
టాలీవుడ్‌లో 'పూర్ణ'గా గుర్తింపు తెచ్చుకున్న 'షమ్నా కాసిమ్' మరోసారి అమ్మ కాబోతుంది. తను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపుతో పాటు భారీ ఛాన్సులు దక్కాయి.
దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు ఆమె ప్రకటిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా కుటుంబంలోకి మరోకరు రానున్నారు. మనం ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని జీవించడం అనే కల నా లైఫ్‌లో నిజమైంది. కానీ, తల్లిదండ్రులు కావడం అన్నింటికంటే అందమైన అధ్యాయం. మేము మా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నాం.
ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల కోసం మేము వేచి ఉండలేము. కొత్త నవ్వులు, చిన్ని అడుగుజాడలు మా జీవితాల్లోకి రానున్నాయి.' అంటూ పూర్ణ పంచుకుంది. 2026లో తను రెండో బిడ్డకు జన్మనిస్తానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తన మొదటి కుమారుడితో పలు ఫోటోలు పంచుకుని తెలిపింది. పూర్ణ మొదట్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించి మెప్పించింది.
పూర్ణ గురించి ఆమె భర్త ఇలా పోస్ట్ చేశారు
సరిగ్గా రెండురోజుల క్రితం పూర్ణ గురించి ఆమె భర్త ఇలా చెప్పాడు. తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగానే పూర్ణ గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని. ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు.