అందానికి ఆక్సిజన్‌... | Oxygen facials enhance blood flow to the skin | Sakshi
Sakshi News home page

అందానికి ఆక్సిజన్‌...

Jul 18 2026 6:11 AM | Updated on Jul 18 2026 6:11 AM

Oxygen facials enhance blood flow to the skin

పార్లర్‌కి వెళ్ళడం... గంటలకొద్ది కూర్చొని ఫేషియల్స్‌ చేయించుకోవడం... ఇదంతా నిన్నటి మాట! ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ రూట్‌ మార్చింది.  క్రీములు, మసాజ్‌లతో పనిలేకుండా, కేవలం గాలితోనే ముఖాన్ని మెరిపించే ఒక అద్భుత టెక్నాలజీని తీసుకువచ్చింది. అదే ఆక్సిజన్‌ ఫేషియల్‌. డల్‌ స్కిన్ ను సైతం క్షణాల్లోనే హైడ్రేట్‌ చేసి... కొరియన్‌ గ్లాస్‌–స్కిన్‌లా మార్చే ఈ ఫేషియల్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిదా అవుతున్నారు.

సాధారణంగా మనం రెగ్యులర్‌గా చేయించుకునే ఫేషియల్స్‌లో చేతులతో మసాజ్‌ చేయడం, రకరకాల క్రీములు రాయడం చూస్తుంటాం. కానీ ఈ ఆక్సిజన్‌ ఫేషియల్‌ అందుకు పూర్తిగా భిన్నం. ఇది ఒక అధునాతన మెషిన్‌ ద్వారా చేసే ట్రీట్‌మెంట్‌. మన చర్మానికి అవసరమైన పోషకాల మిశ్రమం సిరమ్‌ని చర్మం పైపొరల్లోకి పంపిస్తారు. ఈ ప్రెజర్‌ డెలివరీ వల్ల చర్మం లోపలి భాగం వరకు పోషకాలు వేగంగా చొచ్చుకుపోతాయి.

ముప్పై నిమిషాల్లో...
ఈ ఆక్సిజన్‌ ఫేషియల్‌ ప్రక్రియ ఎలాంటి నొప్పి లేకుండా, కేవలం 30 నుంచి 60 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులో భాగంగా మొదటగా క్లెన్సింగ్‌ చేస్తారు. అంటే ముఖంపై ఎలాంటి కెమికల్స్‌ లేకుండా క్లీన్‌ చేసి, డెడ్‌ స్కిన్ ను తొలగిస్తారు. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, పోషకాలను గ్రహించడానికి సిద్ధమవుతాయి. 
ఆ తరువాత చర్మ తత్వాన్ని బట్టి ఒక పవర్‌హౌస్‌ సిరమ్‌ను అప్లై చేస్తారు. మూడవ దశలో ఒక చిన్న వాండ్‌ లాంటి పరికరంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ప్రెజర్‌తో ముఖంపై స్ప్రే చేస్తారు. ఇది చర్మానికి చల్లని గాలి తగిలినట్లు హాయిగా అనిపిస్తూ, సిరమ్‌ను లోపలికి పంపుతుంది.

తక్షణ మెరుపు
ఈ ఆక్సిజన్‌ ఫేషియల్‌ వల్ల చర్మానికి క్షణాల్లో తేమ అంది, డ్రై స్కిన్‌ మృదువుగా మారుతుంది. గాలిని ప్రెజర్‌తో పంపించడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరిగి చర్మంలో తక్షణమే మెరుపువస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా చర్మాన్ని టైట్‌ చేయడం వల్ల ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు తాత్కాలికంగా తగ్గుతాయి. అలాగే ఆక్సిజన్‌కు ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాల వల్ల మొటిమలు, మంట తగ్గుతాయి. అంతే కాకుండా మిగతా ఫేషియల్‌ల వలే దీని వల్ల చర్మం ఎర్రబడటం అనేది ఉండదు. ఫేషియల్‌ అవ్వగానే మేకప్‌ వేసుకుని రెడీ అయిపోవచ్చు.

ఎవరికి అవసరం?
బిజీ లైఫ్‌స్టైల్, నిద్రలేమి, కాలుష్యం వల్ల ముఖం కాంతివిహీనంగా మారిన వారికి ఈ ఆక్సిజన్‌ ఫేషియల్‌ ఒక వరం లాంటిది. అలాగే పెళ్ళి కూతుళ్ళు, పార్టీలకు వెళ్లేవారు ఈవెంట్‌కు ఒకటి రెండు రోజుల ముందు ఇది చేయించుకుంటే మేకప్‌ చాలా సహజంగా, అందంగా కుదురుతుంది. సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని చేయించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement