Sushmita Sen: పోటీనుంచి తప్పుకుందాం అనుకున్నా! | Miss World 2025: Sushmita Sen was crowned as Miss Universe 1994 | Sakshi
Sakshi News home page

Sushmita Sen: పోటీనుంచి తప్పుకుందాం అనుకున్నా!

May 9 2025 12:29 AM | Updated on May 9 2025 2:41 AM

Miss World 2025: Sushmita Sen was crowned as Miss Universe 1994

మిస్‌ వరల్డ్‌ 2025

అందాల పోటీల విషయానికి వస్తే1994 దేశానికి ముఖ్యమైన సంవత్సరం! ఆ ఏడే తొలి మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. ఆ ఏడే మిస్‌ వరల్డ్‌ క్రౌన్‌ కూడా వచ్చింది.. 28 ఏళ్ల తర్వాత.. రీటా ఫారియా పావెల్‌ తర్వాత! ఈ రెండు ఘనతల్లో మొదటిది సుష్మితా సేన్‌ సాధిస్తే రెండవది ఐశ్వర్య రాయ్‌ అచీవ్‌ చేసింది. ఇప్పుడు సుష్మితా సేన్‌ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం..!

సుస్మితా సేన్‌.. ఢిల్లీ పుట్టి, పెరిగిన బెంగాలీ! అడపాదడపా మోడలింగ్‌లో అవకాశాలతో సాగుతున్న ఆమె సరదాగా మిస్‌ ఇండియా పోటీలకు దరఖాస్తు చేసుకుంది. అయితే తర్వాత తెలిసింది ఆ పోటీలో ఐశ్వర్య రాయ్‌ కూడా పాల్గొననుందని. అంతే ఆమె కాన్ఫిడెన్స్‌ అంతా కరిగిపోయింది. అప్పటికే ఐశ్వర్యకున్న నేమ్‌ అండ్‌ ఫేమ్, ఆమె అందం, ఆత్మవిశ్వాసం గురించి సుస్మితాకు తెలుసు. 

 ఆ పోటీలో గెలుపు ఆమెదే అని అర్థమైంది! అందుకే ఆ పోటీ నుంచి తప్పుకోవాలనుకుంది. అమ్మతో, అప్పటి సుస్మితా బాయ్‌ ఫ్రెండ్‌ రజత్‌ తారాతోనూ అదే మాట చెప్పింది. అప్పుడు వాళ్ల అమ్మ, రజత్‌ ఇద్దరూ ధైర్యం చెప్పడంతో ఆ పోటీలో పాల్గొంది. ఐశ్వర్య అతి విశ్వాసం వల్ల ఆ కిరీటం కోల్పోయి సుస్మితాకు దక్కిందని నాటి మిస్‌ ఇండియా పోటీ సమీక్షకుల మాట.

విశ్వసుందరిగా.. 
మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుని మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొనే అవకాశం అందుకుంది సుస్మితా. దానికోసం ముంబైలో ట్రైన్‌ అవ్వాలి. అప్పుడూ అంతే.. ఒంటరిగా ముంబైలో ఉండలేను మొర్రో అని భయపడింది. ఆ సమయంలోనూ ఆమె వెన్నంటి ఉంది సుస్మిత బాయ్‌ ఫ్రెండ్‌ రజతే! అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీలో ఒక నెల రోజులు సెలవు అడిగాడు. వాళ్లు కుదరదనడంతో రాజీనామా చేసి సుస్మిత వెంట ముంబైకి ప్రయాణం అయ్యాడు. శిక్షణ ఆసాంతం ఆమె వెన్నంటే ఉన్నాడు.  

శారీరకంగా, మానసికంగా దృఢం కావడానికి సుస్మిత నాన్‌చాక్‌లో శిక్షణ తీసుకుంది. మిస్‌ యూనివర్స్‌ పోటీల కోసం వేల రూపాయలతో డిజైనర్‌ వేర్‌ను కొనేంత ఆర్థిక స్తోమత లేదు. ఢిల్లీ లోకల్‌ మార్కెట్‌లో గుడ్డ కొనుక్కుని.. గౌను కుట్టించుకుంది. కొత్త సాక్స్‌ను వాళ్లమ్మ చక్కటి గ్లోవ్స్‌గా కుట్టి, ఇచ్చింది. వీటితోనే మిస్‌ యూనివర్స్‌ పోటీలు జరిగిన మనీలా (ఫిలిప్పీన్స్‌)కి బయలుదేరింది.

 ఫైనల్‌ రౌండ్‌లో ఆ గౌను, ఆ గ్లోవ్స్‌తోనే అప్పియర్‌ అయింది సుస్మిత. ఆమె ఆ అటైర్‌కి అందరూ ఫిదా అయ్యారు. వాటికన్నా.. ఫైనల్‌ రౌండ్‌లోని ఆమె సమాధానం అందరినీ ఇంప్రెస్‌ చేసింది. ‘మహిళకు మీరిచ్చే నిర్వచనం ఏంటీ?’ అని జడ్జి అడిగిన ప్రశ్నకు ‘మహిళ.. ఆ దేవుడు భువికి పంపిన కానుక. కొత్త ప్రాణానికి ఊపిరిపోసే జనని మహిళ! ప్రేమానురాగాలు అంటే ఏంటో పురుషుడికి చూపించేది మహిళ!’ అని ఆమె జవాబు చెబుతుంటే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విశ్వ సుందరి కిరీటం ఆమెను వరించింది. 

తర్వాత..
సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అయింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. ఆ దత్తత కోసం అప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం చాలానే ఇబ్బంది పడింది. అయినా వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో ఆమె  తల్లిదండ్రులు.. సుభ్రా సేన్‌ (జ్యువెలరీ డిజైనర్‌), సుబీర్‌ సేన్‌ (రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌) ఆమెకు కొండంత అండ. వాళ్ల నాన్న అయితే దత్తత ఇచ్చే అధికారుల నమ్మకం కోసం తన కష్టార్జితంలోని పెద్ద మొత్తాన్ని రెనీ పేరు మీదకి మార్చాడట. 

అంత మద్దతు ఉంది కాబట్టే కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. ‘అందరు అమ్మలు తమ పిల్లల్ని పొట్టలో మోస్తారు. కానీ నా పిల్లల్ని నేను నా గుండెలో మోశాను. అందుకే ఆ బిడ్డలు నాకు స్పెషల్‌!’ అని చెబుతుంది సుస్మితా సేన్‌! ఇలా పిల్లల్ని దత్తత తీసుకుని తన తల్లి హృదయాన్ని, మహిళగా తాను నిలబడ్డ మహోన్నత స్థానాన్ని ప్రపంచానికి చాటి .. సుస్మితా అంటే మాటలే కాదు చేతలు కూడా అని నిరూపించింది.

మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్, మిస్‌ ఏషియా పసిఫిక్‌ పోటీలుంటాయి. మిస్‌ ఇండియా కిరీటం గెలుచుకున్న వారు ‘మిస్‌ యూనివర్స్‌’పోటీలకు అర్హులు. మిస్‌ ఇండియా పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌ అయిన వారు ‘మిస్‌ వరల్డ్‌’పోటీలకు వెళ్తారు. సెకండ్‌ రన్నరప్‌ ‘మిస్‌ ఏషియా పసిఫిక్‌’లో పాల్గొంటారు. ఇదికాక పర్యావరణ స్పృహ, కార్యాచరణకు సంబంధించి ‘మిస్‌ అర్త్‌’ అనే పోటీ కూడా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement