
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరంలో ఏకాదశి తిథి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిథి పురస్కరించుకుని క్రమం తప్పకుండా శ్రీ మందిరం శిఖరాన నీల చక్రం ప్రాంగణంలో మహా దీప హారతి నిర్వహిస్తారు. రథ యాత్రలో పవిత్ర ఏకాదశి నాడు అత్యంత ఆకర్షణీయమైన స్వర్ణాలంకార దర్శనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులకు శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ఆలయ శిఖరంపై మహా దీప దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. స్వర్ణ అలంకార దర్శనం కొనసాగుతుండగా మహాదీప హారతి నిర్వహిస్తారు. దీనితో యాత్రకు తరలి వచ్చిన అశేష భక్తజనం ఆలయ శిఖరంపై మహా దీప హారతి కనులారా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం పొందుతారు.
వెండి కలశాల్లో హారతి
మహా దీప హారతి కోసం 3 వెండి కలశాలు సిద్ధం చేస్తారు. వీటిని నెయ్యితో నింపుతారు. అరటి నారతో దీపం ఒత్తులు వినియోగిస్తారు. అరటి నారకు కొత్త బట్టను చుట్టి బలపరుస్తారు. తెల్ల రంగు వస్త్రం వినియోగిస్తారు. ఇలా సిద్ధం చేసిన మహా దీపాన్ని తొలుత శ్రీ జగన్నాథుని ముందు ద్యోతకం చేసిన తర్వాత, ఆలయం పైకి ఎత్తుతారు.
జగన్నాథునికి పానకం నివేదన
ఏటా పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా రథాలపై దేవుళ్లకు పానకం సమరి్పస్తారు. చీకటి పడ్డాక ఈ సేవ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ప్రత్యేక మట్టి పాత్రల్లో పానకం నింపుతారు. మూల విరాట్ల పెదవుల ఎత్తు వరకు ఈ పాత్రలు తయారు చేస్తారు. వీటి నిండా సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పానకం పోసి రథాలపై తెరచాటున గోప్యంగా నివేదించడం ఆచారం. ఈ సమగ్ర ప్రక్రియను ఒధొరొ పొణ సేవగా పేర్కొంటారు. రథాలపై ప్రధాన విగ్రహాల ఎదురుగా మట్టి పాత్రల్ని నిలిపి ఒధొరొ పొణ సేవ నిర్వహిస్తారు. స్వామికి పానకం నివేదించడం పూర్తయ్యాక పాత్రలు పగల గొట్టడంతో రథాల పైనుంచి పాణకం పొరలుతుంది. రథాల పైనుంచి పార్శ్వ దేవతల మీదుగా నేలకు ఈ పానకం జారుతుంది. ఇలా జారిన పానకం పార్శ్వ దేవతలు, అశరీర జీవులు సేవించి మోక్షం పొందుతారని విశ్వాసం. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి పురస్కరించుకుని సోమవారం ఈ సేవ జరిగింది.
దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ
జయపురం: చైతన్యమందిరం నుంచి శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్రలతో ఉన్న పెద్ద రథం, పతిత పావనుడు ఉన్న చిన్న రథాలు రాత్రి 8.00 గంటలకు రథొపొడియ వద్దకు చేరాయి. దాదాపు రాత్రి పదకొండు వరకు భక్తుల పూజలు అందుకున్న దేవతా మూర్తులను జగన్నాథ ఆలయానికి తీసుకు వచ్చారు. లక్ష్మీదేవి అనుమతితో గర్భగుడిలోకి వెళ్లాక స్వర్ణాలంకరణ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ విభాగ అదనపు తహసీల్దార్ చిత్త రంజన్ పటా్నయిక్, జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్,జ యపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్‌లతో పాటు దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు.
