టేలర్ కోవెన్, ప్రఖర్ గుప్తా
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్‌కాస్ట్‌లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:
సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!
ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్‌లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.
వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’
నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.
పిల్లలు వద్దనుకుంటున్నారు!
విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.
ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!
ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్‌వేర్ అప్ డేట్‌లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.
‘మనసున మనసై’తేనే విలువ
ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్


