ముందస్తు పరీక్షలే బెస్ట్‌! | New breast cancer campaign targets younger women | Sakshi
Sakshi News home page

ముందస్తు పరీక్షలే బెస్ట్‌!

Oct 10 2025 4:48 AM | Updated on Oct 10 2025 4:48 AM

New breast cancer campaign targets younger women

స్క్రీనింగ్‌తో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు చెక్‌ 

రొమ్ము కాన్సర్‌పై మహిళలకు అవగాహన అవసరం 

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము కాన్సర్‌ బాధితులే  

అక్టోబరు రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం

ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రొమ్ము క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు.  

గుంటూరు మెడికల్‌: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్‌ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్‌ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్‌ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో  సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు.

జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్‌ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్‌ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌సెంటర్‌లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.   

‘మెమోగ్రామ్‌’ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు.. 
జీజీహెచ్‌లో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్‌ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెపె్టంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు.  

స్క్రీనింగ్‌ పరీక్షలతో చెక్‌  
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే ఇతర కుటుంబ సభ్యు లకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్‌ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్‌ బైరపనేని స్రవంతి, క్యాన్సర్‌ వైద్య నిపుణులు, గుంటూరు  

ఉచితంగా రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్లు... 
నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్‌ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్‌లో 24 గంటలు కార్పోరేట్‌ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్‌ వైద్యసేవలను అందిస్తున్నారు.  – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌

తొలిదశలోనే గుర్తించవచ్చు 
తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్‌తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.   – డాక్టర్‌ చక్కా సుజాత, సీనియర్‌ రేడియాలజిస్ట్, గుంటూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement