breaking news
Miss Universe sushmita
-
Sushmita Sen: పోటీనుంచి తప్పుకుందాం అనుకున్నా!
అందాల పోటీల విషయానికి వస్తే1994 దేశానికి ముఖ్యమైన సంవత్సరం! ఆ ఏడే తొలి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఆ ఏడే మిస్ వరల్డ్ క్రౌన్ కూడా వచ్చింది.. 28 ఏళ్ల తర్వాత.. రీటా ఫారియా పావెల్ తర్వాత! ఈ రెండు ఘనతల్లో మొదటిది సుష్మితా సేన్ సాధిస్తే రెండవది ఐశ్వర్య రాయ్ అచీవ్ చేసింది. ఇప్పుడు సుష్మితా సేన్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం..!సుస్మితా సేన్.. ఢిల్లీ పుట్టి, పెరిగిన బెంగాలీ! అడపాదడపా మోడలింగ్‌లో అవకాశాలతో సాగుతున్న ఆమె సరదాగా మిస్ ఇండియా పోటీలకు దరఖాస్తు చేసుకుంది. అయితే తర్వాత తెలిసింది ఆ పోటీలో ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొననుందని. అంతే ఆమె కాన్ఫిడెన్స్ అంతా కరిగిపోయింది. అప్పటికే ఐశ్వర్యకున్న నేమ్ అండ్ ఫేమ్, ఆమె అందం, ఆత్మవిశ్వాసం గురించి సుస్మితాకు తెలుసు. ఆ పోటీలో గెలుపు ఆమెదే అని అర్థమైంది! అందుకే ఆ పోటీ నుంచి తప్పుకోవాలనుకుంది. అమ్మతో, అప్పటి సుస్మితా బాయ్ ఫ్రెండ్ రజత్ తారాతోనూ అదే మాట చెప్పింది. అప్పుడు వాళ్ల అమ్మ, రజత్ ఇద్దరూ ధైర్యం చెప్పడంతో ఆ పోటీలో పాల్గొంది. ఐశ్వర్య అతి విశ్వాసం వల్ల ఆ కిరీటం కోల్పోయి సుస్మితాకు దక్కిందని నాటి మిస్ ఇండియా పోటీ సమీక్షకుల మాట.విశ్వసుందరిగా.. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనే అవకాశం అందుకుంది సుస్మితా. దానికోసం ముంబైలో ట్రైన్ అవ్వాలి. అప్పుడూ అంతే.. ఒంటరిగా ముంబైలో ఉండలేను మొర్రో అని భయపడింది. ఆ సమయంలోనూ ఆమె వెన్నంటి ఉంది సుస్మిత బాయ్ ఫ్రెండ్ రజతే! అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీలో ఒక నెల రోజులు సెలవు అడిగాడు. వాళ్లు కుదరదనడంతో రాజీనామా చేసి సుస్మిత వెంట ముంబైకి ప్రయాణం అయ్యాడు. శిక్షణ ఆసాంతం ఆమె వెన్నంటే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా దృఢం కావడానికి సుస్మిత నాన్చాక్లో శిక్షణ తీసుకుంది. మిస్ యూనివర్స్ పోటీల కోసం వేల రూపాయలతో డిజైనర్ వేర్‌ను కొనేంత ఆర్థిక స్తోమత లేదు. ఢిల్లీ లోకల్ మార్కెట్లో గుడ్డ కొనుక్కుని.. గౌను కుట్టించుకుంది. కొత్త సాక్స్‌ను వాళ్లమ్మ చక్కటి గ్లోవ్స్గా కుట్టి, ఇచ్చింది. వీటితోనే మిస్ యూనివర్స్ పోటీలు జరిగిన మనీలా (ఫిలిప్పీన్స్)కి బయలుదేరింది. ఫైనల్ రౌండ్లో ఆ గౌను, ఆ గ్లోవ్స్‌తోనే అప్పియర్ అయింది సుస్మిత. ఆమె ఆ అటైర్కి అందరూ ఫిదా అయ్యారు. వాటికన్నా.. ఫైనల్ రౌండ్‌లోని ఆమె సమాధానం అందరినీ ఇంప్రెస్ చేసింది. ‘మహిళకు మీరిచ్చే నిర్వచనం ఏంటీ?’ అని జడ్జి అడిగిన ప్రశ్నకు ‘మహిళ.. ఆ దేవుడు భువికి పంపిన కానుక. కొత్త ప్రాణానికి ఊపిరిపోసే జనని మహిళ! ప్రేమానురాగాలు అంటే ఏంటో పురుషుడికి చూపించేది మహిళ!’ అని ఆమె జవాబు చెబుతుంటే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విశ్వ సుందరి కిరీటం ఆమెను వరించింది. తర్వాత..సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. ఆ దత్తత కోసం అప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం చాలానే ఇబ్బంది పడింది. అయినా వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు.. సుభ్రా సేన్ (జ్యువెలరీ డిజైనర్), సుబీర్ సేన్ (రిటైర్డ్ వింగ్ కమాండర్) ఆమెకు కొండంత అండ. వాళ్ల నాన్న అయితే దత్తత ఇచ్చే అధికారుల నమ్మకం కోసం తన కష్టార్జితంలోని పెద్ద మొత్తాన్ని రెనీ పేరు మీదకి మార్చాడట. అంత మద్దతు ఉంది కాబట్టే కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. ‘అందరు అమ్మలు తమ పిల్లల్ని పొట్టలో మోస్తారు. కానీ నా పిల్లల్ని నేను నా గుండెలో మోశాను. అందుకే ఆ బిడ్డలు నాకు స్పెషల్!’ అని చెబుతుంది సుస్మితా సేన్! ఇలా పిల్లల్ని దత్తత తీసుకుని తన తల్లి హృదయాన్ని, మహిళగా తాను నిలబడ్డ మహోన్నత స్థానాన్ని ప్రపంచానికి చాటి .. సుస్మితా అంటే మాటలే కాదు చేతలు కూడా అని నిరూపించింది.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఏషియా పసిఫిక్ పోటీలుంటాయి. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న వారు ‘మిస్ యూనివర్స్’పోటీలకు అర్హులు. మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నరప్ అయిన వారు ‘మిస్ వరల్డ్’పోటీలకు వెళ్తారు. సెకండ్ రన్నరప్ ‘మిస్ ఏషియా పసిఫిక్’లో పాల్గొంటారు. ఇదికాక పర్యావరణ స్పృహ, కార్యాచరణకు సంబంధించి ‘మిస్ అర్త్’ అనే పోటీ కూడా ఉంటుంది. -
పెళ్లి కాని తల్లి.. విశ్వసుందరి!
పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించటం సాధ్యమేనా? అవును.. మనసున్న మనిషిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని, వారిలో ఒకరికోసం న్యాయపోరాటం కూడా చేసిన ధీర.. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్. అందాల పోటీల్లో విజేత కావడం, బాలీవుడ్ అభిమానుల హృదయాలు కొల్లగొట్టడమే కాదు.. సేవా కార్యక్రమాల్లో ముందుండి మహిళలకు స్ఫూర్తినిచ్చిన సుస్మిత.. 38వ పడిలోకి అడుగుపెట్టింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. సుమారు పదకొండేళ్ల క్రితం యానీ అనే చిన్నారిని సుస్మితా దత్తత తీసుకుంది. రెండేళ్ల క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. న్యాయస్థానంలో పోరాటం చేసి విజయం సాధించింది. అయితే వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, తమ మధ్య అది ఎప్పటికీ అడ్డు కాదని స్పష్టం చేసింది. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి ప్రవేశించింది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. సమయమంతా పిల్లలకే కేటాయిస్తోంది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపించిన సుస్మితా సేన్, ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించాలన్నా, బిడ్డలకు రుచి చూపాలన్నా పేగు తెంచుకున్న బంధమే అక్కర్లేదని నిరూపిస్తోంది సుస్మిత. ఇప్పటికీ అప్పుడప్పుడు లవ్ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఆ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుస్మితానే ఓ కార్యక్రమంలో ప్రకటించింది కూడా. అయితే వరుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.