ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు.
కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?
గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్‌కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.
రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.
ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.


