అలనాటి అస్త్రాలు... బ్రహ్మాస్త్రం... బ్రహ్మాండాస్త్రం | Powerful Weapons Used In Mahabharata War | Sakshi
Sakshi News home page

అలనాటి అస్త్రాలు... బ్రహ్మాస్త్రం... బ్రహ్మాండాస్త్రం

Jun 29 2026 6:12 AM | Updated on Jun 29 2026 6:12 AM

Powerful Weapons Used In Mahabharata War

భారత విజ్ఞానం

మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి గతవారం కొంత  తెలుసుకున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం...
 
బ్రహ్మాస్త్రం... 
సృష్టికర్త అయిన బ్రహ్మ తన తపఃశక్తితో రూపొందించినదే ‘బ్రహ్మాస్త్రం’. అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం గురించి ఇతిహాసాలలో వివరించారు. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధం. విశ్వంలో అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తిమంతమైన ఆయుధం. 

దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. త్రేతాయుగం  నాటి రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ,అర్జునుడు అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేద్దామనుకొంటే గురువైన పరశురాముని శాపం వల్ల అస్త్రాన్ని సంధించే మంత్రం జ్ఞాపకం రాకపోవడంతో సంధించలేకపోయాడు.

బ్రహ్మశీర్షాస్త్రం...
ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తిమంతమైనది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తిమంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తిమంతమైనదో అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని అర్జునుడికి హితబోధ చేసి మరీ ఈ అస్త్రాన్ని ఉపదేశించాడు. 

బ్రహ్మాండాస్త్రం...
ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం. చేసేంత శక్తిమంతమైనది. ఈ ఆయుధం కొనపై బ్రహ్మ దేవుని నాలుగు తలలతో పాటు ఊర్ధ్య ముఖంగా మరో తల ఉంటుంది. ఈ అస్త్రంలో బ్రహ్మాస్త్ర బ్రహ్మ శీర్షాస్త్రాల రెండు శక్తులూ సమ్మిళితమై ఉంటాయి. ఒకసారి ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దీనిని ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా దీనిని ప్రయోగించినవారు కూడా దాని వల్ల జరగబోయే ముప్పును, అనర్థాలనూ తప్పించలేరు. ఈ అస్త్రం ద్రోణాచార్యుడి వద్దనే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం కోసం పోరాడుతుండటంతో వారిపై ప్రయోగించవద్దని దేవతల కోరిక మేరకు ద్రోణాచార్యుడు ప్రయోగించలేదు.

త్రిశూలం... 
త్రిశూలం శివుని ఆయుధం.. పార్వతీదేవి శివునికి ప్రసాదించిన అత్యంత శక్తిమంతమైన అస్త్రం ఇది. దీనికున్న మూడు కొనలు సృష్టి, స్థితి, లయ అనే మూడింటికి ప్రతీకలు. మొత్తం విశ్వమంతా ఈ మూడు శక్తుల మీదే నడుస్తుంది. లక్ష్య భేదితమైన త్రిశూలం శైవ సంప్రదాయం ప్రకారం అత్యంత శక్తిమంతమైన ఆయుధం. కేవలం శివుడు, శక్తి దేవతలు మాత్రమే దీనిని భరించగలరు.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement