
పార్లమెంటు క్యాంటీన్‌లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసా..!. ఎప్పుడైనా దీని గురించి విన్నారా అంటే..చాలామందికి తెలియదనే చెప్పాలి. అధికారులు, శాసనసభ్యులు, మహామహారథులు ఉండే ఆ శాసనసభలో వారికి మంచి విలాసవంతమైన భోజనమే క్యాంటిన్‌లో ఉంటుదనేది వాస్తవమే. కానీ ఈసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది పార్లమెంట్. అక్కడ క్యాంటీన్ మెనూలో ఎలాంటి వంటకాలు చేర్చారంటే..
మంచి రుచికరమైన థాలిస్, కూరలను అందిచిన పార్లమెంట్ క్యాంటీన్ ఇటీవలే దాని మెనూని సరికొత్త వంటకాలతో మార్పులు చేసింది. ఇదివరకటిలా నెయ్యి, నూనెతో కూడిన భారీ భోజనాలకు స్వస్తి చెప్పేసేలా ఓ ముందడుగు వేసింది. ఆ వంటకాల స్థానంలో.. సుదీర్ఘ గంటలు పనిచేసే శాసనసభ్యుల్లో ఉత్సాహం నింపేలా, జోవర్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీలు, శక్తిమంతమైన సలాడ్‌లు, కాల్చిన చేపలు సర్వ్ చేయనుంది. దీన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.
మెనూలో రుచి, పోషకాహారాన్ని కోల్పోకుండా ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంతేగాదు ఇక్కడ అందించే ఫుడ్ పోషకాహార నిపుణుల మార్గదర్వకత్వంలో జాతీయ ఆరోగ్య ప్రచారానికి అనుగుణంగా ఉంటుందట. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి ఆరోగ్యప్రదాయకమైన వంటకాలతో సమతుల్య ఆహారానికే పెద్దపీట వేసేలా అందించనుంది. ఈ విభిన్న రుచులకు అనుగుణంగా ప్రతి వంటకం పక్కన కేలరీ ట్యాగ్‌ని కూడా ఇస్తారట. ఈ విధానం జాగ్రత్తగా తినడాన్ని ప్రోత్సహిస్తుందట.
ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత అల్పాహార వంటకాల నుంచి 270 కిలో కేలరీలతో నిండిన సాంబార్‌తో రాగి ఇడ్లీ, 206 కిలో కేలరీలతో కూడిన జోవర్ ఉప్మా, మూంగ్ పప్పు చిల్, చనా చాట్, ఉడికించిన కూరగాయలు (157 కిలో కేలరీలు) ఉండగా, మాంసాహార ప్రియుల కోసం గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్‌లను సర్వ్ చేయనుంది.
ఎంపీలు (పార్లమెంటు సభ్యులు) ఇప్పుడు ఇక స్నాక్స్, పానీయాల కోసం..గార్డెన్‌లో పండిన తాజా పండ్ల సలాడ్‌లు(113 కిలో కేలరీలు), క్లియర్ సూప్, కాల్చిన టమోటా, తులిసి షోర్బాల వంటి జ్యూస్‌లు సిప్ చేయొచ్చు. అలాగే భోజనాన్ని చివరగా తీపి పదార్థం ముగించేలా మిక్స్ మిల్లెట్ ఖీర్ కూడా అందించనున్నారు. సుదీర్ఘ గంటలు పనిచేసే నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆరోగ్యదాయకంగా రూపొందించారు ఈ మెనూని.
2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం ప్రకటించి..చిరు ధాన్యాలకు భారీ ప్రచారం లభించింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంటులో మెనూలో ఈ సరికొత్త మార్పులు చేశారు. అలాగే శరీరం రోజువారీ అవసరాలను తీర్చడానికి పిండి పదార్థాలు, కేలరీలు, సోడియం తక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా మెనూని చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారు. పని చేసే అధికారులలో ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు వంటి ఆందోళనలకు చెక్ పెట్టేలా ఈ మెనూని అత్యంత ఆరోగ్యదాయకంగా రూపొందించడం విశేషం.
(చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..)