
2050లో వర్షాధార వరి దిగుబడి 20 శాతం, 2080లో 10 శాతం నుంచి 47 శాతం వరకు పతనం
2050లో నీటిపారుదల వరి దిగుబడి 3.5 శాతం, 2080లో ఐదు శాతం క్షీణత.. గోధుమ దిగుబడి 2050లో 19.3%.. 2080లో 40 శాతం తగ్గుతుంది
మొక్కజొన్న దిగుబడి 2050లో 10 శాతం నుంచి 19 శాతం వరకు.. 2080లో 20 శాతం తగ్గుతుంది
భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్యయనం
సాంకేతికత ద్వారా నీటివినియోగ సామర్థ్యం పెంపు
కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడి
దేశంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడులపై పడుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అధ్యయనంలో తేలింది. నేల క్షీణత, వర్షపాతం, పంట దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం అంచనా కోసం అధ్యయనాలు నిర్వహించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖరీఫ్ వర్షపాతం 2050 నాటికి 4.9 శాతం నుంచి 10.1 శాతం వరకు పెరుగుతుందని.. అలాగే, 2080 నాటికి 5.5 శాతం నుంచి 18.9 శాతం పెరుగుతుందని పేర్కొంది.
రబీలో కూడా 2050 నాటికి వర్షపాతం 12 నుంచి 17 శాతానికి.. 2080 నాటికి 13 నుంచి 26 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపింది. ఇలా వాతావరణ మార్పుల దృష్ట్యా లవణీయత ప్రభావిత ప్రాంతం 2030 నాటికి 6.7 మిలియన్ హెక్టార్ల నుండి 11 మిలియన్ హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేసినట్లు ఆ అధ్యయనం పేర్కొంది. – సాక్షి, అమరావతి
సమగ్ర పోషక నిర్వహణకు సాయం..
రాష్ట్రాలు నేల ఆరోగ్యం, దాని ఉత్పాదకతను మెరుగుపరచడానికి సూక్ష్మపోషకాలతో సహా రసాయన ఎరువులను, జీవ ఎరువులను అవసరమైన మేరకే ఉపయోగించడం ద్వారా సమగ్ర పోషక నిర్వహణను ప్రోత్సహించడంలో సహాయపడుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్ ప్రకారం.. వ్యవసాయంలో ప్రభావం, అత్యంత ప్రభావం పడే జిల్లాలను ఐసీఏఆర్ అంచనా వేసినట్లు తెలిపింది.
109 జిల్లాలను చాలా ఎక్కువ ప్రభావంగాను, 201 జిల్లాలను అత్యంత ప్రభావంగాను వర్గీకరించినట్లు తెలిపింది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా 151 జిల్లాల్లో అనుకూల ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసాధారణ వాతావరణ పరిస్థితిని పరిష్కరించడానికి 651 జిల్లాలకు జిల్లా వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
దిగుబడులపై ప్రభావం..
ఇక వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోకపోతే వర్షాధార వరి దిగుబడి 2050లో 20 శాతం.. 2080లో 10 శాతం నుంచి 47 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. నీటిపారుదల వరి దిగుబడి 2050లో 3.5 శాతం, 2080లో ఐదు శాతం మేర తగ్గుతుందని కూడా వివరించింది. అలాగే..
» గోధుమ దిగుబడి కూడా 2050లో 19.3 శాతం, 2080లో ఏకంగా 40 శాతం మేర తగ్గుతుంది.
» ఖరీఫ్‌లో మొక్కజొన్న దిగుబడి 2050లో 10 శాతం నుంచి 19 శాతం వరకు.. 2080లో 20 శాతం వరకు తగ్గుతుంది.
ఈ నేపథ్యంలో.. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్ర వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ వాతావరణ స్థితి స్థాపక వ్యవసాయ సాంకేతికతలను ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.
వాతావరణ స్థితిస్థాపక రకాలను ప్రోత్సహించడం, పంట వైవిద్యీకరణను అమలుచేయనున్నట్లు తెలిపింది. దేశంలోని పర్యావరణ వ్యవస్థలలో వాతావరణ మార్పు ప్రభావానికి అనుగుణంగా 76 ప్రోటోటైప్ ఇంటిగ్రేటెడ్ ఫారి్మంగ్ సిస్టమ్ నమూనాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మారుతున్న వాతావరణానికి వ్యవసాయాన్ని మరింత స్థితిస్థాపకంగా మార్చడానికి వ్యూహాలను అమలుచేస్తున్నట్లు వెల్లడించింది.
సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు.. అలాగే, వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఉత్పాదకతను పెంచడానికి వాతావరణ వైవిధ్యంతో సంబంధమున్న నష్టాలను తగ్గించడానికి సమగ్ర వ్యవసాయ వ్యవస్థపై దృష్టి పెడుతున్నట్లు తెలిపింది.