
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నటి పూర్ణ, హీరో శివ కందుకూరి పంచుకున్న విశేషాలు
– పూర్ణ
→ స్కూల్ డేస్‌లో ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేదాన్ని. దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేయడం ఓ మంచి గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా నా స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకుంటున్నాను. దానికి కారణం దుబాయ్‌లో నేను ఆరంభించిన ‘డ్యాన్స్ స్కూల్’. ఈ స్కూల్ స్టార్ట్ చేశాక వచ్చిన తొలి ఇండిపెండెన్స్ డే ఇది. ఈ సందర్భంగా మా స్కూల్ స్టూడెంట్స్‌తో దేశభక్తికి సంబంధించిన రీల్ చేయించాం. సోషల్ మీడియా ద్వారా ఇవాళ రిలీజ్ చేయనున్నాం. రిపబ్లిక్ డే అప్పుడు ఇలాంటిదే చేశాం. అప్పుడు నేను కూడా పాల్గొన్నాను. ఈసారి షూటింగ్స్ ఉండటంతో హైదరాబాద్‌లో ఉన్నాను.
→ స్కూల్లో ‘ఏ మేరా ఇండియా’ అని డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒళ్లు పులకరించిపోయేది. ఇప్పటికీ ఆ పాట పాడుతుంటే ఓ రకమైన ఎమోషన్ కలుగుతుంది. నేను ఫార్మల్‌గా డ్యాన్స్ నేర్చుకున్నాను. అందుకే దేశం పట్ల నాకు ఉన్న భక్తిని దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేయడం ద్వారా వ్యక్తపరుస్తుంటాను. అసలు ‘ఇండియా’ అని పలుకుతుంటేనే ఎంతో బాగుంటుంది.
→ చిన్నప్పుడు స్కూల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు బాగా పర్ఫార్మ్ చేయాలనే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉండేది. అలాగే జెండా రంగులు వచ్చేలా ఒక్కొక్కరం ఒక్కో రంగు డ్రెస్ వేసుకోవడం అనేది ఓ తీపి గుర్తు. తర్వాత తర్వాత మనకు ఇండిపెండెన్స్ రావడానికి ఎందరి త్యాగం ఉందో తెలుసుకుని, వాళ్లందరి మీద గౌరవం పెరిగింది. అలాగే మనం ఇక్కడ క్షేమంగా ఉంటున్నామంటే సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల వల్లే. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సైనికా... సెల్యూట్’ అంటున్నాను.
→ సైనికుల త్యాగాల గురించి చెబుతుంటే నాకు యాంకర్ రష్మీ గుర్తొస్తున్నారు. ఆమె సోదరుడు ఆర్మీలో ఉన్నారు. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్న తన సోదరుడి గురించి ఇక్కడ వీరి కుటుంబం ఫీలింగ్స్‌ని స్వయంగా చూశాను. సోల్జర్స్ కుటుంబాలు పడే ఆవేదన, దేశ రక్షణలో తమ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉన్నారనే ఆనందం... ఇలా రెండు ఫీలింగ్స్ కనబడుతుంటాయి.
→ భవిష్యత్తులో మన పిల్లలు ఏ ఉద్యోగంలో స్థిరపడతారో చెప్పలేం. కానీ మా అబ్బాయితో మాత్రం ‘నిన్ను ఆర్మీలో చేర్పిస్తా’ అంటుంటాను. ఎందుకంటే వాడికి ఏ బొమ్మలూ నచ్చవు. అవి ఎంత పెద్దవైనా. వాటి పక్కన చిన్న గన్ ఉంటే చాలు... దాంతోనే ఆడుకుంటాడు. ఎక్కువగా అవే కొనుక్కుంటాడు. అందుకే మా అబ్బాయిలో నాకో సోల్జర్ కనబడుతుంటాడు.
అప్పుడు నేను నెహ్రూ
– శివ కందుకూరి
→ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తప్పనిసరిగా స్కూల్‌కి హాజరవ్వాలనే నియమం ఉంటుంది. రూల్ ఉందని కాదు... ఇష్టంగా వెళ్లేవాణ్ణి. ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ గుర్తుండిపోయే చిన్ననాటి జ్ఞాపకం. జెండా ఎగరేస్తుంటే సెల్యూట్ చేస్తూ, చూడటం నాకు చాలా హ్యాపీగా ఉండేది. అందుకే మిస్ కాకుండా స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. నా చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం నెహ్రూజీలా డ్రెసప్ అయ్యాను. అలా రెడీ అయి, వెళ్లడం నాకు గుర్తుంది. అప్పుడు దేశభక్తి పూర్తి అర్థం తెలియదు. అయితే ఇప్పుడు ఒక హీరోగా ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చేసే అవకాశం వస్తే... తప్పకుండా చేయాలని ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధుల గురించి మరోసారి గుర్తు చేసే అవకాశం ఉంటుంది కదా.
→ మామూలుగా మనం చదువుకుంటున్నప్పుడు దేశ, విదేశీయులు కూడా ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరుతుంటారు. అలా నేను అమెరికాలో చదువుకున్న యూనివర్సిటీలో పలు దేశాలవారిని కలిశాను. వాళ్ల దేశాల్లో ఉండే నియమ నిబంధనలు విన్నప్పుడు ‘నా దేశం ఎంతో మెరుగ్గా ఉంది కదా’ అనిపించింది. ఒక ఫ్రీ కంట్రీలో బతుకుతున్నప్పుడు ఆ దేశానికి మనం విలువ ఇవ్వాలి. ఆ దేశం గురించి మనం గర్వపడాలి. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో కొన్ని దేశాల్లో హద్దులు హారిబుల్. అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... డ్రైవ్ చేయకూడదు వంటి నియమాలు చూసి, మగవాళ్ల ఆధిపత్య పోరు ఎంతలా ఉందీ అనిపించింది. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఆ నియమాల్లో కాస్త వెసులుబాటు వచ్చిందనుకోండి.
→ నేను యూఎస్‌లో ఓ పదేళ్ల పాటు ఉన్నాను. ట్రాన్సిల్‌వేనియాలో ఉన్న ‘ఇండియన్ అసోసియేషన్’ వారు 2013లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆరంభించారు. ఆ వేడుకల్లో రెండుసార్లు జెండా ఎగరేసే అదృష్టం నాకు దక్కింది. విదేశీ గడ్డ మీద మన మాతృదేశం జెండా ఎగరేయడం అనే ఫీలింగ్ మాటలకు అందనిది. పైగా మన భారతీయులు విదేశీ గడ్డపై ఐకమత్యంతో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం అనేది నాకు బాగా అనిపించింది. నా మూలాల మీద నాకు మరింత ప్రేమ పెరిగేలా చేసింది.