
స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ
ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం
నకిలీ మద్యం రాకెట్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలి.. బెల్ట్ షాప్‌లు, నకిలీ మద్యం నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలి
కల్లుగీత వృత్తిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
ప్రభుత్వానికి ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్
ఈ నెల 23 నుంచి నవంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానం
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘‘నకిలీ మద్యానికి కల్లు గీత వృత్తి బలి అవుతోంది. ప్రభుత్వ పెద్దల అండతో అధునాతన యంత్రాలతో నకిలీ మద్యం తయారీని పరిశ్రమ తరహాలో నిర్వహించడం అంటే ఇందులో వైఫల్యం ఎవరిది? రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసి డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేస్తున్నవారిపైన, బెల్ట్ షాప్‌లలో అమ్మేవారిపైన తక్షణం పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
శనివారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో అధ్యక్షుడు వాక రామచంద్రరావు అధ్యక్షతన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇందులో నరసింహమూర్తి మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న కొందరు రాష్ట్రంలోని తమవారి ద్వారా, ఫినాయిల్ పేరుతో స్పిరిట్‌ను బస్సుల్లో తరలించి నకిలీ మద్యం తయారు చేయించారని, ఈ దారుణ దందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాటి కల్లు అమ్మకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కల్లు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఎక్స్‌గ్రేషియా రద్దుతో ప్రభుత్వం అన్యాయం చేసింది
రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలు రద్దు చేసి గీత వృత్తిని దెబ్బతీసిందని, ఎక్స్‌గ్రేషియా ఎత్తివేసి గీత కార్మికులకు అన్యాయం చేసిందని వాక రామచంద్రరావు మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం గీత కార్మికులను దగా చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచి్చన 16 నెలల కాలంలో కల్లు అమ్మకాలు లేక గీత కార్మికులు వృత్తిని కొనసాగించలేక ఉన్న ఊరు, కన్నతల్లి, భార్యా పిల్లలను వదిలేసి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తి రక్షణకు మరో పోరాటం
గీత వృత్తిని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని, కల్లుకు మార్కెటింగ్ కల్పించాలని, వృత్తి ఆధునికీకరణకు నిపుణుల కమిటీ వేయాలనే తదితర డిమాండ్లపై రాష్ట్రవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ నెల 23 నుంచి నవంబరు 18 వరకు 27 రోజుల ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర దేవుడు, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.