World Music Day నాదమే జీవనం | Music directors Srilekha, Anoop Rubens and Sricharan Pakala special story | Sakshi
Sakshi News home page

World Music Day నాదమే జీవనం

Jun 21 2025 6:02 AM | Updated on Jun 21 2025 10:00 AM

Music directors Srilekha, Anoop Rubens and Sricharan Pakala special story

నేడు వరల్డ్‌ మ్యూజిక్‌ డే

కోయిల ఊరికే ఉండదు... పాడుతుంది. గాలి కూడా కామ్‌గా కూర్చోదు... సవ్వడి చేస్తుంది. వినాలే గానీ... కిటికీ పరదా చప్పుడు కూడా సంగీతమే!  ఆనందమో, చిరు సంతోషమో కలిగినప్పుడు... ప్రతి గొంతూ కూని రాగం తీస్తుంది. సంగీతం లేకపోతే... ఈ జగతి ఉత్త శూన్యం. సప్త స్వరాలే... ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’ సందర్భంగా  ఒక పాటకో, ఒక గళానికో, ఒక స్వరానికో కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలా..? నాదమే జీవనంగా బతుకుతున్న నలుగుర్ని కలవకపోతే ఎలా..!

ఊపిరి ఉన్నంతవరకూ పాటే నా ప్రపంచం
– సంగీతదర్శకురాలు శ్రీలేఖ
→ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ సంగీతాన్ని ఆస్వాదిస్తాను... ఆనందిస్తాను. ఊపిరి ఉన్నంతవరకు పాటలతో సెలబ్రేట్‌ చేసుకుంటాను. పాటే నా ప్రపంచం. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సంగీతాన్ని రోజూ ఇష్టపడుతున్నప్పటికీ ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’ సందర్భంగా నాకు నచ్చిన పాటలను మరింత ఎక్కువగా వింటాను. నేను కంపోజ్‌ చేసిన పాటలను నెమరు వేసుకుంటాను... ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది... ఇలా రకరకాలుగా నా పాటలను విశ్లేషించుకుంటాను. 

→ అప్పట్లో లైవ్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ ఎక్కువగా ఉండేవి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌లు ఎక్కువగా కోరుకునేవారు కూడా. పాటలు కూడా అలాగే ఉండేవి. రికార్డింగ్, సాంగ్‌ రికార్డింగ్‌లో నేను కూడా లైవ్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ ఉపయోగించాను. వివిధ లైవ్‌ ఇన్‌స్ట్రూమెంట్లతో హాల్‌ మొత్తం సందడిగా, పండగ వాతావరణంతో ఉండేది. ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది. ఎవరికి వారు బిజీ కావడం, లైవ్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ రిక్వైర్డ్‌ సాంగ్స్‌ రాకపోవడం, డీజే టైప్‌ పాటలు, రెట్రో, హిప్‌ హాప్‌లాంటివి వచ్చి లైవ్‌ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ అవసరం ఉన్నా ఎక్కడున్న వారు అక్కడ, ఎవరికి టైమ్‌ ఉన్నప్పుడు వారు పాడి, వాయించి పంపుతున్నారు. వాటిని తరువాత మిక్స్‌ చేస్తున్నారు. అంతా డిజిటలైజ్డ్‌ అయిపోయింది. ఇది ఎంతవరకు వెళుతుందో మాత్రం తెలియదు. 

→ ఫుల్‌ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు సాంగ్‌ స్ట్రక్చర్‌ ఇలా రాబోతుందని తెలిసేది. ఎందుకంటే సింగర్స్‌తో సహా లైవ్‌ ఉండేది. స్ట్రక్చర్‌ గురించి ఇప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌కే తెలియడం లేదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, పల్లవి ఒకరు చేస్తారు...  బీజియమ్‌ ఒకరు చేస్తారు. ఫైనల్‌ వచ్చే వరకు కూడా సాంగ్‌ ఎలా వస్తుంది? అనేది మ్యూజిక్‌ డైరెక్టర్‌కి తెలియడం లేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే అదొక తతంగం. సో... సాంకేతిక అభివృద్ధి పరంగా మైనస్‌ ఉంది. కాకపోతే పని గంటలు తగ్గుతాయి. అలాంటి ప్లస్‌లూ ఉన్నాయి. 

→ సీనియర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరితోనూ బాగుంటాను. కోటిగారు, వందేమాతరం శ్రీనివాస్‌గారు, కీరవాణి అన్నయ్య, మణిశర్మగారు... ఇలా ఎంతోమంది చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఉన్నారు కాబట్టి, అందరికీ నేను పెట్‌. అందరూ నన్ను అభిమానిస్తారు. 

→ నా సినిమాల్లో నాకు సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు  ‘ధర్మచక్రం, తాజ్‌మహల్, ప్రేమించు, ప్రేయసి రావే, శివయ్య’ వంటివి.  మొన్న వచ్చిన ‘హిట్‌–2’లో ‘ఉరికే ఉరికే’ సాంగ్‌ బ్లాక్‌ బస్టర్‌. నా కెరీర్‌లో ఎక్కువగా మంచి సినిమాలకు పని చేసే చాన్స్‌ రావడం నా అదృష్టం. 
→ ఏఐ (కృత్రిమ మేధ) గురించి విన్నాను. ఎంత ఏఐ వాడినా, ఎలా చేసినా తెలిసిపోతుంది. హ్యూమన్‌ ఎమోషన్‌ ఏఐ ఇవ్వలేదు. మనిషి కంపోజ్‌ చేసి ఇచ్చినంత ఏఐ ఇవ్వలేదు. 

→ సినిమా రంగంలో రావడానికి నేను వచ్చిన టైమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరింత కష్టం అయింది. ఎంతోమంది డైరెక్టర్స్, సింగర్స్, కంపోజర్స్‌ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడాలి. ఇక మనం ఏ స్థాయికి వెళతామనేది అది మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. 

→ నేను సినిమా ఒప్పుకోవడానికి మూడు విషయాల గురించి ఆలోచిస్తాను. మొదటిది కథ. జనరల్‌గా కథే కదా హీరో. కథ ఎలా ఉంది, ఏ జానర్‌లో ఉంది, డైరెక్టర్‌ ఫ్యాషనేట్‌గా తీయగలరా? ప్రాపర్‌గా రిలీజ్‌ చేయగలరా? వీటి గురించి ఆలోచిస్తాను.  

→ మహిళలు, పురుషులు అని కాదు... సినిమా ఫీల్డ్‌లోకి రావాలంటే ఎవరికైనా అది అంత తేలికైన విషయం కాదు. కమర్షియల్‌ ఫీల్డ్‌ కాబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించాలి, చాలా టాస్క్‌లు ఉంటాయి. దేవుడి దయ వల్ల ఆ టాస్క్‌లన్నీ దాటుకొని ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను.
– డి.జి. భవాని

మనసుని తాకాలంటేమెలోడీ బెస్ట్‌
– సంగీతదర్శకుడు అనూప్‌ రూబెన్స్‌
→ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్‌ 21న వరల్డ్‌ వైడ్‌గా జరుపుకుంటారు. మనకు కూడా ఇక్కడ మ్యూజిక్‌ డే సెలబ్రేషన్స్‌ని చేస్తుంటారు. కానీ, నాకైతే ప్రతి రోజూ సంగీత దినోత్సవమే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకూ సంగీతంతోనే ఉంటాను కాబట్టి. 

→ సంగీతంలో అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీ వైజ్, వర్కింగ్‌ వైజ్‌ చాలా మార్పులొచ్చాయి. మ్యూజిక్‌ ఎప్పుడూ మెలోడీ వైజ్‌ మెలోడీనే ఉంటుంది... దాన్ని ఏదీ రీ ప్లేస్‌ చేయలేదు. గతంలో లైవ్‌లో అందరం ఒకేసారి రికార్డ్‌ చేసేవాళ్లం. ఇప్పుడు బిట్‌ బిట్‌గా, సిస్టమ్‌ ద్వారా చేస్తున్నాం. ఒక పదం పదం పరంగా కూడా రికార్డింగ్‌ చేస్తున్నాం. అలాగే ఏఐ ద్వారా వాయిస్‌ మాడ్యులేషన్స్‌లో కూడా మార్పులొస్తున్నాయి.   

→ సాంకేతికంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందు రోజుల్లో లైవ్‌ రికార్డింగ్స్‌ ఉన్నప్పుడు ఒకటేసారి మొత్తం ఆర్కెస్ట్రా, సింగర్స్‌ అంతా కలిసి ఒక టేక్‌లో అయిపోయేది. అది ఒక రకంగా సులభంగా ఉండేది. ఎందుకంటే... గతంలో ఫ్లూట్‌ బిట్, వీణ బిట్, తబలా బిట్‌ ఇది... అని ఒక ప్రాపర్‌గా సెట్‌ చేసుకుని కంపోజ్‌ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్‌ వచ్చాయి. ఒక్కొక్క ట్యూన్‌ సెలక్షన్స్‌కే చాలా రోజులు పట్టేస్తోంది. అంటే ఎక్కువ ట్యూన్స్‌ ఎంచుకునే అవకాశం ఉండటంతో ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది, ఇంకా కొత్త ట్యూన్‌ దొరుకుతుంది అని. ఈ ప్రాసెస్‌  కొంచెం కాంప్లికేటెడ్‌. అయితే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యం ఏంటంటే టైమింగ్స్‌. సింగర్‌ లేదా మ్యుజిషియన్‌ టైమ్‌కి అందుబాటులో లేకున్నా, ఇతర దేశంలో ఉన్నా వారు పాడటం లేదా వాయించి పంపితే మేము ఇక్కడ యాడ్‌ చేస్తాం. ఒక రకంగా ఇది అడ్వాంటేజ్‌.  

→ ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌కి ఒక్కో శైలి ఉంటుంది. నా పరంగా వచ్చేసరికి నేనెప్పుడూ మెలోడీని ప్రేమిస్తాను. ఏ పాట కంపోజ్‌ చేసినా కూడా మెలోడీకి తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే మనకు సంగీతం అనగానే మొదట టచ్‌ అయ్యేది మనసు. మెలోడీయే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని బలంగా నమ్ముతాను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడూ మెలోడీయే. కానీ, కథ, సందర్భం, అవసరాన్ని బట్టి అక్కడ మాస్‌ సాంగ్‌ లేదా బీట్‌ సాంగ్‌ ఇస్తుంటాను. 

→ ఇప్పుడొస్తున్న యువ సంగీత దర్శకులు చాలా బాగా పని చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పోటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే..  ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యమైన స్టైల్స్, ఫీల్స్‌ వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏదో చేయాలి? అనే ఉత్సాహం ఉండాలి. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి.   

→ నా కెరీర్‌లో దాదాపు 90 సినిమాలు చేశాను. అయితే ఓ సంతృప్తి అనేది సినిమా విజయం వల్ల ఉంటుంది... కథ వల్ల ఉంటుంది. ఆ స్టోరీ జనాల్లోకి బాగా వెళ్లడం, మన పాటలు బాగా హిట్‌ అయితే అదో సంతృప్తి ఉంటుంది. నా సినిమాల్లో అలా సంతృప్తి ఇచ్చినవాటిలో ‘ప్రేమకావాలి, మనం, ఇష్క్, గోపాల గోపాల, టెంపర్‌’ వంటివి చాలా ఉన్నాయి.  

→ ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న సంగీత దర్శకులు, సింగర్స్‌లో చాలా మంచి ప్రతిభ ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్‌ మీడియా పరిధి బాగా పెరిగింది. దాని వల్ల స్టార్‌ వేల్యూ, పాపులారిటీ అన్నది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం అయింది. అయితే కొత్తవాళ్లకు అంకితభావం... ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. అప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టైమ్‌ ఉంటుంది... మన సమయం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం.  

→ ప్రస్తుతం ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తేజగారి చిత్రంతో పాటు అర్జున్‌గారి సినిమా చేస్తున్నాను. మరో ఐదారు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.

→ నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా సార్, ఏఆర్‌ రెహమాన్‌ సార్‌ పాటలు వింటూ పెరిగాను. వాళ్ల వర్కింగ్‌ స్టైల్, లైఫ్‌ స్టైల్‌.. చె΄్పాలంటే వాళ్లే నాకు స్ఫూర్తి. నాకే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా మంది సంగీత దర్శకులకు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా. నేను మాత్రం ఆర్‌డీ బర్మన్‌గారు, ఇళయరాజా సార్, ఏఆర్‌ రెహమాన్‌గారు.. వాళ్ల వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.

→ సినిమా ఒప్పుకోవాలంటే నా తొలి ప్రాధాన్యత కథే. అయితే కొన్నిసార్లు బ్యానర్, హీరో, డైరెక్టర్‌ వేల్యూ కూడా ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తవాళ్లు, కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ వాళ్లు నన్ను కలిస్తే మాత్రం ముందు కథ విని, నచ్చితే ఒప్పుకుంటాను.


– డేరంగుల జగన్‌ మోహన్‌

లైవ్‌ రికార్డింగ్‌లోడెప్త్‌ ఉంటుంది
    – సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల
→ సంగీత దర్శకుడిగా ప్రతిరోజునీ నా ఫస్ట్‌ డే మ్యూజిక్‌ డైరెక్షన్‌లానే భావిస్తాను. ప్రతిరోజూ ఓ స్ట్రగులే. అందుకే అప్‌గ్రేడ్‌ అవుతుంటాను. ప్రజలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని, కొత్త తరహా సంగీతాన్నందించాలన్నదే నా తపన. 

→ మనం ఆనందంలో ఉన్నప్పుడు పాట వింటాము. దుఃఖంగా ఉన్నప్పుడూ పాట వింటాము. మన భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మ్యూజిక్‌తో తెలియజేస్తాం. ఇలా పలు రకాలుగా సంగీతం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.  

→ దశాబ్ద కాలానికి పైగా సంగీతరంగంలో రాణిస్తున్నాను. ఈ రంగంలో టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతూ వస్తోంది. టెక్నాలజీని మనం ఎంత వరకు కరెక్ట్‌గా వాడాం అన్నది జాగ్రత్తగా గమనించుకుంటుంటే అడ్వాంటేజ్‌గానే ఉంటుంది. కొన్నిసార్లు డిస్‌అడ్వాంటేజ్‌ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడూ మిస్‌ కాకూడదు. మ్యూజిక్‌ అనేది హ్యూమన్‌ టచ్‌తో సంబంధం ఉన్న అంశం. అలాగే సంగీత దర్శకులకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం అన్నది చూసుకోవాలి. 

→ ఇండస్ట్రీలో ఉన్న పోటీతత్వాన్ని గమనిస్తుంటాను. ఫస్ట్‌ నాకు నేను పోటీగా ఉండాలనుకుంటాను. ఎంతమంది ఉన్నా కూడా మనకు మనం పోటీగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్లగలం. ఇండస్ట్రీలో సంగీతదర్శకుల మధ్య ఉండే పోటీని చూసి ఉలిక్కిపడను. నేను ఎదగడానికి ఏం చేయాలి అని చూస్తాను తప్ప పక్కన ఇంకెవరో వచ్చారని కంగారు పడను. 
→ డిజిటల్‌ సాయంతో మ్యూజిక్‌ చేయడం కొంతవరకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ లైవ్‌ రికార్డింగ్స్‌ అనేవి మాత్రం డెప్త్‌ క్రియేట్‌ చేస్తాయి. ఎంత చెప్పినా లైవ్‌ లైవే... దాంట్లో తిరుగులేదు. నేను గిటారిస్ట్‌ని. లైవ్‌ అంటే ఏంటో నాకు తెలుసు. ఎంత టెక్నాలజీ వాడినా కూడా లైవ్‌ అన్నది లైవే. డిజిటలైజ్‌ వల్ల పని సులభం అవ్వొచ్చు. కానీ లైవ్‌ రికార్డింగ్‌ అనేది మ్యూజిక్‌ను నిలబెడుతుంది.  

→ శ్రోతలకు లిరిక్స్‌ వినిపించేలా మనం సంగీతం ఇవ్వాలి. ఆ పాటకు లిరిక్స్‌ చాలా ముఖ్యమని, లిరిక్‌దే ప్రథమ స్థానమని భావిస్తాను. నా సినిమాల్లోని పాటల్లో లిరిక్స్‌ ఆడియన్స్‌కు వినిపించాలనే ప్రయత్నిస్తుంటాను. లిరిక్స్‌ ఆడియన్స్‌కు అర్థమైతే, అప్పుడు ఆ లిరిక్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ తరహా మ్యూజిక్‌ ఇచ్చాడని వారికి అర్థమౌతుంది. అదే లిరిక్‌ అర్థం కాకుండా మనం మ్యూజిక్‌ ఇస్తే ఎందుకు లిరిక్‌ అర్థం కావడం లేదనిపిస్తుంది. లిరిక్‌ అర్థమైనప్పుడే సినిమాలోని సందర్భం మ్యూజిక్‌తో ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతుంది. 

→ సినిమాలో సౌండ్‌ అనేది డిజైన్‌ చేసినప్పుడు ఫస్ట్‌ నుంచి లాస్ట్‌ వరకు ఒకే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉంటే మంచిది. ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వర్క్‌ చేసే విధానానికి నేను వ్యతిరేకిని. ఇది నా సొంత అభి్రపాయం. అయితే కొన్నిసార్లు ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వర్క్‌ చేసినప్పుడు అది వర్కౌట్‌ అయ్యింది. అలాంటప్పుడు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయాలని చెప్పడానికి నేనెవర్ని. కానీ... చేస్తే మొత్తం సినిమా చేయాలని నేను కోరుకుంటాను. ఈ విషయంపై నా స్టాండ్‌ ఏంటంటే... నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ సంగీత దర్శకుల్లో నేను ఒక భాగమే. ఎవరైనా వచ్చి, ఫలానా సినిమాలో ఒకే ఒక్క సాంగ్‌ చేయమన్నా చేస్తాను. 

→ మ్యూజిక్‌ రంగంలో స్థిరపడాలనుకునే కొత్త తరం వారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి డిసైడ్‌ అయితే వెనక్కి తిరిగి చూడొద్దు. నిత్యం కష్టపడాలి. ఫోకస్‌గా ఉండాలి. ప్రతిక్షణం మ్యూజిక్‌ పైనే ఫోకస్‌ పెట్టి పని చేయాలని చెబుతాను. 

→ వరల్డ్‌ మ్యూజిక్‌ డేని సెలబ్రేట్‌ చేసుకుంటాను. ఈ సందర్భంగా నా సహచర మ్యూజిషియన్స్‌ అందరికీ విషెస్‌ చెబుతున్నాను. అందరికీ అవకాశాలు రావాలని, అందరూ సక్సెస్‌ కావాలని, అందరూ ఎదగాలని కోరుకుంటాను. ప్రస్తుతం అడివి శేష్‌గారి ‘గూఢచారి 2, ఆది సాయికుమార్‌గారి ‘శంబాల’ సినిమాలు చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

→ నేను  సినిమా ఒప్పుకోవాలంటే కథను మాత్రమే చూస్తాను. అలాగే నేను ఉపయోగించే ఇన్‌స్ట్రూమెంట్స్‌ సినిమా టు సినిమా మారిపోతుంటాయి. కథ, ఆ సినిమా హీరో, ఆ హీరో బాడి  లాంగ్వేజ్‌ని బట్టి ఎలాంటి స్టైల్‌ క్రియేట్‌ చేయవచ్చు. డైరెక్టర్‌ ఏ విధమైన మ్యూజిక్‌ ఆశిస్తున్నారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్‌ చేస్తాను.  ∙‘మేజర్, నాంది, గూఢచారి, కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, డీజే టిల్లు’ వంటి చిత్రాలు ఓ సంగీతదర్శకుడిగా నా కెరీర్‌లో ఎక్కువ సంతృప్తినిచ్చాయి.  

– ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement