కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా? | A Motivational Short Story Written By Dr. Gollapinni Sitarama Sastry. | Sakshi
Sakshi News home page

కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?

Jun 18 2026 9:02 AM | Updated on Jun 18 2026 9:02 AM

A Motivational Short Story Written By Dr. Gollapinni Sitarama Sastry.

కథానీతి

ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.

ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. 

సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement