
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది.
వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు.