
బ్రెస్ట్ క్యాన్సర్...
అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన మహమ్మారి. రొమ్ము క్యాన్సర్‌పైన ప్రతి ఒక్కరికీ అవగాహన పెరగాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో రొమ్ము క్యాన్సర్‌పైన అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ 28న పింక్ పవర్ రన్ 2.0ను నిర్వహిస్తున్నారు. కిందటేడాది మొదటిసారిగా నిర్వహించిన ఈ రన్ అంతర్జాతీయంగా అవగాహన కల్పించడంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సైతం సొంతం చేసుకుంది. ఈ యేడాది నిర్వహించే పవర్ రన్‌కు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకులు సుధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్రైడెంట్ వేదికగా నిర్వహించి, రన్ కు సంబంధించిన టీషర్ట్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ – 2025 విజేత ఓపల్ సుచాత, మిస్ ఏషియా– 2025 క్రిష్ణా గ్రావిడెజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ అవగాహనకు మరింత శక్తిని జోడించారు. ఓపల్ సుచాత క్యాన్సర్ సర్వైవర్ కావడం, అంతర్జాతీయ స్థాయిలో తన సొంత ప్రాజెక్టులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పైన అవగాహన కల్పించడం విశేషం. ఈ కార్యక్రమం సందర్భంగా వీరు ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ...
ఇదొక ఉద్యమం
మొదటి ఎడిషన్ అందించిన ప్రోత్సాహంతో 2 ఎడిషన్ పింక్ పవర్‌రన్ 2.0ను మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇది మారథాన్ రన్ మాత్రమే కాదు.. ఇదొక ఉద్యమం. మహిళల స్వీయ సంరక్షణ, ముందస్తు జాగ్రత్త, బ్రెస్‌క్యాన్సర్‌పై అవగాహన పొందడానికి అంతర్జాతీయ వేదిక. ఈ రన్ లో గ్లోబల్ రన్నర్స్, ప్రముఖ స్ఫూర్తిదాయక మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు పాల్గొంటున్నారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన మహిళల అవస్థలు మాటల్లో వర్ణించలేం. అలాంటి వారికి మద్దతుగా నిలవడానికి సీఎస్‌ఆర్ బాధ్యతగా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ నిర్వహిస్తున్నాం.
దీనికి మెయిల్ ఫౌండేషన్ భాగస్వామిగా మద్దతును అందిస్తోంది. మా ప్రయత్నానికి సమాజంలోని అన్నివర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. కిందటేడాది 18 ఏళ్ల నుంచి 89 ఏళ్ల మహిళల వరకు ఈ రన్‌లో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది. ఇందులో పాల్గొనే వారికి ఉచిత ట్రాన్స్ పోర్ట్, రిజిస్ట్రేషన్ కల్పిస్తున్నాం. అంతేకాదు, వారికి మారథాన్ టెక్నిక్స్, బ్రీతింగ్ కంట్రోల్‌పై శిక్షణా అందిస్తున్నాం. పింక్ పవర్ రన్ 2.0 కోసం దాదాపు 150 మంది 6 నెలలుగా విశేష కృషి చేస్తున్నారు. రన్నింగ్ ఈవెంట్ రోజు ఎమర్జెన్సీ మెడికల్ సేవలూ అందుబాటులో ఉంటాయి.
సోషల్ మీడియా వేదికగా టోల్ ఫ్రీ నంబర్లను సైతం అందుబాటులో ఉంచాం. మా ప్రయత్నానికి మద్దతుగా మిస్ వరల్డ్ విన్నర్ ఓపల్ సుచాత ముందుకు రావడం అభినందనీయం. తన ప్రయాణం ఈ తరానికి స్పూర్తి. ఈ వేదిక పైన ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ ఆంకాలజిస్ట్ డా.ప్రఙ్ఞ చిగురుపాటి పాల్గొని ముందస్తుగా రొమ్ము కేన్సర్ గుర్తించడం ప్రాముఖ్యతను తెలియజేయడం మా అందరిలో స్పూర్తి నింపింది.
ప్రతి మహిళ ఈ మహమ్మారిని గుర్తించే మామోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్యాన్సర్ డిటెక్టింగ్ మొబైల్ బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు వినియోగించుకోవాలి. నా ఈ ప్రయాణంలో నా భర్త మేఘా క్రిష్ణారెడ్డి, నా పిల్లలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. – సుధారెడ్డి, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
తమను తాము సంరక్షించుకోవడం అవసరం
ప్రపంచసుందరిగా నేను గుర్తింపు పొందింది ఈ నేలపైనే. మళ్లీ ఇదే నేలపైన రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కల్పించే మహోన్నత కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం నా మరో ఇంటికి వచ్చినట్టే ఉంది. నా దేశంలో థాయ్‌లాండ్ లేదా భారత్‌లోనో కాదు యావత్ ప్రపంచమంతా ఈ రొమ్ము క్యాన్సర్ పెనుప్రమాదంగా మారుతోంది. 16 ఏళ్ల వయస్సులో నేనూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వ్యక్తినే. కానీ దానిని జయించి ఇప్పుడు ప్రపంచం ముందు మిస్ వరల్డ్‌గా నిలవగలిగాను. ఆ అవస్థలు, మానసిక వేదన ప్రస్తుత జీవితాన్ని ఎలా గడపాలో నేర్పింది.
దీనిపైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి, సమాజానికి జీవితాన్నే త్యాగం చేసే మహిళలకు తమను తాము సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. ముందస్తుగా దీనిని గుర్తించగలిగితే బయటపడగలమని చాలామంది మహిళలకు తెలియదు. ఈ వ్యాధి చూట్టూ ఎన్నో భయాలను పెంచుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కోసం నేను మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో మొదటి సారి కలిసిన ఒక మహిళ నాకెంతో స్ఫూర్తిని నింపింది. ఆమె నా కథను స్పూర్తిగా తీసుకున్నాను అని చెప్పడం ఎప్పటికీ మర్చి పోలేను.
ఆత్మస్థైర్యంతో నెవర్ గివప్ అంటూ ఆమె క్యాన్సర్‌ను జయించి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. మరొకరు నా అభిమాని తల్లి.. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ వచ్చి నయమై కొన్నేళ్ల తరువాత మళ్లీ వచ్చింది. తానొక టీచర్... అందరి భవిష్యత్‌లు తీర్చిదిద్దిన ఆమె తన భవిష్యత్ ఏమవుతుందో అని భయపడలేదు. చికిత్స తీసుకునే పరిస్థిలేని రోజులను దాటుకుని ఇప్పుడు క్యాన్సర్‌ను జయించి ఆరోగ్యంగా ఉంది. చాలాసార్లు నా మాటలతో మానసిక తోడ్పాటునందించాను. తనను కలిసి మాట్లాడిన ప్రతిసారీ నాలో ఓ కొత్త స్ఫూర్తి నింపుకుంటున్నాను. మహిళలెవ్వరూ ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా అవగాహన పెంచాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించాను. – ఓపల్ సుచాత, మిస్ వరల్డ్– 2025
మార్పు రావాలి
ప్రపంచంలోని ఏ మహిళా మొదటగా తనకు తాను ప్రాధాన్యతనిచ్చుకోదు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మార్పు రావాలి. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ప్రాథమిక పరీక్ష చేసుకోవాలి. దీనికి సంబంధించిన టెక్నిక్స్ తెలుసుకోవాలి. అంతర్జాతీయంగా ప్రభావితం చేసే బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు జరుగుతుండటం అభినందనీయం. ఇలాంటి ప్రయత్నంలో ప్రతి సెలిబ్రెటీ పాల్గొనాల్సిన అవసరం ఉంది. –క్రిష్ణా గ్రావిడెజ్, మిస్ ఏషియా– 2025