లోకార్బ్‌ హై/హెల్దీ ఫ్యాట్‌ : అవిసె గింజలు అద్భుతః | sagubadi Flaxseeds cultivation and its Health Benefits | Sakshi
Sakshi News home page

లోకార్బ్‌ హై/హెల్దీ ఫ్యాట్‌ : అవిసె గింజలు అద్భుతః

Aug 6 2025 9:57 AM | Updated on Aug 6 2025 11:36 AM

sagubadi Flaxseeds cultivation and its Health Benefits

అవిసె గింజల ఉత్పత్తికి భారత్‌ అనుకూలం

సాగు విస్తీర్ణం ఆసియాలోనే ఎక్కువ

పుట్టిల్లు ఆగ్నేయాసియా... 

134 కోట్ల డాలర్ల  మార్కెట్‌

అద్భుత పంట అవిసె పంట. అవిసె గింజలను ఆంగ్లంలో ‘ఫ్లాక్స్‌ సీడ్స్‌’ అంటారు. వంట నూనె వాణిజ్య వర్గాల్లో అవిసె నూనెకు ‘లిన్‌ సీడ్‌ ఆయిల్‌’ అని పేరు. ఈ నూనె చాలా ఆరోగ్యదాయకం. అవిసె మొక్క కాండం నుంచి తీసే నార/పీచు (లినెన్‌)తో తయారైన మెత్తని వస్త్రాలకు మధ్యతరగతి, ఉన్నత వర్గాల మార్కెట్లలో దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటన్నిటికీ మించి.. అవిసె గింజలు  పోషకాల పుట్టలు. ఈ గింజల పిండితో చేసిన రొట్టెలు, ఇతర వంటకాలు అద్భుతపోషక విలువలతో కూడి ఉండి ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

ముఖ్యంగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకునే ‘లోకార్బ్‌ హై/హెల్దీ ఫ్యాట్‌’ ఆహార పద్ధతిని పాటించే వారికి గోధుమలు, చిరుధాన్యాలకు అవిసె గింజల రొట్టె అద్భుత ప్రత్యామ్నాయం!.. 

అవిసె పంట కొత్తదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్నదే. అంతేకాక, ఎంతో ఆరోగ్యదాయకమైన వర్షాధార పంటే అయినా, మన ప్రజల్లో చాలా మందికి దీని గురించి అంతగా తెలియకపోవటం ఆశ్చర్యకరం!అవిసె.. ఈ పేరుతో రెండు పంటలు ఉన్నాయి. 

మొదటిది: సన్నగా, పొడవుగా, గోగు మొక్క మాదిరిగా పది అడుగులు పెరిగే రకం ఒకటి. దీని శాస్త్రీయ నామం ‘సెస్బానియా గ్రాండిఫ్లోరా’. ఇది తమలపాకు తోటల్లో కనిపిస్తుంది. తమలపాకు తీగలను ఈ మొక్కలకే పాకిస్తారు. ఈ చెట్టు ఎర్ర /తెల్ల పూలు, కాయలు ఔషధ గుణాలున్న తినదగినవి. 

చదవండి: సెలవంటే పండగ..ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బూ ఆదా ఇలా!

రెండోది: ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రకం. దీని శాస్త్రీయ నామం ‘లినమ్‌ యుసిటాటిస్సిమం’. ఇది చిన్న  పొద వంటి మొక్క. దీని కాయలు ధనియాల మాదిరిగా చిన్నగా ఉంటాయి. దాన్ని చిదిపితే లోపల కాఫీ రంగులో సన్నని, చిన్న గింజలు ఉంటాయి. అవే అవిసె గింజలు. మంచి పోషక విలువలున్నవి. ఇది నూనె గింజ పంటగా ప్రసిద్ధి. 

అవిసెను మానవ సంక్షేమం కోసం సహజ ఉత్పత్తులనిచ్చే విలువైన ఆర్థిక పంటగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. వాణిజ్యపరంగా ముఖ్యమైన నార/ఫైబర్, నూనెను ఉత్పత్తి చేసే మొక్కల జాతికి చెందినది. అవిసె సాగుకు సుదీర్గ చరిత్ర ఉంది. వివిధ పురాతన నాగరికతల పత్రాలను పరిశీలిస్దే ఇది అర్థమవుతోంది. అవిసె సాగు కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లినోలెనిక్‌ ఆమ్లం, లిగ్నాన్లు సహా బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా కలిగి ఉన్నందున అవిసె గింజలు, అవిసె నూనె గుర్తింపు  పొందాయి. అవిసె నార వస్త్ర పరిశ్రమలో ముఖ్యమైన పాత్ర  పోషిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తింపు ఉన్న అవిసె పంటపై పరిశోధనలు ఇటీవల ఊపందుకున్నాయి. మాలిక్యులర్‌ జెనెటిక్స్, బ్రీడింగ్, జెనోమిక్స్, జీనోమ్‌ ఎడిటింగ్‌ సహా అత్యాధునిక జన్యు ఇంజనీరింగ్‌ పద్ధతులలో పరిశోధనలు విస్తృతం అవుతున్నాయి. పరిశోధనలో పురోగతి, అవిసె సహజ ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రైతుల ఆర్ధికాభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహద పడవచ్చని నిపుణుల అంచనా. 

పది వేల ఏళ్ల క్రితం మానవులు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం మొదలు పెట్టిన  అవిసెను వేలాది ఏళ్ల క్రితమే ఆహార (నూనె గింజ) పంటగా, పశుగ్రాస పంటగా, నార పంటగా సాగు చేయటం  ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నార కోసం పొడుగు పంట, నూనెగింజల కోసం పొట్టి రకం అవిసె పంటలు అప్పటి నుంచే ఉన్నాయి. అధిక నాణ్యతతో కూడిన వస్త్రాల నేతకు పనికొచ్చే అవెసె నార 5,700 ఏళ్ల క్రితం నుంచే వాడుకలో ఉంది. సింథటిక్‌ వస్త్రాల ఉత్పత్తి పెరిగినప్పటి నుంచి లినిన్‌ వాడకం మందగించింది. అయితే, పర్యావరణహితమైన సుస్థిర సహజ ఉత్పత్తిగా లినెన్‌ వస్త్రాలకు ఆదరణ ఇటీవల కాలంలో పెరుగుతోంది. వస్త్రోత్పత్తితో పాటు ఫ్లాక్స్‌ ఫైబర్‌ను ఇన్సులేషన్, కం΄ోజిట్స్, కరెన్సీ వంటి  స్పెషాలిటీ పేపరు, జియో టెక్స్‌టైల్స్‌లోనూ వాడుతున్నారు. దీంతో ఈ పంటను తిరిగి విస్తృతంగా చేపట్టడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఫ్లాక్స్‌ సీడ్స్‌ ఆయిల్‌ ఇటు వంట నూనెగా అటు పారిశ్రామిక ప్రయోజనాలున్న నూనెగా ప్రసిద్ధి పొందింది. లిన్‌సీడ్‌ ఆయిల్, ఫ్లాక్స్‌సీడ్స్‌లో ఆరోగ్యాన్ని పెంపొందించే లినోలెనిక్‌ ఆసిడ్‌ (ఎఎల్‌ఎ), ప్రొటీన్, డైటరీ ఫైబర్‌తో పాటు పాలీఅన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ (పీయూఎఫ్‌ఏలు) పుష్కలంగా ఉన్నాయి. లిన్‌సీడ్‌ ఆయిల్‌కు త్వరగా తడారిపోయే స్వభావం ఉండటంతో రంగులు, ప్రింటర్స్‌ ఇంక్, వార్నీషులు, లైనోలియం, సబ్బులు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఫ్లాక్స్‌సీడ్స్‌కు పోషకవంతమైన పెంపుడు పక్షుల ఆహారంగా పేరుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. అవిసె ఉత్పత్తులకు ఆరోగ్య దాయకమైన, పర్యావరణహితమైన వైవిధ్యభరితమైన ప్రయోజనాలు ఉన్నాయి.

అడవి జాతి అవిసె పుట్టింది ఎక్కడో స్పష్టంగా తెలియదు. అయితే, మెడిటెర్రేనియన్, ఆగ్నేయాసియాల మధ్య ప్రాంతంలో పుట్టింది. తొలుత ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా, తుర్కియే, జోర్దాన్‌  ప్రాంతంలో సాగైంది. తదనంతరం క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. తుర్కియేలో క్రీస్తు పూర్వం 6 వేల ఏళ్ల నాటి పురావస్తు అవశేషాల్లో అవిసె నార కనిపించింది. లినిన్‌/లైనిన్‌ వస్త్రంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్న ఫైబరే పత్తి కన్నా అతి  ప్రాచీన పంటని పరిశోధకులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఈజిప్టులో వస్త్రాలు, వస్తువులు, మమ్మీలకు చుట్టిన బ్యాండేజ్‌లలో అవెసె నార వాడారు. తదనంతర కాలంలో స్కాటాండ్, పర్షియా, భారత్, చైనా తదితర దేశాల్లో వర్తకులు అవెసె వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల్ని విక్రయించారు. జర్మనీ, రష్యాల నుంచి ముడి అవిసె నారను తెప్పించి ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లండ్‌లలో లైనెన్‌ వస్త్ర పరిశ్రమలు వస్త్రాలు తయారు చేశాయి. ‘స్వచ్ఛత’కు ప్రతీకగా ఈజిప్షియన్, క్రిస్టియన్‌ తదితర నాగరికతల్లో దేవుళ్లు, దేవతలు అవిసె వస్త్రాలను వేసుకున్నారట. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ కూడా లైనెన్‌ వస్త్రాలను వేసుకున్నారట. మధ్యయుగంలో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ఇంటింటికీ అవిసె వస్త్రాలు, దుప్పట్లు ఎవరికి వారు నేసుకునేవారట. ఫ్లాక్స్‌ స్పిన్నింగ్‌ యంత్రం కనుగొనటంతో దీని సాగు తామరతంపరగా విస్తరించింది. అయితే తదనంతర కాలంలో పత్తి పంట అందుబాటులోకి వచ్చాక దీని ప్రాభవం తగ్గిపోయింది. ఏతావాతా చెప్పేదేమంటే.. అవిసె పంటకు అనాదిగా ఘన కీర్తి ఉంది.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎవో) 2021 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 41.4 లక్షల హెక్టారలో 33.4 లక్షల టన్నుల అవిసె గింజలు పండుతున్నాయి.  2017–21 మధ్యకాలంలో సాగు విస్తీర్ణం ఆసియాలో 45.7%, యూరప్‌లో 30.4%, అమెరికాలో 20.2% విస్తరించి ఉంది. కజికిస్తాన్, రష్యా, కెనడా, చైనా, భారత్, అమెరికా, ఇథియోపియా, ఫ్రాన్స్, యూకేలలో లిన్‌సీడ్స్‌ సాగు విస్తారంగా జరుగుతోంది. అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో 8 మెట్రిక్‌ టన్నుల ఫ్లాక్స్‌ ఫైబర్‌ దిగుబడి వస్తోంది. అవిసె నారను 96.6% మేరకు యూరోపియన్‌ దేశాల్లోనే ఉంది. ఫ్రాన్స్, బెల్జియం, బెలారస్, రష్యా, యూకేలలో ఎక్కువ. ఆసియాలో అవిసె నార సాగు కేవలం 2% మాత్రమే. ఇందులో చైనాదే సింహభాగం. భారత్‌లో అవిసె నార సాగు బాగా తక్కువ. అవిసె గింజల ఉత్పత్తి గత ఐదేళ్లలో సగటున ఏటా 2.4 లక్షల హెక్టార్లలో 1.4 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు జరిగింది. అయితే, 1961–65 నాటితో (19.4 లక్షల హెక్టార్లలో 4.3 లక్షల టన్నుల ఉత్పత్తితో) పోల్చితే ఇది బాగా తక్కువ.   అవిసె పంట 10–25 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతల మధ్య, 155–200 ఎం.ఎం. వార్షిక వర్షపాతం, 60–65% గాలిలో తేమ ఉన్న చోట్ల బాగా పెరుగుతుంది. మన దేశంలో అక్టోబర్‌ చివరి నుంచి నవంబర్‌ మధ్య వరకు సీతాకాలపు పంటగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగు చేస్తారు.  నీరు నిలవని ఒండ్రు నేలల్లో, 5.5–6 పిహెచ్‌ ఉండే నేలల్లో పెరుగుతుంది. 

(ఎ) పూత దశలో ఉన్న అవిసె మొక్క
(బి) అవిసె వంగడాల్లో వివిధ పూల రంగుల వైవిధ్యం
(సి–డి) పరిపక్వ దశలో అవిసె కాయలు, విత్తనాలు
(ఇ) కాండం నుంచి సేకరించిన అవిసె ఫైబర్‌ (లినెన్‌ నార) 
 

నిర్వహణ: పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement