breaking news
facial expression
-
ప్రసన్న వదనం
ప్రపంచంలోని అత్యంత విలువైన ఆస్తి ఏదంటే, అది అపారమైన ధనరాశులు కాదు, తిరుగులేని అధికార పీఠం కాదు; అది మన ముఖంలో నిరంతరం వెలిగే ప్రసన్నత. ‘ముఖంలో ప్రసన్నతతో కీర్తి లభిస్తుంది. కీర్తి వృద్ధి చెందడం వల్ల సుఖాలు అనుభవిస్తారు. ప్రసన్నత లేని వారిని సజ్జనులు ఇష్టపడరు. కాబట్టి, ముఖ ప్రసన్నతే గొప్ప సంపద’.నేటి ఆధునిక, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, అంతరంగిక ఆనందం కొరవడుతున్న ఈ తరుణంలో, ఈ ప్రసన్న వదనం ఒక దివ్యౌషధంగా పనిచేస్తూ, అంతరాత్మ అపురూపమైన ప్రతిబింబంగా ప్రకాశిస్తుంది. ఇది కేవలం పెదవుల వంపు మాత్రమే కాదు, మన అంతర్గత శాంతికి, ఎదుటివారి పట్ల మనకున్న నిష్కల్మషమైన ఆదరణకు, మన అజేయమైన స్థితప్రజ్ఞతకు దేదీప్యమానమైన ప్రతీక.మానవ సంబంధాలలో అత్యంత శక్తిమంతమైన, అత్యంత సులభమైన సామరస్య సాధనం ఏదైనా ఉందంటే అది చిరునవ్వే. మాటలు లేకున్నా, భాష తెలియకున్నా, ఒక నిర్మలమైన చిరునవ్వు వేల భావాలను పలకగలదు. ఇది మౌనంగా వినిపించే మధుర గీతం లాంటిది. ఈ చిరునవ్వు మనస్సులోని మంచితనాన్ని, స్వచ్ఛమైన అంగీకారాన్ని నిస్సందేహంగా వ్యక్తీకరిస్తుంది. అది హృదయాలను అద్భుతంగా కలుపుతుంది, అపరిచితులను ఆత్మీయులుగా మారుస్తుంది, బంధాలను పటిష్టంగా దృఢపరుస్తుంది. చిరునవ్వు అనేది సార్వత్రిక భాషకు తిరుగులేని తాళం చెవి.దానికి సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక భేదాలు ఏవీ అడ్డుకావు. చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప నాయకులు తమ ప్రశాంతమైన ప్రసన్న వదనంతోనే కోట్లాదిమందిలో నమ్మకాన్ని, భరోసాను నింపారు. ఉదాహరణకు, మహాత్మా గాంధీ తన మౌనంలో సైతం చిరునవ్వుతో పలికే స్థితప్రజ్ఞత, లక్షలాది మందికి స్వాతంత్య్రపోరాటంలో అపారమైన ధైర్యాన్నిచ్చింది. అలాగే, మదర్ థెరిసా అందించిన నిస్వార్థ, నిర్మలమైన చిరునవ్వు, నిరాశ్రయులలో సైతం ఆశావాదాన్ని, జీవితేచ్ఛను ఉత్తేజపరిచింది. ఈ ఉదాహరణలు చిరునవ్వుకు ఉండే అంతర్గత శక్తిని, అది సంక్షోభ సమయాల్లోనూ ఎలా స్థైర్యాన్ని, భరోసాను ఇస్తుందో విశదీకరిస్తాయి.చిరునవ్వు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల విప్లవాన్ని సృష్టిస్తుంది.ఇది మెదడులో ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపించడం ద్వారా సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అలాగే, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ స్థాయులను నియంత్రించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వత్తి జీవితంలోనూ, వ్యక్తిగత సంబంధాలలోనూ చిరునవ్వు ఒక అద్భుతమైన మానసిక ఆయుధం. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో, అత్యంత క్లిష్టమైన చర్చల్లో చిరునవ్వుతో పలకరించే నాయకుడు కేవలం నమ్మకాన్ని పొందడమే కాక, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను, విజయవంతమైన సహకారాలను నిర్మించగలరు. మనస్పర్ధలు వచ్చినప్పుడు, కోపానికి బదులు చిరునవ్వుతో కూడిన సున్నిత సంభాషణ, బంధాలను తెగిపోకుండా అత్యంత సమర్థంగా నిలుపుతుంది.ఆనందంలో చిరునవ్వు సహజం, కానీ కష్టాల్లోనూ, సవాళ్లలోనూ చిరునవ్వును దాల్చడం మన అజేయమైన అంతర్గత స్థైర్యానికి పరాకాష్ఠ. చిరునవ్వు కేవలం పెదవుల యాంత్రిక కదలిక కాదు, అది హదయం నుండి వచ్చే ఒక సుమధుర స్పర్శ. అది అహంకారాన్ని తగ్గిస్తుంది, సహానుభూతిని పరిపూర్ణం చేస్తుంది. చిరునవ్వు లేని జీవితం, రంగులు లేని నిస్తేజమైన చిత్రం లాంటిది. ప్రతి మనిషిలో దాగి ఉన్న దైవిక సంపద ఈ చిరునవ్వు.ప్రతిరోజూ మన ఈ చిరునవ్వును ఇతరులతో దాతత్వంతో పంచుకోవడం ద్వారా మనం కేవలం మన బంధాలనే కాదు, సమాజాన్ని కూడా ప్రేమ, సామరస్యపు వారధిగా రూపుదిద్దగలం. చిరునవ్వును మీ ఆదర్శ జీవన శైలికి మార్గదర్శక దీపంగా మార్చుకుందాం. ఇది ద్వేషాన్ని, అపనమ్మకాన్ని సమర్థంగా దూరం చేసి, స్నేహాన్ని, విశ్వాసాన్ని సుస్థిరం చేస్తుంది. చిరునవ్వుతో కూడిన సజీవనం, ప్రతి మనిషిని ఈ లోకంలో ఒక తేజోవంతమైన ఆశా కిరణంగా మారుస్తుంది. ప్రసన్న వదనం ఈ జగత్తుపై చెరగని సంతకం, తరాలు దాటి పలికే దివ్య సందేశం. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
గొర్రెల బాధను తెలుసుకునేందుకు....
కాలిఫోర్నియా: మనుషుల్లో బాధను వ్యక్తం చేయడానికి హావభావాలతోపాటు మాటలు ఉంటాయి. మాటలురాని మూగ జంతువులు తాము అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తం చేస్తాయి? వాటి అరుపులు, ముఖ హావాభావాల్లో వచ్చే తేడాను బట్టి వాటి బాధను అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరుగుతున్నది అదే. గొర్రెలాంటి మూగజీవుల ముఖాల భావాలను బట్టి వాటి శారీరక బాధను గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కృత్రిమ మేథస్సును సృష్టించారు. శారీరక బాధను అనుభవిస్తున్నప్పుడు గొర్రె కళ్లు చిన్నగా ముడుచుకుపోతాయి. చెక్కిళ్లు గట్టిగా బిగుసుకుంటాయి. చెవులు ముందుకు ముడుచుకుపోతాయి. పెదవులు కిందకు వచ్చి వెనక్కి బిగుసుకుంటాయి. ముక్కు రంధ్రాలు ‘వీ’ ఆకారంలోకి మారుతాయి. ఈ ఐదు మార్పుల ద్వారా వాటిని బాధను అర్థం చేసుకోవచ్చు. సాధారణ గొర్రె ముఖాలతో ఈ ఐదు రకాల మార్పులను పోల్చి వాటిని బాధను కృత్రిమ మేథస్సు గుర్తిస్తుంటుంది. బాధ తీవ్రతను కూడా తెలియజేయగలదు. కెమేరా ముందు గొర్రె ముఖాలున్నప్పుడు వాటి బాధను ఫొటోల ద్వారా ఏఐ గుర్తించవచ్చు. మరి పక్కకో, వెనక్కో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? అదే అంశంపై ఇప్పుడు పరిశోధకులు దృష్టిని సారించారు. ఈ పరిశోధనల్లో కూడా విజయం సాధిస్తే గొర్రెల బాధను త్వరగా గుర్తించి వాటిని పశువైద్య శాలలకు తీసుకెళ్లడానికి వీలవుతుంది.


