ ప్రజలకు విక్రయిస్తుంది. అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించిన పద్ధతిలో ఇది జరుగుతుంది. మేం ఇచ్చే పీజీఎస్ నేచురల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ సర్టిఫికేషన్ మాత్రమే. ప్రకృతి రైతుల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యాచ్‌ల వారీగా ఎన్‌సీఓఎల్ పరీక్షలు చేస్తుంది’ అని వివరించారు డా. గగనేశ్ శర్మ.