
న్యూజిలాండ్ క్రికెట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ సామ్ వెల్స్ అనూహ్యంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ పరివర్తన దశలో (టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ రిటైర్మెంట్, లాంగ్ స్టాండింగ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తప్పుకున్న తర్వాత) ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టిన వెల్స్.. వ్యక్తిగత కారణాల చేత చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.

వెల్స్ గతేడాది గాల్లావే కుక్ అలన్ అనే డునెడిన్ లా ఫర్మ్ పార్ట్‌నర్‌గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి జోడు పదవులను బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. అందుకే న్యూజిలాండ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చాడు. వెల్స్ రెండేళ్ల కిందట న్యూజిలాండ్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఇప్పుడున్న న్యూజిలాండ్ జట్టును షేప్ చేయడంలో 41 ఏళ్ల వెల్స్ కీలకపాత్ర పోషించాడు. అతడు ఎంపిక చేసిన జట్టుతోనే న్యూజిలాండ్ భారత్‌ను వారి సొంతగడ్డపై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రన్నరప్‌గా నిలిచింది. వెల్స్ ఆకస్మికంగా తప్పుకోవడంతో న్యూజిలాండ్ క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్ అన్వేషణలో పడింది.
ఆ జట్టు త్వరలో స్వదేశంలో చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లకు సమతూకమైన జట్టును ఎంపిక చేయడం కొత్త చీఫ్ సెలెక్టర్‌కు కత్తి మీద సామే అవుతుంది. ఇటీవలే జింబాబ్వేను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ జట్టు 5-6 వారాలు విశ్రాంతి తీసుకుంటుంది.
అనంతరం అక్టోబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దీని తర్వాత స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో 3 టీ20, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. అనంతరం స్వదేశంలోనే విండీస్‌తో మరో సిరీస్‌లో పాల్గొంటుంది.