
ఆ కోతి పిల్ల ఇంటి సభ్యురాలు
హావేరి జిల్లాలో విడ్డూరం
దొడ్డబళ్లాపురం: అభిమానం పుట్టిందంటే కోతి కూడా ఇంటి సభ్యురాలు అవుతుంది. ప్రేమ కరువైతే ఇంటివారు కూడా పరాయి వారవుతారు. అలాంటిదే ఈ ఉదంతం. పెంపుడు కోతికి ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు చేయించాడో వ్యక్తి. హావేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకా కాకోళ గ్రామంలో చోటుచేసుకుంది.
కొత్త బట్టలు, కేక్ కటింగ్
గ్రామ నివాసి ప్రభుగౌడకు నాలుగేళ్ల క్రితం మగ కోతి పిల్ల దొరికింది. దాన్ని చేరదీసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పిల్లవాని మాదిరిగా అంగీ, నిక్కర్ తొడిగిస్తారు. కోతిపిల్ల దొరికిన ఏప్రిల్ 29 తేదీని దాని పుట్టినరోజుగా వేడుకలు చేస్తున్నారు.

కోతికి హనుమంతగౌడ అని పేరు కూడా పెట్టాడు. బర్త్ డే వేడుకలో హనుమంతగౌడకు కొత్త దుస్తులు వేశారు.

పెద్ద కేక్‌ను తెప్పించి కట్ చేయించారు. చుట్టుపక్కలవారిని పిలిచి కేక్, మిఠాయిలు పంచిపెట్టారు. చూసినవారందరూ వానరానిదే వైభవమని ఆశ్చర్య పోయారు. ఈ కోతిపిల్ల ఇంటికి వచ్చాక ఆర్థికంగా బాగా కలిసి వచ్చినట్టు ప్రభుగౌడ చెబుతున్నాడు. గ్రామంలో ఈ కోతి సెలబ్రిటీగా మారింది. పెళ్లి పేరంటాలకు ప్రభుగౌడ తీసుకెళ్తాడు. జనం దాంతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.
ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్