
భారతదేశంలో క్రికెట్ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదు.. ఇదొక మతం లాంటిది. క్రికెటర్లును దేవుళ్లుగా భావించే అభిమానులూ కోకొల్లలు. తరతరాలుగా తమ అద్భుత నైపుణ్యాలు, క్రమశిక్షణ, నాయకత్వ పటిమతో భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు.
అయితే, వీరిలో కొందరు మాత్రం కేవలం ఆటకే పరిమితం కాకుండా.. తమ దేశభక్తిని చాటుకుంటూ.. సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతూ.. సానుకూల దృక్పథాన్ని పెంపొందించాడనికి నడుం బిగించారు.
ఇలా సమాజంపై తమదైన ముద్ర వేసిన భారత క్రికెట్ దిగ్గజాలను భారత ఆర్మీ గౌరవ మిలిటరీ ర్యాంకులతో సమున్నంతగా గౌరవించింది. కేవలం ఆటల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. దేశ సేవలోనూ నేరుగా భాగమయ్యే భాగ్యం కల్పించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్మీ నుంచి గౌరవ ర్యాంకులు అందుకున్న క్రికెటర్లు ఎవరో తెలుకుందామా!!

సీకే నాయుడు
టీమిండియా మొట్టమొదటి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు. భారత క్రికెట్ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయం. 1923లో హోల్కర్ స్టేట్ పాలకుడు సీకే నాయుడుని కల్నల్ హోదాలో నియమించారు. భారత జట్టు తమ మొట్టమొదటి అధికారిక టెస్టు ఆడే కంటే ముందే ఈ నియామకం జరిగింది.
ఇక 1932లో టీమిండియా ఆడిన తొలి టెస్టుకు సీకే నాయుడు నాయకుడు. తన అద్భుత ఆట తీరు, దేశభక్తి ద్వారా స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.

హేము అధికారి
సైన్యంలో పనిచేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో హేము అధికారి ముందు వరుసలో ఉంటారు. ఆటగాడిగా కొనసాగుతూనే మిలిటరీలోనూ సేవలు అందించిన ఘనత ఆయన సొంతం. తన ప్రతిభతో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరిన హేము అధికారి.. యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూనే సైన్యంలో తన విధులు నిర్వర్తించారు.
ఇక 1971లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం కావడంలో హేము అధికారిది కీలక పాత్ర. ఇటు క్రికెటర్‌గా రాణిస్తూనే.. అటు సైన్యంలోనూ హేము అధికారి తన భూమికను చక్కగా పోషించారు.

కపిల్ దేవ్
టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్. 1983లో ఆయన సారథ్యంలోని భారత్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి అద్భుతమే చేసి.. ప్రపంచ క్రికెట్‌లో తన ఆగమనాన్ని చాటింది.
కాగా 2008లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో భారత సైన్యం కపిల్ దేవ్‌కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఈ హర్యానా హారికేన్‌ను ఈ విధంగా సత్కరించింది. మిలిటరీ సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ త్రివిధ దళాలకు కపిల్ మద్దతుగా నిలిచేవాడు.

సచిన్ టెండుల్కర్
‘క్రికెట్ దేవుడు’గా కీర్తింపబడుతున్న సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అంతేకాదు.. వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు.
ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్.. క్రికెట్‌లో భారత్‌కు ఐకాన్‌గా మారాడు. ఈ క్రమంలో భారత ఆర్మీ సచిన్ సేవలకు గుర్తింపుగా.. 2010లో భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ హోదాతో సత్కరించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఈ గౌరవం పొందిన మొదటి ఆటగాడు సచిన్ కావడం గమనార్హం.

మహేంద్ర సింగ్ ధోని
భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మైదానంలో కూల్‌గా ఉంటూనే.. తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో దిట్ట. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు .. 2011లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌నూ ధోని గెలిచాడు.
ఆ తర్వాత 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ను విజేతగా నిలిపాడు ధోని. ఈ క్రమంలో ఈ జార్ఖండ్ డైనమైట్‌కు 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మిలిటరీ శిక్షణ తీసుకోవడంతో పాటు కీలక సమయాల్లో సైన్యానికి మద్దతుగా నిలబడటంలో ధోని ముందే ఉంటాడు.
వీరు కూడా..
వీరితో పాటు సునిల్ గావస్కర్, వినూ మన్కడ్, విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి , దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందారు.
సైన్యంలో చేరిన తర్వాతే క్రికెటర్‌గా వినూ మన్కడ్?
లెఫ్టినెంట్ కల్నల్‌గా గావస్కర్ గౌరవం పొందగా.. క్రికెట్‌లో అడుగుపెట్టే ముందే వినూ మన్కడ్ సైన్యంలో చేరాడు. ఇక విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు.