breaking news
Pradhan Mantri Fasal Bima Yojana
-
అడవి జంతువులతో పంట నష్టానికి బీమా రక్షణ!
పంటలకు అడవి జంతువుల వల్ల, వరి పంటకు నీటి ముంపు వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి 2026 ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణజింకల వంటి అడవి జంతువుల వల్ల కూరగాయలు, పండ్లు, వరి, పత్తి వంటి పంటలకు కూడా చాలా ప్రాంతాల్లో తీరని నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీటి ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎటువంటి అధికారిక శాస్త్రీయ సర్వేలు ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఆధారపడదగిన గణాంకాలేవీ అందుబాటులో లేవు.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు వచ్చే ఖరీఫ్ నుంచి బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని ‘స్థానిక ప్రమాదం’గా గుర్తించి పీఎంఎఫ్‌బీవై కింద ఐదో యాడ్–ఆన్ కవర్‌గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియోట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్‌లోకి 72 గంటల్లోపు నష్టాలను రెతులు అప్లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది. అటవీ జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతోందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థనల మేరకు కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆకస్మికంగా స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణపరంగా సాధ్యమయ్యే విధివిధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంట కాలం నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్త దీర్ఘకాలిక సమస్యమన దేశం అంతటా రైతులు ఏనుగులు, అడవి పందులు, నీల్గాయ్, జింకలు, కోతులు వంటి వన్యప్రాణుల దాడుల కారణంగా చాలా సంవత్సరాలుగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అడవులు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలు, కొండల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య సర్వసాధారణం. ఇప్పటివరకు, ఇటువంటి నష్టాలు పంట బీమా పరిధిలోకి రాకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోయారు. అదేవిధంగా, వరద పీడిత, తీరప్రాంత రాష్ట్రాల్లోని వరి రైతులు భారీ వర్షాలు, వరదల వల్ల పదేపదే నష్టపోతున్నారు. మునిగిపోయిన పంటలను అంచనా వేయడంలో ఇబ్బంది కారణంగా 2018లో వరి ముంపునకు బీమా సదుపాయం తొలగించారు. అయితే, ప్రతి ఏటా వరదలకు గురయ్యే జిల్లాల్లోని రైతులకు బీమా రక్షణ అందకుండా పోయింది.ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నిర్ణయించారు. ఈ ముఖ్యమైన నిర్ణయంతో స్థానికంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ఇప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద సాంకేతికత ఆధారిత క్లెయిమ్ ద్వారా సకాలంలో పరిహారం పొందబోతున్నారు.మానవ–వన్యప్రాణుల సంఘర్షణ ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని రైతులకు బీమా సదుపాయం గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ముంపు నుంచి వరి పంటకు స్థానిక విపత్తుగా బీమా రక్షణను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల తరచూ వరదల పాలయ్యే తీరప్రాంత, తదితర రాష్ట్రాలలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మన దేశ పంటల బీమా వ్యవస్థను ఈ కొత్త సవరణలు మరింత బలోపేతం చేస్తాయి.రెండు రాష్ట్రాల్లో శాస్త్రీయ సర్వే చెయ్యాలివిశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచన పంటలకు అడవి జంతువుల వల్ల బీమా సదుపాయాన్ని సరిగ్గా అమలు చెయ్యాలన్నా గణాంకాలు అవసరం. ఏయే జంతువుల వల్ల ఎంత మేరకు నష్టం జరుగుతోందో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర సర్వే ద్వారా గణాంకాలు సేకరించిన తర్వాత స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచిస్తున్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం అధిపతిగా, ప్రధాన శాస్త్రవేత్తగా దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఉద్యోగ విరమణ చేశారు. ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: వచ్చే ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. రైతులకు ఉపశమనం కలుగుతుందంటారా? కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యే సమస్య కాదు. జటిలమైనది. ఏమి చెయ్యాలన్నా ముందు అధికారికంగా గణాంకాలు సేకరించాలి. పైపై అంచనాల ఆధారంగా కాకుండా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి?వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల నిపుణులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రామాణిక పద్ధతుల్లో సర్వే జరపాలి. ఏయే అడవి జంతువుల వల్ల ఏయే పంటలకు ఏయే దశల్లో ఎంత మేరకు పంట నష్టం జరుగుతున్నది? అనే గణాంకాలను ప్రాజెక్ట్ మోడ్‌లో పక్కాగా సేకరించాలి. ఏయే ప్రాంతాల్లో సమస్య ఏ(ఎక్కువ, మధ్యస్థం, తక్కువ) స్థాయిలో ఉందో గుర్తించాలి. తదనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి.తెలుగు రాష్ట్రాల్లో అడవి జంతువుల వల్ల పంటలకు నష్టం ఎంత మేరకు జరుగుతోందని మీరనుకుంటున్నారు?ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య ఉంది. కోతులను వన్యప్రాణుల జాబితా నుంచి తొలగించారు. కాబట్టి, వీటికి కుటుంబ నియంత్రణ చేయించవచ్చు. కోతులన్నిటినీ పట్టుకొని ఆపరేషన్ చెయ్యలేం కాబట్టి, ఆహారంలో మందు కలిపి పెట్టి మేటింగ్ కంట్రోల్ చెయ్యాలి. 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉంటుంది. వీటితో పాటు గద్వాల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కృష్ణజింకల సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా ఏనుగుల సమస్య కూడా ఉంది. పంటలకే కాదు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు కూడా కోతుల సమస్య ఉంది. ఒక పార్టీ ఎన్నికల వాగ్దానం చెయ్యాల్సి వచ్చిందంటే ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శాస్త్రీయ సర్వే ఎంత త్వరగా, సమగ్రంగా చేస్తే.. సమస్య పరిష్కారం దిశగా అంత వేగంగా అడుగులు పడతాయి. ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి సర్వే జరిగిందా?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసింది. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను తగ్గించగలిగారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోవటంలో సాంకేతిక సాధనాలు ఎంతవరకు ఉపయోగకరం?ఎన్ని సాంకేతిక ఉపకరణాలను రూపొందించినా కొంత మేరకు ప్రభావం చూపుతాయి. కానీ, పూర్తిగా సమస్యను పరిష్కరించలేవు. -
పంటల బీమాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. క్లస్టర్ల వారీగా అమలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ప్రీమియం ఇలా... వానాకాలం సీజన్లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. – పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీమా అమలుకు సూచనలు పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. – బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి. – కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. – కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి. – చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది. – వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి. -
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పీఎం–కిసాన్ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని, అన్ని రకాల వనరులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మన రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో పథకాల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్లతో అగ్రి–ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. హనీ బీ(తేనెటీగలు) మిషన్‌తో మన దేశం నుంచి తేనె ఎగుమతులు భారీగా పెరిగాయని, తద్వారా తేనెటీగల పెంపకందారులు అదనపు ఆదాయం పొందుతున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సాగయ్యే కుంకుమ పువ్వును ‘నాఫెడ్’ రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి కరోనా ప్రతికూల కాలంలోనూ 2020–21లో రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారని మోదీ ప్రశంసించారు. వరి, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలోనే కాదు, వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో తృణ ధాన్యాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 50 శాతం పెరిగిందని, దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం టాప్–10 దేశాల జాబితాలో చేరిందన్నారు. -
‘ఫసల్ బీమా’ ఇక స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో కేంద్రం కీలక మార్పు చేసింది. ఆ పథకంలో చేరడం తప్పనిసరి కాదని, రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమేనని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా నిర్ణయంతో, రుణాలు తీసుకున్న రైతులు కానీ, తీసుకోవాలనుకుంటున్న రైతులు కానీ ఈ బీమా పథకంలో అవసరమనుకుంటేనే చేరొచ్చు. రైతు సంఘాలు, పలు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర కేబినెట్ బుధవారం దీనికి ఆమోదం తెలిపినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంలోనూ తదనుగుణంగా మార్పులు చేశామని అందులో పేర్కొన్నారు. నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5% ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు. పీఎంఎఫ్‌బీవైపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం తెలిపారు. కేబినెట్ భేటీలో ఆమోదించిన ఇతర నిర్ణయాలు.. ► కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్ట్రీని, రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేబెనెట్ ఆమోదం తెలిపింది. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలనే, వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలనే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో పొందుపర్చారు. ► క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ► పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2% నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు. ► స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020–21 నుంచి 2024–25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి. ► రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి. -
పంటల బీమా... రైతులకు ధీమా !
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యంతో నష్టపోతున్న రైతులకు బీమా భరోసా కల్పిస్తోంది. గత ఖరీఫ్ 2017లో వరిలో దిగుబడులు బాగా తగ్గి రైతులు ఆందోళన చెందిన విషయం విదితమే. ఇందుకు కూడా వాతావరణ ప్రతికూలతలు, దోమపోటు తదితర అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ నిర్వహించిన పంట ప్రయోగ ఫలితాలతో ఇదే విషయం తేలింది. దీంతో వరి పంటలో గ్రామాన్ని యూనిట్‌గా ప్రకటించడంతో వరిపై ప్రీమియం చెల్లించిన రైతులకు, దిగుబడి తగ్గిన గ్రామాల్లో ఆ మేరకు లబ్ధి చేకూరేలా అమలుచేస్తున్న ఫసల్ బీమా రైతులకు ఇప్పుడు అండగా మారింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారుల అందించిన వివరాల ప్రకారం జిల్లాలో వరిపై ప్రీమియం చెల్లించిన రైతుల్లో దాదాపు 7,386 మందికి రూ.7,40,88,530 పంట పరిహారం కింద విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 14 బ్యాంకులు పరిహారం జమ చేసినట్లు అధికారులు తెలిపారు. పంటల బీమా కింద విడుదలైన పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సాక్షి, కరీంనగర్: రెండేళ్లలో రూ.18.63 కోట్ల పరిహారం.. నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇప్పటివరకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.18.63 కోట్లు అందజేశారు. 2014–15 రబీలో రూ.7.82 కోట్లు, 2016–17ఖరీఫ్‌లో రూ.3.40 కోట్లు, తాజాగా ఇప్పుడు ఖరీఫ్ 2017లో రూ.7.41 కోట్ల విడుదలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటి వాటాను చెల్లించిన దరిమిలా ఇన్సూరెన్స్ కంపెనీ వారు బీమా పరిహారం మొత్తాన్ని ఆయా బ్యాంకులకు జమ చేస్తాయి. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకులు వారి శాఖల ద్వారా రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రక్రియ మొదలు కానుంది. రెండురోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమవేశంలో కూడా ఈ విషయమై బ్యాంకర్ల నుంచి ఏ రైతులకు ఎంతమేర పరిహారం విడుదలైంది వంటి స్పష్టమైన వివరాలు సేకరించారు. ఆ వివరాలను శాఖలవారీగా క్రోడీకరించి కన్వీనర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అందించాలని, దాని ప్రతిని ఒకటి జిల్లా వ్యవసాయ అధికారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా రైతుల ఖాతాలకు జమ చేయడంలో ఎటువంటి జాప్యమూ చేయరాదని కూడా స్పష్టంగా ఆదేశించడంతో వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రబీ బీమా కోసం వ్యవసాయ శాఖ ప్రచా రం.. బీమా చెల్లింపునకు ఈనెల 31 చివరితేదీ పంటల బీమాకు ప్రీమియం చెల్లించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కలెక్టర్ ప్రొద్బలంతో ప్రతికూలతలు అధిగమిస్తున్నామన్న ధీమాను వ్యవసాయశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ పంట కాలానికి సంబంధించి వడగళ్లతో పంటనష్టపోయే సందర్భాలు గతంలో అనేకం చూశామని, ఈ క్రమంలో రైతులందరూ తప్పనిసరిగా తమ వరిపంటకు బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం బీమా పథకం, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం వల్ల రైతులు పంట రుణాలను కూడా సత్వరమే రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పంట రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రపోజల్ ఫారమ్ నింపి, పంట బీమా ప్రీమియం, ధ్రువీకరించిన కామన్ సర్వీస్ సెంటర్లో లేదా సమీప బ్యాంకులో కట్టవచ్చని పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.450 కాగా, చివరితేదీ ఈనెల 31వరకే ఉంది. ఇంకా మిగిలి ఉన్న బ్యాంకు పనిదినాలు ఐదురోజులు మాత్రమే ఉన్నందున రైతులు పూర్తి ఇంకా వివరాలకు సమీప వ్యవసాయ అధికారిని సంప్రదింంచి బీమా చేయించుకోవాలని సూచిస్తున్నారు. బీమా చేసుకుంటే మేలు రైతులు రబీ కోసం బీమా ప్రీమియం చెల్లించడానికి ఈనెల 31 చివరి తేదీ. ఇందులో బ్యాంకు పనిదినాలు కేవలం ఐదు రోజులే ఉన్నందున త్వరపడాల్సిన అవసరం ఉంది. రెండేళ్లుగా స్వయంగా పరిశీలిస్తున్న పంటకోత ప్రయోగాలు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాల బట్టి రైతులకు బీమా పరిహారం అందుతుంది. జిల్లా కలెక్టర్ విరివిగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో పంటల బీమా ఆవశ్యకతను, ప్రయోజనం వర్తింపుపై అటు బ్యాంకర్లకు, ఇటు వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఒక ప్రాధాన్య అంశంగా చర్చిస్తున్నారు. గతంలో ఏ రైతుల వద్దకు వెళ్లి పథకం వివరాలు చెప్పినా రైతుల నుంచి నిరాశక్తత ఎదురయ్యేది... ఇప్పుడా పరిస్థితి లేదు. – వి.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి -
‘బీమా’ అందరాని అందలం?
విశ్లేషణ ప్రధాన మంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టింది. అది వాటిని గుర్తించక పోయైనా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ విషయమై వస్తున్న వార్తా కథనాలను బట్టి చూస్తే... రైతులకు పంటల బీమాను కల్పించడం వల్ల బీమా సంస్థలకు కలగడానికి అవకాశం ఉన్న నష్టానికి బీమా రక్షణగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది. అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎమ్ ఎఫ్బీవై) పథకం సమస్యల్లో పడ్డట్టుంది. మచ్చుకు ఇది చూడండి. అకాల వర్షాల వల్ల రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తేవడం కోసం వందలాది మంది రైతులు నానా పాట్లూ పడ్డారు. వారు ఇచ్చిన టోల్ ఫ్రీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ పని చేయడంలేదని, ఎవరిని సంప్రదించాలో తమకు తెలియ దని రైతులు వాపోతున్నారు. పొరుగునున్న హరియాణాలోని గోహన జిల్లాలో ఏదో తెగులు సోకి వరి పంట దెబ్బతింది. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని 700 మందికి పైగా రైతులు కోరారు. రైతులు ఏడు రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత గానీ పంట నష్టాన్ని అంచనా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది కాదు. రైతులకు, పాలనా యంత్రాంగానికి మధ్య ఘర్షణ ఇలా ఉండగా, హరి యాణా వ్యవసాయ శాఖ అధికారులు పంట కోత ప్రయోగాల (దిగుబడిని అంచనా కట్టడం కోసం చేపట్టేవి) నిర్వహణకు నిరాకరించారు. వ్యవసాయ అధికారులు ఆరు నెలలపాటూ ఎలాంటి సమ్మెలు చేయరాదంటూ అత్యవసర సర్వీసుల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఫలితం లేక పోయింది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పేదాన్ని బట్టి ఖరీఫ్ పంట మార్కెట్లకు చే రడం మొదలయ్యేటప్పుడు పంట కోత అంచనా చేపట్టం వల్ల పంట నష్టానికి బీమా సొమ్మును చెల్లించాలని కోరే రైతులకు నష్టం జరుగు తుంది. రైతుల కోసమా? బీమా సంస్థల కోసమా? అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌లో ఎన్నోచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అకాల వర్షాలు లేదా వడగళ్ల వానల వల్ల పంటలు దెబ్బతింటే పదిహేను రోజుల లోగా చర్య తీసుకుంటామని, నెలలోగా నష్టపరిహారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వాగ్దానం చేశారు. మహారాష్ట్రలోని పత్రికల నిండా పంట నష్టాన్ని అంచనా కట్టడంలో బీమా కంపెనీల వైఫల్యా నికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రాజస్తాన్ పత్రిక వెలువరించిన ఈ కథనాన్నే తీసుకోండి. పెసర, నువ్వు, పత్తి, వేరుశనగ, సజ్జ, జొన్న తదితర పంటలకు ఈ ఫసల్ బీమా వర్తిస్తుంది. పెసరకు చెల్లించగల అత్యధిక నష్ట పరిహార బీమా మొత్తం రూ. 16,130. అంటే పంట విలువలో ఇంచుమించుగా 40 శాతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ తయారుచేసిన అంచనాల ప్రకారం పెసర దిగుబడి సగటున హెక్టారుకు 7 క్వింటాళ్లు. పెసర కనీస మద్దతు ధరనే తీసుకున్నా, దాదాపు హెక్టారుకు దిగుబడి విలువ రూ 40,000 అవుతుంది. అంటే, 60 శాతం పంట నష్టం జరి గినా బీమా కంపెనీ ఆ మొత్తం నష్టాన్నంతటినీ భరించదు. పంటల బీమా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో లేవనెత్తినప్పుడు సైతం ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తాత్సారం చేస్తోందని రైతుల ఫిర్యాదు. పైన పేర్కొన్న వార్తా నివేదికలను బట్టి ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం సక్రమంగా అమలు కాకపోతే తలెత్తే సమస్యలపై కనీస అంచనా సైతం లేకుండానే దాన్ని ప్రభుత్వం చేపట్టిందని అర్థమౌతుంది. ప్రభుత్వం, తాము రూపొందించిన పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేయడంలో తీవ్ర సమస్యలున్నాయనే విషయాన్ని గుర్తించకపోయి అయినా ఉండాలి లేదా ప్రైవేటు కంపెనీలపై అతి విశ్వాసాన్ని ఉంచైనా ఉండాలి. అయితే నేనింత వరకు చదువుతున్న విషయాలను, విశ్లేషణలను బట్టి చూస్తే... రైతులకు పంట నష్టానికి బీమా రక్షణను కల్పించడం వల్ల ప్రైవేటు కంపెనీలకు కలగ డానికి అవకాశం ఉన్న నష్టానికి బీమాను కల్పించేదిగానే ఈ పథకాన్ని చేపట్టారని అనిపిస్తోంది. జవాబుదారీతనం సున్న పంట నష్టాలను, చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బహిరంగ వేలం ప్రాతి పదికపై అంచనాకట్టడమే నేను అలా అనుకోవడానికి కారణం. ప్రపంచంలో ఎక్కడా ఇలా బహిరంగ వేలం ద్వారా నిర్దేశిత ప్రాంతంలో పంటల బీమాను అందించడం కోసం ఏ బీమా కంపెనీ ఇంతవరకు ముందుకు రాలేదు. ప్రభుత్వ రంగంలోని అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఏఐసీ ఎల్) సహా మొత్తం దాదాపు 12 బీమా కంపెనీలున్నాయి. అవి ఒక్కొక్క జిల్లాకు తాము అందించగల ప్రీమియంలను కోట్ చేస్తునాయి. ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్పాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారం దేనిలోనైనా సబ్సిడీ మొత్తం ఎంత అనేదే నిర్ణయా త్మకమైన అంశం అవుతుంది. రైతులు ఖరీఫ్ పంటల విషయంలో 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వాతావరణపరంగా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే గడ్డు ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటిని ప్రభుత్వ బీమా సంస్థకు వదిలి పెట్టే శారు. మిగతా ప్రాంతాల్లో సైతం ప్రైవేటు కంపెనీలు కోట్ చేసిన ప్రీమియం పరిమితులకు ప్రాతిపదిక వాటి వాణిజ్య లాభదాయకతే గానీ, పంట నష్టం మాత్రం కాదు. ఇలాంటి దాన్ని అసలు ఎంత మాత్రమూ అనుమతించనే కూడదు. ప్రైవేటు కంపెనీలు ఎలాంటి జవాబుదారీతనం వహించకుండా తమ ఇష్టానుసారం గరిష్ట లాభాలను ఆర్జించడానికి అవకాశాలను కల్పిం చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఇది స్పష్టంగా తెలుపుతోంది. రాజస్తాన్‌నే తీసు కోండి. ఆ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో దాదాపు 35 శాతం ప్రధాని ఫసల్ బీమా యోజన అమలుకే పోతోంది. బీమా కంపెనీలు అధిక ప్రీమియం రేట్లను కోట్ చేయడమూ, వాటిని తగ్గించేలా చేయడానికి ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేకపోవడమే అందుకు కారణం. ముందస్తు పెట్టుబడే లేని వ్యాపారం పంట నష్టాన్ని అంచనా వేయడం, పంట కోత అంచనాలు వంటి పనుల కోసం, సిబ్బంది సహా సరిపడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎలాంటి ముందస్తు పెట్టుబడి పెట్టకుండానే ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జించడానికి పంటల బీమా అద్భుత వ్యాపార అవకాశంగా మారింది. పంట కోత ప్రయోగాల బాధ్యతలను ప్రైవేటు బీమా కంపెనీలే చేపట్టాలని హరి యాణాలో సమ్మె చేస్తున్న వ్యవసాయ అధికారులు కోరడం న్యాయ సమ్మ తమైనది, సమంజసమైనది. జిల్లాకు 24 పంట కోత ప్రయోగాలను నిర్వహిం చాలని ఈ పథకం కింద నిర్దేశించారు. అంటే దేశవ్యాప్తంగా 40 లక్షల పంట కోత ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి అయ్యే వ్యయాలను ప్రైవేటు కంపెనీలు ఎందుకు కల్పించవు? ఈ ఫసల్ బీమా యోజన దాదాపుగా రూ. 18,000 కోట్ల వ్యాపారం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ పథకంపై ఖర్చు ఒక్కసారిగా రూ.12,000 కోట్ల మేరకు పెరిగిపోయింది. స్కూటరుకో లేదా కారుకో బీమా చేయించుకోమని మనల్ని కోరడానికి బీమా కంపెనీలు ఏజెంట్లను నియమి స్తాయి. అదే పంటల బీమా బీమా ప్రీమియంలను బలవంతంగా రైతుల నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకుల ద్వారా అవి రైతుల ప్రీమియంలను వారి ఖాతాల నుంచి నేరుగా మినహాయించేసుకోవడం అంటే... అదీ కూడా పంట నష్టాన్ని అంచనా కట్టడానికి సైతం పైసా పెట్టుబడి పెట్టకుండానే చేయడం అంటే విచిత్రం కాదూ! ఈ వ్యాపారం చేయడానికి అనువుగానే ఈ పథకాన్ని రూపొందించారో లేక అజ్ఞానం వల్లనో ఇలా జరిగిందో నాకు తెలియదు. ఫసల్ బీమా అర్థవంతం కావాలంటే... ఈ బీమా పథకాన్ని మరింత అర్థవంతం చేయడం కోసం ఈ సూచనలను చేస్తున్నాను: 1. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల బ్యాంకు ఖాతాల నుంచి ఫసల్ బీమా ప్రీమియం మొత్తాలను మినహాయించేసుకోవడాన్ని ఆపాలి. తాము ఏ పంటలకు బీమా చేశామో కూడా తెలియకుండానే బీమా కంపెనీలు బ్యాంకుల నుంచి నేరుగా ప్రీమియంలను వసూలు చేసేసుకుంటున్నాయి. 2. బీమా ప్రీమియంలను నిర్ధారించడానికి బహిరంగ వేలం పద్ధతిని నిలిపివేయాలి. దానికి బదులుగా వాతావరణ ప్రాతిపదికపై పంటల పరిస్థితిని, జిల్లాల వారీగా ప్రీమియం మొత్తాలను నిర్ధారించడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. 3. బీమా కంపెనీలు కోత ప్రయోగాలకు తగిన నిపుణ శ్రామిక శక్తిని తయారుచేసుకునేలా చేయాలి. ఇది విద్యావంతులైన, నిపుణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. 4. పంట నష్టాన్ని, బీమా చెల్లింపు మొత్తాన్ని లెక్కగట్టడానికి బీమా కంపెనీలు రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ఒక బ్లాక్ మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకునే ప్రాతిపదికపై పంట నష్టాలను అంచనా కట్టడానికి వీల్లేదు. 5. నష్ట భయం ఉన్న 50 జిల్లాల్లోనే 60 శాతం పంటల బీమా అమలు రుగుతోంది. కాబట్టి ఈ జిల్లాలన్నింటిలోనూ బీమా కంపెనీలలోని పతి ఒక్కటీ రైతు పొలాన్ని యూనిట్‌గా తీసుకుని అమలుచేసే పంటల బీమా పథ కాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం కోరవచ్చు. అలా చేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకునేదేమీ లేదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com -
కడపలో రైతు సదస్సు రసాభాస...
- కలెక్టర్- ప్రజాప్రతినిధుల వాగ్వాదం కడప(వైఎస్సార్ జిల్లా) వైఎస్సార్ జిల్లా కడప నగరంలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రధాని ఫసల్ భీమా యోజనపై రైతుల అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ప్రజాప్రతినిధులు- కలెక్టర్ మధ్య వాగ్యుద్ధం జరగడంతో రైతులందరూ సదస్సును మధ్యలోనే బహిష్కరించారు. తీవ్ర గందరగోళం మధ్య సదస్సు అర్ధంతరంగా ముగిసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను మంటకలుపుతోందని, రాజధాని కోసం కృష్ణా జిల్లాలో సేకరించిన 57వేల ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలోని 57 వేల ఎకరాల భూములను అటవీ శాఖకు బదలాయించడాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా రైతులు, ప్రజల అవసరాలకు ఉపయోగపడే 57 వేల ఎకరాల భూమిని అటవీశాఖకు బదలాయించడం దారుణమని, దీనిని తాము అంగీకరించేది లేదని, దీనిపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. రైతులను నట్టేట ముంచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ అడ్డుకోవాలని వారు కోరారు. మధ్యలోనే జోక్యం చేసుకున్న కలెక్టర్ ఇది రాజకీయ సభ కాదని, ప్రజాప్రతినిధులకు తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో రభస మొదలైంది. జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడే విషయమై తాము మాట్లాడుతుంటే రాజకీయాలనడం సరికాదని సి.రామచంద్రయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి సదస్సునుంచి వెళ్లిపోయారు. వారి వెనుకే రైతులందరూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. విధిలేక అధికారులు సదస్సును అర్థంతరంగా ముగించారు. -
పంట నష్టపోతే రైతుకు 25% పరిహారం


