‘ఫసల్‌ బీమా’ ఇక స్వచ్ఛందమే | Cabinet Approves Changes In Pradhan Mantri Fasal BimaYojana scheme | Sakshi
Sakshi News home page

‘ఫసల్‌ బీమా’ ఇక స్వచ్ఛందమే

Feb 20 2020 3:26 AM | Updated on Feb 20 2020 4:55 AM

Cabinet Approves Changes In Pradhan Mantri Fasal BimaYojana scheme - Sakshi

న్యూఢిల్లీ:  ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో కేంద్రం కీలక మార్పు చేసింది. ఆ పథకంలో చేరడం తప్పనిసరి కాదని, రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమేనని కేంద్ర కేబినెట్‌ స్పష్టం చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా నిర్ణయంతో, రుణాలు తీసుకున్న రైతులు కానీ, తీసుకోవాలనుకుంటున్న రైతులు కానీ ఈ బీమా పథకంలో అవసరమనుకుంటేనే చేరొచ్చు.

రైతు సంఘాలు, పలు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర కేబినెట్‌ బుధవారం దీనికి ఆమోదం తెలిపినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్‌ వెదర్‌ బేస్డ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకంలోనూ తదనుగుణంగా మార్పులు చేశామని అందులో పేర్కొన్నారు. నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్‌ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5% ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు. పీఎంఎఫ్‌బీవైపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ బుధవారం తెలిపారు. కేబినెట్‌ భేటీలో ఆమోదించిన
ఇతర నిర్ణయాలు..
     
► కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్‌ రిజిస్ట్రీని, రిజిస్ట్రేషన్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ‘అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ(నియంత్రణ) బిల్‌’కు కేబెనెట్‌ ఆమోదం తెలిపింది. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్‌) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలనే, వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలనే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో పొందుపర్చారు.  

► క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన 22వ న్యాయ కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉంటారు.

► పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్‌ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2% నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు.  

► స్వచ్ఛ భారత్‌ మిషన్‌(గ్రామీణ) రెండో దశకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020–21 నుంచి 2024–25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్‌ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్‌) అయ్యాయి.

► రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement